హైదరాబాద్, ఏప్రిల్12 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్ల అమలులో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మే 27న బీసీల ధర్మయుద్ధ భేరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ వెల్లడించారు. పార్టీలు, సంఘాలకు అతీతంగా జెండాలు, అజెండాలను పకనపెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివిధ బీసీ, కులసంఘాలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశంలో బీసీలతోపాటు కాంగ్రెస్ పార్లమెంటరీ పక్షనేత రాహుల్‌గాంధీని కూడా సీఎం రేవంత్‌రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు.
బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయకుండా 9వ షెడ్యూల్ పేరిట వంచిస్తున్నారని నిప్పులు చెరిగారు. కామరెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ ప్రకారం.. కాంగ్రెస్ ప్రభు త్వం తక్షణం 42% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరి సత్యనారాయణ, బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్‌గౌడ్, బీసీ ఫ్రంట్ ప్రెసిడెంట్ పలూరి రామకృష్ణ, వివిధ బీసీ సంఘాల నేతలు లోడంగి గోవర్ధన్ యాదవ్, మేకల కృష్ణ, కర్నాటి శ్రీనివాస్‌నేత, పాలూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.