హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్యాదవ్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి, శుభప్రదపటేల్తో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సర్కారు విద్యా విధానం నిర్లక్ష్యానికి గురవుతున్నదని మండిపడ్డారు. విద్యాశాఖకు మంత్రి లేకుండా పోయారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో పట్ట పగలే దోపిడీలు, దొంగతనాలు జరుగుతుంటే హోంమంత్రి ఎక్కడా అంటూ ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకులాలను సర్కారు నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. బడిలో టీచర్లు మధ్యాహ్న భోజనం పథకం కోసం వంట మనుషులుగా అవతారమెత్తాల్సిన దుస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి విమర్శించారు. హైకోర్టు తీర్పును గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యార్థులు, రైతుల సమస్యలపై బీజేపీ నోరెత్తకపోవడం విడ్డూరమన్నారు. పార్టీ నేత శుభప్రద్‌పటేల్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల ని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఫీజు బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్ అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మండిపడ్డారు.