ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ఆరుగాలం కష్టించి పంటలు పడిస్తే, కనీసం కొనే దిక్కులేదని ఆవేదన చెందుతున్నారు. ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాలకు తరలించి రోజులు గడుస్తున్నా కాంటా వేయకపోవడంతో రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో కనీస సదుపాయాలు లేకపోవడంతో అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయని కన్నీరు పెట్టుకుంటున్నారు. సర్కార్ నిర్లక్ష్యం తమ ప్రాణాల మీదకు వస్తున్నదని వాపోతున్నారు. కాంగ్రెస్ పాలన ఎప్పుడు విరుగడ అవుతుందోనని శాపనార్ధాలు పెడుతున్నారు. పండించిన ప్రతి గింజనూ కొనాలని డిమాండ్ చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలను సర్కార్ పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కాంటా పెట్టడంలో జాప్యంపై రైతులు రోడ్డెక్కితే తప్ప అధికారులు స్పందించడం లేదని ధ్వజమెత్తారు.

కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి శనివారం ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్క, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు నష్టం కలుగకుండా చూడాలని అదనపు కలెక్టర్‌కు ఫోన్‌చేసి కోరారు.
– మెట్పల్లి

తరుగు పేరుతో మిల్లర్లు, అధికారులు తమను నిండా ముంచుతున్నారని రైతులు కన్నెర్ర చేశారు. శనివారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. రోడ్డుపై ధాన్యం పోసి నిప్పంటించి నిరసన తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించి మిల్లులకు తరలిస్తే క్వింటాకు 5 నుంచి 7 కిలోల వరకు మిల్లర్లు తరుగు తీస్తున్నారని వాపోయారు.
– వీపనగండ్ల

మక్కలు, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి సెంటర్లో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మెగిళి మాట్లాడుతూ.. రైతులకు సరిపడా గన్నీ సంచులు అందించి, కాంటా పెట్టి, ట్రాన్స్‌పోర్టులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.
– దుగ్గొండి

పభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవ డంతో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోటలోని శివాజీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవరకద్ర నియోజకవర్గంలో 25 రోజులు కిందట వరి పంటలు చేతికొచ్చాయని, 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా ధాన్యం కొనడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్కార్ తీరు మారకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
– కొత్తకోట

కొనుగోలు చేసిన మక్కలను వెంటనే గోదాములకు తరలించాలని డిమాండ్ చేస్తూ శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని పాత బస్‌స్టాండ్ సర్కిల్ వద్ద అయిజ-గద్వాల రోడ్డుపై రైతులు బైఠాయించారు. కాంటా వేసిన మక్కలను నెలరోజులైనా గోదాములకు తరలించకపోవడంపై మండిపడ్డారు. గంటసేపు ఆందోళన కొనసాగడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వీరి ఆందోళనకు బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు కుర్వ పల్లయ్య మద్దతు తెలిపారు.
– అయిజ

కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట రైతులు ఆందోళన బాటపట్టారు. శనివారం ఇందారం బస్‌స్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించగా కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయా యి. 20 రోజులుగా కేంద్రంలో ఆరబోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నట్టు వాపోయారు. నెల రోజులుగా
ఒక్క లారీ కూడా పోలేదని మండిపడ్డారు. తమకు ఎమ్మెల్యే, మంత్రి ఒక్కరే ఉన్నా సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నట్టా? లేనట్టా? అని మండిపడ్డారు.
– జైపూర్

వారం రోజుల్లో ధాన్యం మొత్తం కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకోలు చేపడుతామని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హెచ్చరించారు. శనివారం ఆయన జనగామ జిల్లా చిల్పూరులోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో కలిసి రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతుల ధాన్యం కొనకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు.
– చిల్పూరు

బయోమెట్రిక్ కోసం మక్క రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో జాంబవ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. మక్క కాంటా వేయగానే రైతులు బయోమెట్రిక్ కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు రైతులు అక్కడ వేచి ఉండాల్సి వచ్చింది. మహిళా రైతులు కూడా పోలీసుస్టేషన్లో ఉండి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
– రాయపర్తి

తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఖమ్మం జిల్లా కొణిజర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు.. ఫోన్లో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడి.. కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు.
– వైరా టౌన్(కొణిజర్ల)

అకాల వర్షాలకు తడిసిన మక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ డిమాండ్ చేశారు. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం రేపల్లెవాడ కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి శనివారం ఆయన సందర్శించారు. వర్షానికి తడిసిన మక్కలు, మొలకెత్తిన మక్కజొన్న గింజలను పరిశీలించారు. మక్కల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అక్కడే ధర్నా చేశారు.
– ఇల్లెందు

పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్ వద్ద జాతీయ రహదారిపై శనివారం ముథోల్ బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం, తూకం వేసిన పంటను తరలించకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు.
– భైంసా టౌన్

ఖమ్మం నగరంలోని త్రీటౌన్ ప్రాంత వాసులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఓ వైపు ఖమ్మం మార్కెట్‌కు మిర్చి పంటతో వచ్చే వాహనాలు.. మరోపక్క కొత్తగా మక్కజొన్న లోడ్ వాహనాల రాకతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలకు అను గుణంగా దిగుమతికి హమాలీలను సమకూర్చకపోవడంతో రోజుల తరబడి వాహనాలు రోడ్డుపై నే ఉంటున్నాయి. ఒక్కసారిగా వాహనాలు పోటెత్తకుండా నగర శివారులోనే నిలిపివేసి దిగుమతికి అనుగుణంగా మార్కెట్‌కు తరలిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేవి కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
– రఘునాథపాలెం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఏఎంసీ, సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. టార్పాలిన్లు కొట్టుకుపోవడంతో పలువురి రైతుల ధాన్యం
కొట్టుకుపోయింది. తేమ శాతం వచ్చినప్పటికీ వడ్లు కొంటలేరని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. లారీల కొరతతో ధాన్యం మిల్లులకు తరలించక పోవడంతో బస్తాల్లో నిల్వ ఉంచిన వడ్లు తడిచిపోయాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లిలోని కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిపోయాయి.
-రుద్రంగి/గంగాధర