హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే తంత్రాన్ని అమలు చేసే పనిలో పడింది. రెండు మూడు వారాల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ఎన్నికల తాయిలాలు కుమ్మరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా.. మొన్నటివరకు ఎన్నికల హామీల అమలును పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా పథకాలను అమలుచేస్తుండటమే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పథకాలను అమలుచేయకపోతే పంచాయతీ ఎన్నికల్లో పరాభవం తప్పదనే ఆందోళన సర్కారు పెద్దల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఎన్నికల వేళ… పట్టాలపైకి పథకాలు
ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, కొత్త రేషన్‌కార్డుల పంపిణీ, తొలిసారిగా పూర్తి రైతుభరోసా… ఇవీ కొద్దిరోజులుగా ప్రభుత్వం రాష్ట్రంలో పట్టాలపైకి ఎక్కించిన పథకాలు. వాస్తవానికి కాంగ్రెస్ సర్కారు ఈ పథకాలను ఏడాదిన్నరగా కోల్డ్‌స్టోరేజీలో పెట్టింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు వెళ్తుండటంతో వాటిని బయటకు తీసి అమలుచేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు నాలుగు సీజన్లకు సంబంధించిన రైతుభరోసా ఇవ్వాల్సి ఉన్నది. ఇందులో రెండు సీజన్లకు మాత్రమే పూర్తిగా ఇచ్చిన ప్రభుత్వం మిగిలిన రెండు సీజన్లకు ఎగ్గొట్టింది. గత వానకాలం రైతుభరోసాలో రైతులకు నయా పైసా విడుదల చేయలేదు. మొన్నటి యాసంగిలో మూడు ఎకరాల వరకు మాత్రమే పంపిణీ చేసింది. అలాంటిది ఈ వానకాలం సీజన్‌కు మాత్రం తొమ్మిది రోజుల్లోనే రైతులందరికీ రైతుభరోసా జమ చేసింది. ప్రభుత్వ తీరుపై రైతులు కూడా ఆశ్చర్యపోయారు. ఇదంతా తమపై ప్రేమ కాదని, పంచాయతీ ఎన్నికల కోసమేనని రైతులు చర్చించుకుంటున్నారు.
గత వానకాలం రైతుభరోసాను ఎందుకు ఎగ్గొట్టిందని, యాసంగిలో సగమే ఎందుకు ఇచ్చిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఐదేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఏడాదిన్నర తర్వాత రెండు లక్షల ఇండ్లను మాత్రమే మంజూరు చేసింది. ఇది కూడా నెల క్రితమే అర్హులను ఎంపిక చేసింది. మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం చెప్తున్నది. కానీ, ఒక్కో గ్రూపునకు రూ.20 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం ఇందులో రూ.5 లక్షలకు మాత్రమే పావలా వడ్డీని వర్తింపచేస్తున్నట్టు తెలిసింది. కానీ, ప్రభుత్వం మాత్రం మొత్తం రుణాన్ని పావలా వడ్డీకి ఇస్తున్నట్టుగా తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఎన్నికల్లో లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. రేషన్‌కార్డుల విషయంలో ఏడాదిన్నరగా నాలుగుసార్లు దరఖాస్తులు తీసుకుంటూ సాగదీత ధోరణి అవలంభించింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆగమేఘాలపై కొత్త రేషన్ కార్డులను జారీచేసింది. ఈ పరిమాణాలన్నీ స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనని అభిప్రాయపడుతున్నారు.