హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ‘నువ్వో రూ.10 ఇవ్వు. నేనో 10 ఇస్తా. మొత్తం రూ.20 నీకే! దీనిని పెట్టుబడిగా పెడతా. అలా అదనంగా వచ్చే వడ్డీ కూడా నీకే’ అన్నాడట ఓ పెద్దమనిషి. దీనికి అవతలి వ్యక్తి సరే అనడంతో.. ముందు నువ్వు 10 ఇవ్వు, నేను తర్వాత రూ.10 జమ చేస్తానని అన్నాడట. చివరికి మోసం చేశాడట. ఇస్తానన్న 10 ఇవ్వలేదు, అదనంగా వచ్చే వడ్డీ సంగతి దేవుడెరుగు ఇచ్చిన 10 రూపాయలనూ వాడుకున్నాడట. ప్రస్తు తం రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి అచ్చం ఇలాగే ఉన్నది.
ఇక్కడ మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాగా, బాధితులు 2.2 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు! కరీంనగర్ జిల్లాలో పనిచేసే ఓ ఉద్యోగి రూ.85,240 వేతనం పొందుతున్నారు. డీఏ కింద రూ.25,598 వస్తున్నది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) కింద ప్రతినెలా ఉద్యోగి వేతనం నుంచి 10శాతం రూ. 8,524, డీఏ నుంచి 10శాతం రూ.2,560 చొప్పున మొత్తంగా రూ.11,084 కట్ అవుతున్నాయి.
ప్రభుత్వం తన వాటాగా ఇంతే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం తన వాటాను ప్రాన్ అకౌంట్లో జమ చేయలేదు. దీంతో ఉద్యోగి వేతనం నుంచి కట్ చేసిన రూ. 11,084 ప్రభుత్వ ఖజానాలోనే ఉండిపోయాయి. ఇలా 13 నెల కాలంలో ఆ ఒక్క ఉద్యోగి నుంచే రూ.1,44,092 ప్రభుత్వ ఖాతాలో చేరాయి. హైదరాబాద్‌లో పనిచేసే ఓ ఉద్యోగి వేతనం రూ.42,300. డీఏ కింద రూ.12,703 వస్తున్నది. ప్రభుత్వం అతడి వేతనం నుంచి నెలకు రూ. 5,500 కట్చేస్తున్నది. కానీ తన వాటా చెల్లించకపోవడంతో ఈ సొమ్ము ప్రభుత్వ ఖాజానాలోనే ఉండిపోతున్నది. ఇలా 13 నెలల్లో రూ.71,500ను ప్రభుత్వం వాడుకున్నది.
ఈ ఇద్దరిది మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.2 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల వ్యథ ఇది. భవిష్యత్తులో తమకు పింఛన్ రూపంలో ఆసరాగా అందుతాయనే ఆశతో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం కింద ఉద్యోగులు కూడబెట్టుకుంటున్న సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లిస్తున్నది. ఉద్యోగుల వాటా కింద ప్రతి నెల వస్తున్న రూ.100 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం దర్జాగా ఖర్చు చేసుకుంటున్నది. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం 13 నెలలకు చెందిన రూ.1,300 కోట్లను సొంతానికి వాడేసుకున్నదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సర్కారు వాటా కింద రూ.1,300 కోట్లను కూడా చెల్లించలేదన్నారు. అంటే మొత్తంగా.. రూ. 2,600 కోట్లను ప్రభుత్వం ఇతర పథకాల కోసం మళ్లించి వాడుకున్నదని చెప్తున్నారు. ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలంటూ వందలాది మంది హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
జీపీఎఫ్ విధానంలో ఉద్యోగి రిటైర్ అయ్యేనాటికి పొందుతున్న వేతనంలో సగం పెన్షన్‌గా అందుతుంది. కానీ జీపీఎఫ్‌ను ప్రభుత్వం రద్దు చేయడంతో సీపీఎస్‌ను (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి 10 శాతం, ప్రభుత్వం నుంచి అంతే మొత్తంలో కలిపి ఉద్యోగి ప్రాన్ నంబర్లో వేయాల్సి ఉంటుంది. ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత అప్పటికి జమ అయిన మొత్తాన్ని బట్టి నెలనెలా పెన్షన్ వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 2.2 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులే. భవిష్య నిధి పథకం కింద వీరి జీతం నుంచి ప్రతినెల 10శాతం కట్ చేస్తుంటారు. ప్రభుత్వం తన వాటాగా 10 శాతం చొప్పున జమ చేయాలి. రెండింటినీ కలిపి 20 శాతాన్ని ఉద్యోగి ప్రాన్ అకౌంట్‌కు ప్రభుత్వం జమచేయాలి. పీఆఎఫ్ఆర్డీఏ నిబంధనల ప్ర కారం 15 రోజుల్లో ప్రాన్ అకౌంట్లో రెండు వా టాలను జమచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఉద్యోగుల వేతనం నుంచి ప్రతి నెల ఠంచనుగా 10 శాతాన్ని కట్ చేస్తున్నది. అయితే ప్రభుత్వం తరఫున 10శాతం వాటా మాత్రం చెల్లించడంలేదు. దీంతో ఉద్యోగి జీతం నుంచి కట్ చేస్తున్న 10 శాతం వాటా ప్రభుత్వ ఖాతాలోనే ఉండిపోతున్నది.
సీపీఎస్ ఉద్యోగుల వాటాను ప్రాన్ అకౌంట్లకు జమచేసే బాధ్యతలను ట్రెజరీ (ఖజానా శాఖ) అధికారులు చూస్తారు. అధికారులు ప్రతి నెల 15వ తేదీలోపు ఈ మొత్తాన్ని ప్రాన్ అకౌంట్లకు జమ చేసేందుకు ఆన్లైన్లో సిస్టంను రన్ చేస్తుంటారు. అయితే.. ఉద్యోగుల వాటా ప్రతి నెలా వస్తున్నా, ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన మొత్తాన్ని పాస్ చేయకపోవడంతో ప్రాన్‌లో జమ చేయడం కుదరలేదు. ఇలా రాష్ట్రంలోని 125 సబ్ ట్రెజరీల్లో ప్రతి నెల చెక్కులు పాస్ కావడంలేదు. ఫలితంగా తమ ప్రయత్నాలు వృథా అవుతున్నాయని అధికారులు వాపోతున్నారు. నెలలపాటు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడంతో అధికారులు ఇటీవల బిల్లులు చేయడం, సిస్టం రన్ చేయడం మానేశారని తెలిసింది.
దేశంలో ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల కోసం ‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ’ (ఈపీఎఫ్‌వో) పనిచేస్తున్నది. ప్రపంచలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థల్లో ఇది ఒకటి. 20 మంది, అంతకంటే మించి ఉద్యోగులున్న ఏ సంస్థ అయినా, కంపెనీ అయినా ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్‌ను కట్టాల్సిందే. ఉద్యోగి వాటాగా 12 శాతం, సంస్థ (ఎంప్లాయర్) వాటాగా 12 శాతంగా విధిగా ఈపీఎఫ్‌కు చెల్లించాల్సిందే. ఇలాచేయని సంస్థలపై ఈపీఎఫ్ యాక్ట్ 1952 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. సకాలంలో చెల్లించకపోతే 7క్యూ, 14బీ సెక్షన్ల ప్రకారం 5 -25 శాతం వరకు జరిమానా విధిస్తారు. సదరు సంస్థ నుంచి బకాయి పడ్డ మొత్తాన్ని వడ్డీతో సహా రికవరీ చేస్తారు. దీంతో ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు బకాయిలుండకుండా చూసుకుంటున్నాయి. ప్రైవేట్ కంపెనీలకు ఇంత కఠినంగా నిబంధనలు అమలులో ఉండగా, ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి నిబంధనలు లేకపోవడం గమనార్హం.
ప్రభుత్వం ప్రాన్ అకౌంట్‌కు సక్రమంగా వాటాను జమచేయకపోవడంతో ఉద్యోగులు బదిలీ అయినప్పుడల్లా కొత్త సమస్య తలెత్తున్నది. పాత జిల్లాలో పెడింగ్ ఉండటంతో ప్రాన్ అకౌంట్స్‌లో మిస్సింగ్ క్రెడిట్స్ కింద పడుతున్నది. ఇటీవల హైదరాబాద్ నుంచి ఓ ఉద్యోగి నల్గొండ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన హైదరాబాద్‌లో పనిచేసినప్పుడు ప్రభుత్వం సీపీఎస్ వాటాను విడుదల చేయలేదు. ఇప్పుడు నల్గొండ జిల్లా ట్రెజరీ అధికారులు సీపీఎస్ వాటా జమచేసేందుకు బిల్లు చేసేందుకు ప్రయత్నిస్తే కావడం లేదు.