విద్యుత్తు వినియోగదారులకు కాంగ్రెస్ సర్కారు ‘స్మార్ట్’ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రజలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించిన స్మార్ట్‌మీటర్లను రాష్ట్రంలో బిగించేందుకు కాంగ్రెస్ సర్కారు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతానికి 10 కిలోవాట్లు, ఆపై విద్యుత్తు వినియోగదారులకు స్మార్ట్‌మీటర్లు బిగించాలని నిర్ణయించింది. గృహ, వాణిజ్య, పరిశ్రమలు అన్న తేడాల్లేకుండా పది కిలోవాట్ల విద్యుత్తు వినియోగం దాటిన వారందరి నెత్తిన స్మార్ట్ మీటర్లను రుద్దనుంది. ఇందుకు 6-12 నెలల గడువును సర్కారు విధించుకున్నది.
హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం మన దగ్గర విద్యుత్తు వినియోగారులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) మీటర్లను వినియోగిస్తున్నారు. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా స్మార్ట్‌మీటర్లను బిగించాలని కేంద్రం తరుచూ రాష్ర్టాన్ని ఆదేశిస్తున్నది. ఆర్డీఎస్ఎస్లో కొత్తగా స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్తు మీటర్లను బిగించాలని కోరుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో 10కేవీ దాటిన వినియోగదారులకు స్మార్ట్‌మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకున్నది.
ఆ తర్వాత క్రమంగా 8, 6, 5 కిలోవాట్ల కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు బిగించాలని ఓ ప్రణాళికను సిద్ధం చేసింది. అయితే వ్యవసాయ కనెక్షన్లకు ఈ మీటర్లను బిగించవద్దని నిర్ణయించినట్టు సమాచారం. స్మార్ట్ మీటర్ల బిగింపు నిర్ణయం వెనుక విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణ కుట్ర దాగి ఉన్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అదానీ సహా కొన్ని సంస్థలకు లాభం చేకూర్చే కుట్ర దాగి ఉన్నదన్న ఆరోపణలొస్తున్నాయి. అదానీ కంపెనీ సహా కొన్ని సంస్థలు మాత్రమే స్మార్ట్ మీటర్లను తయారుచేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో విద్యుత్తు రంగం ఆయా కంపెనీల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోతుందన్న అభిప్రాయాలొస్తున్నాయి.
ఈ చర్యలతో క్రమక్రమంగా డిస్ట్రిబ్యూషన్ సిస్టం ప్రైవేటీకరణకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నారని విద్యుత్తు రంగ నిపుణులంటున్నారు. ఇదిలా ఉంటే అసలు మన డిస్ట్రిబ్యూషన్ సిస్టం స్మార్ట్మీటరింగ్కు రెడీగా ఉందా? అన్న అనుమానాలొస్తున్నాయి. టెక్నాలజీ వినియోగం, టెక్నికల్ సమస్యలను తీర్చడం, ఎప్పటికప్పుడు రీచార్జీ చేయడం వంటి పనులను ఇప్పుడున్న ఇంజినీర్లు చేయలేరు. ఏదో ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించాల్సిందే. అంటే పరోక్షంగా ప్రైవేటీకరణకు మార్గం పడ్డట్లేనన్న వాదనలున్నాయి. మరో వైపు ఉద్యోగులు సంఖ్యను తగ్గించే ప్రమాదముందని ఉద్యోగ సంఘాలంటున్నాయి. ఈ సాకు తో ఉన్న ఉద్యోగులను తీసివేయడం, లేదా కొత్త రిక్రూట్మెంట్కు నిలిపివేయడం జరుగుతుందని కొన్ని సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులకు స్మార్ట్‌మీటర్లను బిగించనున్నట్టు ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిట్టల్ చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్తు వినియోగం 10కేవీ దాటిన వారు 1.5 లక్షలుంటారని, ఆయా కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు బిగిస్తామని చెప్పారు.. క్రమక్రమంగా అందరికీ స్మార్ట్‌మీటర్లు బిగిస్తామని పేర్కొన్నారు. వీటి బిగింపు తర్వాత విద్యుత్తు వినియోగంపై ప్రత్యేక దృష్టిపెడతామని, ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ల వారీగా పర్యవేక్షణను మెరుగుపరుస్తామని వివరించారు.