హైదరాబాద్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ) : ‘ఆడలేక మద్దెల ఓడు’ సామెత చందంగా రైతులకు యూరియా కొరత తీర్చలేని కాంగ్రెస్ సర్కారు.. కొరతను కప్పిపుచ్చేందుకు కోతలు పెడుతున్నది. రెండేండ్లుగా రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయలేక వారిని రోడ్డెక్కెలా చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో పిడుగు వేసింది. యూరియా పంపిణీలో కోత పెట్టింది. ఇందులో భాగంగానే ఎకరానికి ఏ పంటకు ఎంత యూరియా ఇవ్వాల్నో లెక్క తేల్చింది. కొత్తగా తీసుకొస్తున్న యూరియా బుకింగ్ యాప్‌లో కోతలకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించింది. యాప్‌లో చూపించినంత యూరియానే పంపిణీ చేయనున్నది. ఈ మేరకు ఇకపై రైతులకు అవసరమైన యూరియా ఇవ్వరు.. సర్కారు ఎంతిస్తే అంతే తీసుకోవాలి. అంతకుమించి ఒక్క బస్తా ఎక్కువివ్వరు. యూరియా పంపిణీలో కోత పెట్టడంలో భాగంగా ఏ పంటకు ఎన్ని బస్తాలివ్వాలనేదానిపై వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం యాసంగిలో ఎక్కువగా వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు సాగు చేస్తారు.
ఈ పం టలకు ఎకరానికి ఎంత యూరియా ఇవ్వాలో సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా వరి ఎకరానికి 2 బస్తాలు, మొక్కజొన్న 3 బస్తాలు, మిర్చికి 5 బస్తాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనిపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తమ అవసరాలు, భూముల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా అంతటికీ ఒకేలా ఇవ్వడమేమిటని మండిపడుతున్నారు. ఈ బస్తాలు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. సా ధారణంగా వరి ఎకరానికి 3-4 బస్తాలు, మక్కజొన్న 4-5 బస్తాలు, మిర్చికి 8-10 బ స్తాల యూరియా వేస్తామని చెప్తున్నారు. మక్కజొన్న ఎక్కువగా సాగు చేసే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎకరానికి 10 బస్తాలు వేస్తారు. ఒకవేళ యూరియా వేయగానే వర్షం పడితే అదీ కొట్టుకుపోతుంది. దీంతో మరోసారి వే యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో అదనంగా అవసరమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సర్కారు ఇచ్చే రెండు, మూడు బస్తాలు ఏ మూలకు సరిపోతాయని, ఏం చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.
యూరియా కొరత పేరుతో వ్యాపారులు అన్నదాతలను నిలువునా దోచుకుంటున్నారు. బస్తా వాస్తవ ధర రూ.276 అయితే రూ.350కు విక్రయిస్తున్నారు. యూరి యా కోసం తిరిగే ఓపిక లేని రైతులు అవసరం లేకపోయినా సీఎంఎస్, జింక్, గుళికల బస్తాలు తీసుకుంటున్నారు. కమలాపూర్, ఉప్పల్, భీంపల్లి, శనిగరం, తదితర గ్రామాల్లో యూరియాను చూపించి కాంప్లెక్స్ ఎరువులు డీఏపీ, 20:20:20, పొటాష్ బస్తాలు సైతం అధిక ధరలకు అమ్ముతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
ఏ రైతుకు ఎన్ని బస్తాల యూరియా ఇవ్వాలనే అంశం బుకింగ్ యాప్‌లోనే లెక్క తేలుస్తుంది. బుకింగ్ సమయంలో యాప్‌లో రైతుకు మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉన్నదో నమోదు చేయాలి. అందులో ఎన్ని ఎకరాల్లో ఏ పంట సాగు చేస్తున్నారో పొందుపర్చాలి. అప్పుడు సాగు చేసే పంట రకాన్ని బట్టి రైతులకు మొత్తం ఎన్ని బస్తాల యూరియా ఇవ్వా లో నిర్ధారించి కేటాయిస్తుంది. ఉదాహరణకు ఒక రైతుకు 5 ఎకరాల భూమి ఉంటే ఇందులో 3 ఎకరాల్లో వరి, రెండెకరాల్లో మొక్కజొన్న వేస్తున్నారనుకుంటే ఆ రైతుకు వరి అయితే 10 బస్తాలు, మక్కజొన్నకు 9 బస్తాలు కేటాయిస్తారు. వీటిని మూడు దఫాలుగా పంపిణీ చేస్తారు. ఇలా యాప్‌లో రైతు లు నమోదు చేసే భూమి, సాగు భూముల ఆధారంగానే పంపిణీ అవుతుంది. అంతకుమించి ఒక్క బస్తా ఎక్కువ ఇవ్వడానికి వీళ్లేదు.
ఎలా అయినా రైతులకు యూరియా పంపిణీలో కోత పెట్టాలని కృతనిశ్చయంతో ఉన్న సర్కారు రైతులకు ఏ వైపు నుంచి కూడా మార్గం లేకుండా చేసింది. ఇందులో భాగంగా ఎవరైనా రైతులు ఒకటో రెండో యూరియా బస్తాలు ఎక్కువ తీసుకునేందుకు సాగు భూమిని అధికంగా చూపిస్తే ఆ తర్వాత వారిని ఇబ్బందులు పెట్టే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ పంటలు కొనుగోలు చేసే సమయంలో రైతుల వాస్తవ సాగును పునఃపరిశీలించనున్నది. ఇందులో తేడాలుంటే రైతుల పంటల్ని కొనుగోలు చేయకుండా తిరస్కరించేలా చర్య లు చేపట్టింది. ఈ విధంగా రైతులకు అవసరమైన యూరియా ఇవ్వకుండా, ఆ తర్వాత పంటలు కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెట్టే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యాప్‌లో బుకింగ్‌కు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. బుకింగ్ గడువును కేవలం ఒక్క రోజుకే పరిమితం చేసింది. అంటే బుక్ చేసుకున్న 24 గంటల్లోలోపు కొనుగోలు చేయాలి. లేదంటే బుకింగ్ రద్దవుతుంది. దీంతో రైతులు మళ్లీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ యూరియా కొరతతోనో లేక షాపుల వద్ద క్యూతోనో గడువులోపు యూరియా లభించకపోతే పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ బుక్ చేసుకోవడం, ఎరువుల దుకాణాల వద్దకు వెళ్లడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.