హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాగు నీటిపారుదల శాఖలో పైరవీల జోరు కొనసాగుతున్నది. చేయి తడిపి న వారికి, చేయి పార్టీ పెద్దలకు నచ్చినోళ్లకే బా ధ్యతలు దక్కుతున్నాయని జలసౌధలో జోరు గా చర్చ కొనసాగుతున్నది. ఒకరి వెంట ఒకరు వరుసగా చీఫ్ ఇంజినీర్లు విరమణ పొందుతున్నారు. సూపరింటెండ్ పోస్టులు కూడా ఖాళీ అవుతున్నాయి. అయినా కాంగ్రెస్ సర్కారు పోస్టుల భర్తీపై దృష్టి సారించడమే లేదు.
పైరవీలకు పెద్దపీట వేస్తూ, నచ్చినోళ్ల కోసం తా త్సారం చేస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. తాజాగా పలువురు సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు కీలక బాధ్యతలను అప్పగించడమూ ఆ ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతున్నది. సర్కారు తీరుతో 18 నెలల కాలంలో నీటిపారుదల శాఖ పూర్తిగా అస్తవ్యస్తమైంది. మొత్తంగా 17 సీఈ పోస్టులు ఖాళీ అయ్యా యి.
పూర్తిస్థాయి అధికారులను నియమించకుండా ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నది. దీంతో ఇరిగేషన్లో పరిపాలన పూర్తిగా గాడితప్పిపోయింది. ఈ శాఖలో ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ), చీఫ్ ఇంజినీర్ (సీఈ), సూపరింటెండెంట్ (ఎస్ఈ) స్థాయి వరకు పదుల సంఖ్య లో పోస్టులు ఖాళీ అయ్యాయి. ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఈఎన్సీ పోస్టులను ఇటీవలే ప్రమోషన్ ద్వారా భర్తీ చేశారు. రామగుండం, గజ్వేల్, సీడీవో ఈఎన్సీ పోస్టులు ఖాళీ కాగా, అదనపు బాధ్యతలను అప్పగించారు.
22 సీఈ పోస్టులు ఉండగా, ఇప్పటికే 17 మంది అంటే దాదాపు సగానికిపైగా సీఈలు ఉద్యోగ విరమణ పొందా రు. వారిలో భద్రాద్రి కొత్తగూడం, ఖమ్మం, నల్లగొండ, ములుగు, వరంగల్, నాగర్‌కర్నూల్, జగిత్యాల, రామగుండం, నిజామాబాద్, వనపర్తి, హైదరాబాద్, సంగారెడ్డి, గజ్వేల్, సీడీవో, ఇంటర్‌స్టేట్, వాలంతరి, మంచిర్యాల సీఈ పోస్టులు ఖాళీ అయ్యాయి. వచ్చే నెలలో మరో సీఈ విరమణ పొందనుండగా, అక్టోబర్ నాటికి ప్రస్తుతం ఉన్న రెగ్యుల ర్ అధికారులందరూ విరమణ పొందనున్నా రు. ఇవిగాక 59 మందికి పైగా ఎస్ఈ పోస్టు లు, అనేక సర్కిళ్లలో పదుల సంఖ్యలో ఈఈ పోస్టులు ఖాళీ అయ్యాయి.
ప్రమోషన్లు కల్పించాలని ఏడాది క్రితమే ప్రభుత్వం ఆదేశించింది. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు సైతం సీనియారిటీ జాబితాను సిద్ధంచేసి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం మాత్రం ఎటూతేల్చడమే లేదు. ప్రమోషన్ల కోసమని ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బదిలీల ప్రక్రియ మొత్తాన్ని పూర్తిచేస్తామని గత జనవరిలోనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికి 5 నెలలు గడచినా మంత్రి ఉత్తమ్ హామీకి అతీగతి లేదు.
టెరిటోరియల్ సీఈ, సర్కిల్, డివిజనల్ ఇంజినీర్ పోస్టులు కీలకమైనవి. అలాంటిది ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో పలువురు ఇంజినీర్లు లెక్కకు మించి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చిన కాంగ్రెస్ సర్కారు నచ్చినోళ్లకు, ఎమ్మెల్యేలు పైరవీలు చేసినోళ్లకే ప్రభుత్వ పెద్దలు బాధ్యతలను అప్పగిస్తున్నారు. అనుయాయుల కోసం కొన్నిచోట్ల సీనియర్ ఇంజినీర్లను సైతం బలవంతంగా బదిలీ చేసిన పరిస్థితులు ఉన్నాయని అదే శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏడాది కాలంలో 2004 బ్యాచ్‌కు చెందిన సీనియర్లను పకనబెట్టి 2005, 2007 బ్యాచ్‌లకు చెందిన పదుల సంఖ్యలో ఇంజినీర్లకు ఉన్నత స్థానాల్లో ఎఫ్ఏసీలుగా నియమించారని ఇంజినీర్లు నిప్పులు చెరుగుతున్నారు.
సర్కారు అనాలోచిత, అడ్డదిడ్డమైన చర్యలతో సీనియర్ వర్సెస్ జూనియర్ అన్నచందంగా పరిస్థితి తయారైంది. ఉన్నతస్థానాల్లో బాధ్యతలను నిర్వర్తిస్తున్న వారికి దిగువనున్న సీనియర్ ఇంజినీర్లు సహకరించని పరిస్థితి నెలకొనగా, పరోక్షంగా సహాయ నిరాకరణ పాటిస్తున్నారని పలువురు బాహాటంగానే వాపోతున్నారు. మరోవైపు అదనపు బాధ్యతలతో, తీవ్ర పనిభారంతో సతమతమవుతున్నామని ఇరిగేషన్ అధికారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి, కమిటీల పేరిట కాలయాపన చేయకుండా, సత్వరమే ప్రమోషన్లు కల్పించి, పూర్తిస్థాయి అధికారులను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.