హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): తొమ్మిది రోజుల్లో రూ .9 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చామని గొప్పలకు పోయిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సరిగ్గా నెల తిరక్క ముందే 15 రోజుల్లో రూ. 15 వేల కోట్లు జనం దగ్గర నుంచి గుంజుకునే లిక్కర్ పాలసీ అమల్లోకి తెస్తున్నది. ఇది చుక్క మద్యం కూడా అమ్మకుండానే పిండుకునే రాబడి. పల్లె, పట్టణ జనాలను తాగుబోతులుగా మార్చి గల్లా పెట్టెను ఫుల్లుగా నింపడం ద్వారా నెలకు రూ. 4,500 కోట్లు ఆర్జించే వ్యాపార పథకం మరోటి ఉన్నది.
నెల రోజుల కిందటి రైతు భరోసా, అంతకు ముందు ఇచ్చిన రుణమాఫీ సొమ్ముకు ‘బారు’ వడ్డీ, దాని జేజమ్మ వడ్డీతో కలిపి లాక్కునేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మందు సీసాలను ముందు పెట్టింది. హైదరాబాద్ మహానగరం అవతల ఉన్న కార్పొరేషన్లలో ఇన్స్టంట్ బీరు కేఫ్‌లు, మండలం, గ్రామమనే తారతమ్యం లేకుండా ఎక్కడ సరుకు అమ్ముడుపోతే అక్కడికే మద్యం దుకాణం మార్చుకునే విధంగా ఎక్సైజ్ నిబంధనలు సవరించారు. ఈమేరకు నూతన ఎక్సైజ్ పాలసీ రూపొందించారు. సోమవారం సాయంత్రం కానీ, లేదా మంగళవారం మధ్యాహ్నం 6వ పేజీలో
మద్యం దుకాణదారుల నుంచి లెవీ స్పెషల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను ఏడాదికి రూ.5 లక్షల చొప్పున ఒకే వాయిదాలో వసూలు చేస్తారు. లైసెన్సుదారులు మూడేండ్ల ఎక్సైజ్ ఫీజులో ఒక ఏడాది లైసెన్స్ ఫీజు ముందే డిపాజిట్ చేయాలి. మిగిలిన ఫీజులో ఎనిమిదో వంతుకు సమానమైన రెండు ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వాలి. ఎక్సైజ్ కమిషనర్ నిబంధనల మేరకు దుకాణాల్లో రోజువారీ లావాదేవీలు నమోదు చేసుకొనే వ్యవస్థ అవసరం. అన్ని షాపుల్లో మూడు సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి. వీటిని ఎక్సైజ్ శాఖ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించాలి. లికర్ షాపుల వద్ద తగిన పారింగ్ సౌకర్యం తప్పనిసరి. గానీ నూతన ఎక్సైజ్ పాలసీతో మద్యం దుకాణాలు, మైక్రో బ్రూవరీల లైసెన్స్‌లకు నోటిఫికేషన్ వెలువడనున్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 15 రోజుల్లో లైసెన్సీల నిర్ధారణ, దుకాణాల కేటాయింపులు పూర్తి అవుతాయని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు.
2011 జనాభా గణన ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ దుఖాణాలు ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం రెండేళ్లు మాత్రమే ఏ4 దుకాణాల లైసెన్స్ గడువును మూడేండ్లకు సవరించారు. దరఖాస్తు ఫారం ధర భారీగా పెంచారు. గతంలో రూ. 2 లక్షల ఉన్న ఫారం ధర ఇప్పుడు రూ. 3 లక్షలు చేశారు. అయితే లైసెన్స్ గడువు మూడేళ్లకు పెంచిన నేపథ్యంలో ఒక ఏడాది లైసెన్స్ ఫీజు అడ్వాన్స్‌గా తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఈనిబంధనపై మద్యం వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొంత సందిగ్ధంలో పడ్డట్టు సమాచారం.
ఇప్పటి వరకు 10 పర్యాయాలు మాత్రమే ఉన్న ఎక్సైజ్ ప్రివిలేజ్ ఫీజ్‌ను 11 పర్యాయాలకు పెంచారు(దుకాణ లైసెన్స్ ఫీజు మీద 11 సార్లు మద్యం విక్రయిస్తే దుకాణదారుడికి ఇచ్చే రిటైలర్ మార్జిన్లో ఎలాంటి మార్పు లేకుండా). ఇది కొంత మద్యం దుకాణదారులకు ఊరట కలిగించే అంశమే. ఈ ఆప్షన్‌తో వ్యాపారులు ఏడాది లైసెన్స్ ఫీజు అడ్వాన్స్ పెట్టడానికి ఇబ్బంది పడక పోవచ్చని ఎక్సైజ్ అధికారులు సీఎంకు వివరించినట్టు తెలిసింది.
అలాగే రిటైల్ మార్జిన్ ఆర్డినరీ బ్రాండ్ల పైన 27 శాతం, మీడియం, ప్రీమియం బ్రాండ్ల పైన 20 శాతం, బీర్లపై 20 శాతంగా గతంలో ఉన్నట్టు గానే ఖరారు చేశారు. నూతన ఎక్సైజ్ పాలసీ ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. 2028 నవంబర్ 30న ముగుస్తుంది. గతంలో ఆరు స్లాబ్‌లుగా ఉన్న మద్యం దుకాణాలను యథాతథంగా ఉంచారు. లాటరీ విధానం ద్వారా మద్యం షాపుల ఎంపిక ఉంటుంది. 10 శాతం షిఫ్టింగ్ ఫీజుతో మద్యం దుకాణాలను స్లాబ్ నిబంధనకు లోబడి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా మార్చుకునే వెసులుబాటు కల్పించారు.
ఇన్స్టంట్ కాఫీ షాపుల తరహాలో రాష్ట్రంలో ఇన్‌స్ట్టంట్ బీర్ కేఫ్‌లు తెస్తున్నారు. ఇది కూడా ఒక రకంగా ఇన్‌స్ట్టంట్ కాఫీ షాప్ లాంటిదే! కాకపోతే ఇకడ కాఫీ బదులు బీరు వస్తుంది. ప్రస్తుతం ఇవి హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమై ఉన్నాయి. బార్, పబ్బు ఉన్న వారికి మాత్రమే వాటిని అనుబంధంగా మైక్రో బ్రూవరీలకు అనుమతించే వారు. ఇప్పుడు వీటిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించటానికి ఎక్సైజ్ నిబంధనల్లో క్యాబినెట్ సరవణలు చేశారు.
నివాస ప్రాంతాల్లో 1,000 లీటర్ల ఫ్రెష్ బీర్‌ను ఉత్పత్తి చేయగలిగి, విక్రయించే సామర్థ్యం ఉన్న చోట మైక్రోబ్రూవరీలను అనుమతించే విధంగా ఎక్సైజ్ నిబంధనలు సవరించారు. నగరంలో ప్రతి 5 కిలోమీటర్ల దూరంలో, మహానగరానికి ఆవల ఉన్న అన్ని కార్పొరేషన్లలో కూడా మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు అనుమతించే పాలసీ తెచ్చారు. ఈ ఏడాది ఒక్క హైదరాబాద్‌లోనే కనీసం 100 మైక్రో బ్రూవరీలనైనా ఏర్పాటు చేసే దిశగా ఔత్సాహిక వ్యాపారులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను నిర్దేశించినట్టు తెలిసింది. మైక్రో బ్రూవరీల లైసెన్స్ ఫీజు రూ.5 లక్షలకు పెంచారు.
వినియోగించే ప్రతి లీటర్ బీరుకు రూ. 48 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ ఫీజు నిర్ధారించారు. ఔత్సాహిక వ్యాపారులు కోరితే పబ్బు, క్లబ్బు, బారుకు అనుసంధాన పరిమితులు ఏవీ లేకుండా వ్యక్తిగతంగా ఇవ్వాలని నిర్ణయించారు. మైక్రో బ్రూవరీ మిషినరీ కొనుగోలు సామర్థ్యం లేనివారికి స్థానిక బ్రూవరీల నుంచి ఫ్రెష్ బీరు తెచ్చుకునే వెసులుబాటు కల్పించారు. తెలంగాణలో ప్రతి 13 వేల మందికి ఒకటి చొప్పున కేఫ్ ఏర్పాటు చేసే విధంగా ఎక్సైజ్ నిబంధనలను సవరించింది.