కొత్తగూడెం సింగరేణి, జనవరి 19 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో ప్రవేశపెట్టిన సైట్ విజిట్ సర్టిఫికెట్ క్లాజ్ దేశీయ బొగ్గు పరిశ్రమలోనే అతి పెద్ద కుంభకోణానికి కేంద్రబిందువుగా మారిందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ బొగ్గు గనుల్లో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఓపెన్ కాస్టు గనుల్లో మట్టి తొలగింపు పనులకు టెండర్లు పిలిచినప్పుడు సాంకేతిక, ఆర్థిక అర్హతలే ప్రామాణికంగా ఉంటాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రామగుండం ఓసీ నుంచి మొదలుపెట్టి నైనీ ఎండీవో టెండర్, మణుగూరు పీకేవోసీ వరకు ప్రతిచోటా సైట్ విజిట్ సర్టిఫికెట్ క్లాజులను అస్త్రంగా వాడుకుంటున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మంత్రులు, నాయకులు ఎవరికి చెబితే వారికే టెండర్లు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఒడిశాలోని నైనీ బొగ్గుగని ఎండీవో టెండర్ వ్యవహారంతో కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలు రోడ్డున పడ్డాయని, వేల కోట్ల కాంట్రాక్టును తమ అనుచురులకు ఇప్పించుకునే క్రమంలో ఇద్దరు కీలక మంత్రుల వర్గాల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొన్నదని తెలిపారు. రాష్ట్రంలో ఏ చిన్న అవకాశం దొరికినా విరుచుకుపడే బీజేపీ ఇంతటి భారీ కుంభకోణంపై ఎందుకు మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు. రామగుండం నుంచి మణుగూరు వరకు జరిగిన 4-5 ప్రధాన టెండర్లలో ఎవరెవరికి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చారో సింగరేణి యాజమాన్యం శ్వేతపత్రం విడుదల చేయాలని, సీబీఐ, ఎస్ఐటీ పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు.