Telangana | నిర్మల్, మే 15(నమస్తే తెలంగాణ) : ధాన్యం తూకంలో దోపిడీని ప్రశ్నించిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన నిర్మల్ జిల్లాలో గురువారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఖానాపూర్ మండలం ఎర్వచింతల్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు క్వింటాలుకు 8 కిలోల చొప్పున వడ్లను అదనంగా తూకం వేయడంతో ఇదేం దోపిడీ అంటూ మంగళవారం రైతులంతా కలిసి ఆందోళనకు దిగారు. పీఏసీఎస్ కార్యదర్శి ఆశన్న రైతులను సముదాయించే ప్రయత్నం చేయగా సమీపంలోని పాఠశాల గదిలో బంధించి తూకంలో మోసంపై నిలదీశారు.
దీంతో ఆయన తన తప్పును ఒప్పుకొని రైతులకు లిఖిత పూర్వకంగా లెటర్ రాసి ఇచ్చి, అదనంగా ధాన్యం తీసుకోమని హామీ ఇచ్చారు. బుధవారం ఖానాపూర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం సందర్భంగా అక్కడే ఉన్న పోలీసు అధికారులను ఎమ్మెల్యే పిలిచి సొసైటీ అధికారులను నిర్బంధిస్తుంటే ఏమి చేస్తున్నారని నిలదీశారు. దీంతో పోలీసులు పీఏసీఎస్ అధికారుల నుంచి ఫిర్యాదు స్వీకరించి కడారి గోపాల్‌పై కేసు నమోదుచేశారు. గురువారం పోలీసులు గోపాల్ ఇంటికి వెళ్లి పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ తెలుపగా అరెస్టు వారెంటు చూపాలని కోరడంతో తిరిగి వెళ్లిపోయారు.
కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తరుగు పేరిట క్వింటాలుకు 8 కిలోలు అదనంగా తీసుకోవడంతో వడ్లను తూకం వేయడాన్ని నిలిపివేయించినం. రైతుల కష్టాన్ని ఎందుకు దోచుకుంటున్నారని కార్యదర్శి ఆశన్నను నిలదీయగా సొసైటీ చైర్మన్ ఆదేశాలతోనే తూకం వేస్తున్నామని చెప్పారు. రైతులు ఆందోళన చేయడంతో బస్తాకు 42 కిలోల తూకం వేస్తామని కార్యదర్శి లెటర్ రాసి ఇచ్చిండు. గురువారం ఇద్దరు కానిస్టేబుళ్లు ఇంటికి వచ్చి పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించారు. అదనంగా వడ్లు తూకంవేసి రైతులను మోసం చేస్తున్నారని సొసైటీ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, రైతులపైనే ఉల్టా కేసులు పెట్టడం బాధాకరం.