అకాల వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి.. సగానికి సగం తగ్గిన దిగుబడులు.. తేమ పేరుతో సీసీఐ బ్లాక్మెయిల్.. బహిరంగ మార్కెట్లో దక్కని మద్దతు ధర.. దిగుమతి సుంకం ఎత్తివేత.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తెలంగాణ పత్తి రైతులపై వరుసదాడులు తీరని నష్టాలకు గురిచేస్తున్నాయి. ప్రకృతి దాడిని మించి పత్తిరైతుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరోక్షదాడి చేస్తున్నది. తీరని ద్రోహానికి ఒడిగడుతున్నది. దూది పూలకు మోదీ సర్కార్ దుఃఖమే తెచ్చిపెట్టింది.
వరంగల్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ (Telangana) పత్తి రైతులపై (Cotton Farmers) ప్రకృతి దాడిని మించి కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం పరోక్షంగా దాడి చేస్తున్నది. రాష్ట్రంలో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఉపన్యాసాల ఊచకోతకు పోటీపడే ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురు ఇతర బీజేపీ ఎంపీలు, మరో 8 మంది కాంగ్రెస్ ఎంపీలకు పత్తి రైతు గురించి పట్టింపే లేకుండా పోయింది. తరచూ ఢిల్లీ బాటపట్టే సీఎం రేవంత్రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు ఎంతసేపూ కేంద్రానికి వత్తాసు పలుకడమే తప్ప రైతుల కష్టాలను పట్టించుకోవడమే మరిచారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘స్వదేశీ’ నినాదంతో ఊదరగొట్టే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉన్నఫలంగా దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. ఒక్క నిర్ణయంతో 11 శాతం సుంకం ఎత్తివేతకు గురికావడంతో అమెరికా ఎగిరి గంతేసింది. ఈ ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రకటించిన ఈ మినహాయింపును కేంద్రం ఏకంగా డిసెంబర్ 31 వరకు పొడిగించింది. దీంతో ప్రపంచంలోనే కాటన్ దిగుబడిలో మొదటిస్థానంలో ఉన్న భారత పత్తి రైతులకు తీరని నష్టాలనే తెచ్చిపెట్టింది. రాష్ట్రంలో వరి తర్వాత అత్యధికంగా పత్తి సాగుచేసే రైతులకు కేంద్రం దిగుమతి సుంకం ఎత్తివేత నిర్ణయం ఆశనిపాతమైంది.
సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో పత్తి చేతికి వస్తుంది. పత్తి మార్కెట్కు వచ్చే సమయంలోనే దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడంతో సీసీఐ తన కొనుగోళ్ల ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తుంది. ఈ దశలో ప్రైవేట్ వ్యాపారులెవరూ ముందుకు రారు. దిగుమతి సుంకం ప్రభావ తీవ్రతను ముందే గుర్తించి.. ప్రధాని మోదీకి నివేదించాల్సిన రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఆ సమస్య తమది కాదని పట్టింపే లేకుండా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర రైతాంగం తీరని నష్టాలను చవిచూడాల్సి వస్తున్నది.
మునుపెన్నడూలేని విధంగా ఈసారి కేంద్రం (సీసీఐ) తెచ్చిన కిసాన్ కపాస్ యాప్ రైతులకు గుదిబండగా మారింది. రైతు ఏ రోజు, ఏ సమయంలో, ఏ జిన్నింగ్ మిల్లుకు పత్తి తీసుకెళ్తారనే అంశాలను పొందుపరిచి రైతు స్లాట్ బుక్ చేసుకోవాలి. అలా చేసిన రైతు పత్తినే కొనుగోలు చేస్తామని సీసీఐ తెగేసి చెప్తున్నది. ఈ విధానంపై పత్తి రైతులు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో రైతుల ఆందోళనను గుర్తించి కేంద్రానికి అవసరమైన సూచనలకు ప్రతిపాదించాల్సిన కేంద్ర మంత్రులు, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు అసలది తాము పట్టించుకోవాల్సిన అంశమే కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు.
పత్తి కొనుగోళ్ల విషయంలో మొదటి నుంచి సీసీఐ పత్తిరైతుతో దోబూచులాట ఆడుతున్నది. ఇదే దశలో పత్తి రైతుకు నష్టం కలిగించేలా సీసీఐ తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంతపాడుతున్నది. సీసీఐకి, జిన్నింగ్మిల్లులకు మధ్య జరుగుతున్న పంచాయితీని పరిష్కరించాల్సిందిపోయి బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. సీసీఐ కొత్త నిబంధనల పేరుతో పత్తిరైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నా.. బీజేపీ సర్కార్ పట్టించుకోవడమే లేదు. రాష్ట్రంలోని జిన్నింగ్మిల్లులకు ఇచ్చిన గ్రేడింగ్ విధానం తమకు ఎంతమాత్రం ఇష్టంలేదని కాటన్ వ్యాపారులూ ఆందోళన చేస్తున్నారు. జిన్నింగ్ మిల్లులను ఎల్1, ఎల్2, ఎల్3గా విభజించింది. మిల్లుకు 15 కి.మీ. దూరంలోని పత్తి మాత్రమే వచ్చేలా కొత్త నిబంధన విధించారు.
ఈ నిబంధన ద్వారా తొలుత ఎల్1 మిల్లు పూర్తి కెపాసిటీ పత్తి నిండిన తర్వాత ఎల్2కి, ఆ తర్వాత ఎల్3కి పత్తిని కేటాయిస్తారు. ఈ నిబంధనల వల్ల కిందిస్థాయి మిల్లులు నష్టపోతాయనే అభ్యంతరాన్ని మిల్లర్లు వ్యక్తంచేస్తున్నారు. అదే విధంగా 15 కిలోమీటర్ల దూరం, ఒక జిల్లా పరిధిలోని పత్తి ఆ జిల్లాలోని మిల్లులకే వెళ్లాలనే నిబంధనపైనా అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ఈ నిబంధనలతో తామే కాకుండా రైతులకు నష్టం కలుగుతుందని జిన్నింగ్ మిల్లుల యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నం అవుతున్న సమస్యలను కేంద్రమంత్రులైన కిషన్రెడ్డి, బండి సంజయ్ కనీసం పరిష్కరించేందుకు చొరవ చూపడమే లేదు. తమ ప్రాంతాల రైతులు ఇంతగా అవస్థలు పడుతున్నా, రాష్ట్రంలోని ఇతర ఎంపీలు సైతం పట్టించుకోవడం లేదు. కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిందిపోయి.. పరోక్షంగా సీసీఐని ఎగదోస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పత్తి కొనుగోళ్లను ఎంత వీలైతే అంత తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని ఉసిగొలిపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా కొనుగోళ్లలో సీసీఐ కొర్రీల పెడుతున్నది. పత్తి చేతికొచ్చిన ఈ దశలో అకాలవర్షాలు చుట్టుముట్టాయి. అకాల వర్షాలతో పత్తి పూర్తిగా తడిసిపోయింది. చేనుమీదే ఉన్న పత్తి తడిసిపోవడం ఒక ఎత్తయితే, ఏరి నిల్వచేసిన పత్తి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసి ముద్దయింది. ఆ పత్తిని ఆరబెట్టినా సాధారణ తేమ శాతం రావడం లేదు. ఇదే సమయంలో సీసీఐ విధించిన 12 శాతం తేమ నిబంధన రైతును మరింత కుంగదీసింది. 12శాతానికి ఏ మాత్రం ఎక్కువగా ఉన్నా సీసీఐ నిర్ధాక్షిణ్యంగా నిరాకరిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.