 
                                                            హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ): కాంగ్రెస్ గద్దెనెక్కి (Congress) దాదాపు రెండేండ్లు కావొస్తున్నా అన్నింటా వైఫల్యం వెక్కిరిస్తున్నది. 22 నెలల పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలను సంతృప్తి పరచలేకపోయిన సీఎం రేవంత్‌రెడ్డిపై (Revanth Reddy) అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తన అసహనాన్ని ఎవరిపై వ్యక్తపరచాలో తెలియని సీఎం చివరికి అన్నింటికీ అధికారులను బలిచేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలకు వారే కారణమని నెపాన్ని వారిపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం జీహెచ్ఎంసీ (GHMC) ప్రాజెక్టు విభాగంపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలోనూ ఇది స్పష్టంగా కనిపించింది.
మాటలు చెప్పడం కాదని, పనులెప్పుడు ప్రారంభిస్తారని ఇంజినీర్లను మందలించారు. దీంతో విస్తుపోవడం అధికారుల వంతైంది. హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, బడ్జెట్లో రూ. 10 వేల కోట్లకుపైగా నిధులు ఇచ్చామని బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా గొప్పలు చెప్పిన సీఎం ఆచరణలో రెండేండ్లుగా ఒక్క ప్రాజెక్టును కూడా చేపట్టలేదు. పనులకు సంబంధించి ఎక్కడా తట్టెడు మట్టి కూడా తీసిన దాఖలాల్లేవు. బీఆర్ఎస్ హయాంలో ఆదర్శవంతమైన ఎస్ఆర్డీపీ పథకం పేరును ‘హెచ్ సిటీ’(హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)గా పేరుమార్చిన రేవంత్ సర్కారు రెండేండ్లుగా ఒక్క ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించలేదు.
విచిత్రమేమిటంటే రూ.1,090 కోట్లతో కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మించ తలపెట్టిన ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్ పనులకు గతేడాది డిసెంబర్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించగా వీటిలో ఏ ఒక్క పనీ ప్రారంభం కాలేదు. భూ సేకరణపై స్పష్టత లేకుండానే ఆగమేఘాలపై టెండర్లు పిలిచారు. పురపాలక శాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పుణ్యమా అని ప్రాజెక్టుల అలస్యాన్ని ఇంజినీర్లపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మూడు రోజుల క్రితం జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం ఇంజినీర్లు సీఎం వద్దకు వెళ్లగానే ‘మీరు వస్తున్నారు, ఏదో చెప్తున్నారు, వెళ్తున్నారు గానీ క్షేత్రస్థాయిలో ఒక ప్రాజెక్టు పని కూడా ప్రారంభం కావడం లేదు’ అని సీఎం వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇటీవలే హెచ్ఎండీఏ ప్రతిపాదించిన సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫామ్ వరకు నిర్మించాల్సిన ఎలివెటేడ్ కారిడార్ పనులను ఆ విభాగం ప్రారంభించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ మీరు మాటలు చెబుతున్నారే గానీ, పనులెపుడు ప్రారంభిస్తారని ఇంజినీర్లపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. రూ. 7,038 కోట్ల వ్యయంతో అయిదు ప్యాకేజీలుగా మొత్తం 23 పనులకు సరారు మంజూరీ ఇవ్వడంతో పాటు అంచనా వ్య యానికి పాలనాపరమైన మంజూరీని కూడా ఇచ్చినా, పనులు ఎందుకు మొదలు పెట్టడం లేదని సీఎం ప్రశ్నించినట్లు సమాచారం.
హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 38 చోట్ల పనుల్లో భాగంగా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ. 7,032 కోట్లు ఖర్చు చేయనున్నారు. 28 ఫ్లై ఓవర్లు, 13 అండర్‌పాస్‌లు, నాలుగు ఆర్వోబీలు, మూడు చోట్ల ఆర్‌యూబీలు, పది చోట్ల రహదారుల విస్తరణ పనులకు గానూ టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సి ఉండగా నేటికీ టెండర్ దశలోనే ఉన్నాయి. 13 చోట్ల పనులకు టెండర్లు పిలవగా వివిధ దశల్లో ఉన్నాయి. మరో 15 చోట్ల పనులకు టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. కాగా, 30 చోట్ల పనులకు మాత్రం ప్రతిపాదన దశలోనే ఉండడం గమనార్హం. కాగా రూ. 780 కోట్ల నిధులు ప్రభుత్వం ఇస్తే కానీ భూ సేకరణ ముందడుగు పడని పరిస్థితి నెలకొంది.
అన్నింటి కంటే మించి ఇటీవల కాలంలో నానల్‌నగర్, రేతిబౌలి ఫ్లై ఓవర్ల పనులు, కంటోన్మెంట్ ఐవోసీ పనుల టెండర్లకు కాంట్రాక్టర్లు అసక్తి చూపకపోవడంతో రీ టెండర్ కాల్ చేయడం హెచ్ సిటీ ప్రాజెక్టు ఏ స్థితిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగానికి చీఫ్ ఇంజినీర్‌గా భాస్కర్‌రెడ్డికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఆయన ముఖ్యనేతలో ఒకరికి సమీప బంధువు కావడంతో జోడు పదవులను కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. కేసీఆర్ ప్రభు త్వం హైదరాబాద్ రవాణా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి వాయు వేగంతో 37 ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను చేపట్టి చాలా ప్రాంతాల్లో సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేసింది.
గుంతలు లేని రహదారులే లక్ష్యంగా సీఆర్ఎంపీ పథకాన్ని రూ. 900 కోట్లతో చేపట్టి ఆదర్శవంతమైన పథకంగా మార్చింది. అయితే, ఈ మూడు కీలక ప్రాజెక్టులకు గత సర్కారు రెండో దశ ప్రతిపాదనలతో సిద్ధం చేసి ప్రభుత్వ స్థాయిలో పరిశీలన ఉండటం, అదే సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ పథకాల స్థానంలో హెచ్ సిటీ ప్రాజెక్టుగా ఒకే గొడుగు కిందకు తెచ్చింది. రవాణా వ్యవస్థ, మౌలిక వసతుల కల్పనకు గానూ హెచ్ సిటీ కింద రూ. 2,675.35 కోట్లు కేటాయించింది. ఈ నిధులను ఇప్పటి వరకు మంజూరు చేయకపోవడంతో ఆ ప్రభావం పనులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.
కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్ సిటీ ప్రాజెక్టు పనులను ప్రారంభం కావాలంటే పార్కు చుట్టూ వీవీఐపీలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించి ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 92లో నివసించే మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి సంబంధించిన 250 గజాల స్థలం, జూబ్లీహిల్స్ రోడ్ నం 45లో ఉన్న నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చెందిన 377 గజాలు, మాజీ మంత్రులు సమరసింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు రేణుకాచౌదరి, నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి ఒక్కొక్కరిదీ దాదాపు 300 గజాల స్థలాన్ని అధికారులు సేకరించాల్సి ఉంది. అయితే భూ సేకరణకు ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. దీనికితోడు పనులు, నిధులు, అనుమతులు, భూసేకరణ, పాలసీపై స్పష్టత లేకపోవడమే జాప్యానికి కారణమని అధికారులు చెప్తున్నారు.
 
                            