Singareni | బోనస్ అనేది సింగరేణి కార్మికుల హక్కు అని బీఆర్ఎస్ నాయకులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కార్మికుల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. సింగరేణి సంస్థ 2023-2024 ఆర్థిక సంవత్సరంలో రూ.4,701కోట్ల వాస్తవ లాభాలు ఆర్జించిన, వారికిచ్చే బోనస్‌ను రూ,2,412 కోట్లకు పరిమితం చేయడం కార్మికులను మోసం చేయడమేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సింగరేణి అభివృద్ధి పేరుతో కార్మికులను లాభాల నుంచి పక్కనపెట్టడం సరైన విధానం కాదని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆల్ టైం రికార్డు ఉత్పత్తి సాధించినప్పటికీ.. గతం కంటే ఒక్కో కార్మికుడికి అదనంగా ఇచ్చేది కేవలం రూ.20 వేలేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. సగం లాభాల నుంచే కార్మికులకు బోనస్ ఇస్తున్నారని తెలిపారు. గత పదేళ్లలో ఇదే అతి తక్కువ బోనస్ అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2,289 కోట్ల బోనస్‌ను ఎగ్గొట్టడం సరైంది కాదని బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. సింగరేణి సంస్థ లాభాలేమో 4,701 కోట్లు చూపించి కేవలం రూ,2,412 కోట్లలో మాత్రమే 33 శాతం బోనస్‌ను ప్రకటించారని తెలిపారు. తాజాగా ప్రభుత్వం ప్రకటించింది 33 శాతం కాదని 16.33 శాతమే అవుతుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలా ఎప్పుడూ జరగలేదని అన్నారు. వాస్తవంగా ప్రభుత్వం 4,701.కోట్ల లాభాలకు బోనస్ ప్రకటించి ఉంటే కార్మికులకు రూ,1400 కోట్లకు పైగా బోనస్ దక్కేదని తెలిపారు. ఒక్కో కార్మికుడికి బోనస్ రూపంలో రూ.2లక్షల వరకు వచ్చేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు 50 శాతం గండికొట్టి గొప్పగా ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పొట్టగొడుతోందని మండిపడ్డారు.