రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ) : తెలంగాణలోనే ఏకైక సహకార విద్యుత్తు సరఫరా సంస్థ అయిన సిరిసిల్ల సెస్ విలీనానికి కాంగెస్ సర్కార్ కట్రలు చేస్తున్నదా? లాభాల్లో నడుస్తున్న సంస్థపై కక్ష గట్టిందా? అందుకే పెండింగ్‌లో ఉన్న వందల కోట్ల బకాయిలు చెల్లించకుండా, నష్టాలను సాకుగా చూపుతూ లైసెన్స్ రెన్యువల్ చేయకుండా విలీనానికి తెరతీసిందా? అంటే అవుననే తెలుస్తున్నది. దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న సిరిసిల్ల సెస్‌పై, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వివక్ష చూపుతున్నది. ఐదేండ్లకోసారి చేయాల్సిన రెన్యువల్‌ను పెండింగ్‌లో పెట్టింది. గడువు ముగియడంతో తాజాగా ఎన్పీడీసీఎల్ రంగంలోకి దిగి సెస్‌ను ఆధీనంలోకి తీసుకోవడం విలీన కుట్రకు బలం చేకూరుస్తున్నది. సెస్ పాలకవర్గాన్ని పక్కనపెట్టి, బుధవారం నుంచి టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగుతాయని సెస్ కార్యాలయంలో సీఎండీ వరుణ్‌రెడ్డి ప్రకటించారు. ఈ కుట్ర వెనుక కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో గురువారం నుంచి నిరసనలు తెలుపనున్నారు.
సిరిసిల్ల సెస్‌కు ఘన కీర్తి
తెలంగాణలోనే సిరిసిల్ల సెస్ తలమానికంగా నిలిచింది. సహకార సంఘం ద్వారా విద్యుత్తు సరఫరా చేస్తూ 56 ఏండ్లుగా మెరుగైన సేవలందిస్తున్నది. దేశంలో 1960లో నేషనల్ రూరల్ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్ అసోసియేషన్(ఎన్ఆర్ఈసీఏ) యూఎస్ఏ, యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్(యూఎస్ఏఐడీ) సంస్థలు ప్రత్యేకంగా అధ్యయనం చేసి, దేశంలో రూరల్ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేయాలని అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో దేశంలో ఐదు రూరల్ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్‌లను పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసింది.
1970లో తెలంగాణలోని సిరిసిల్లతో పాటు కర్ణాటకలో హూకేరీ, గుజరాత్లో కోడినూర్, ఉత్తరప్రదేశ్‌లో లక్నో, మహారాష్ట్రలో ములపవరలో ఏర్పాటు చేశారు. ఈ ఐదు సొసైటీల పనితీరును న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఏర్పాటైన పూరీ కమిటీ, మాథుర్ కమిటీలు పర్యవేక్షించి, చేసిన సిఫారసుతో మరో 100 రూరల్ సొసైటీలను ఏర్పాటయ్యాయి. వీటిలో 9 సొసైటీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేశారు. ప్రస్తుతం దేశంలో 30 రూరల్ సొసైటీలు కొనసాగుతుండగా.. తెలంగాణలో సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంఘం ఏకైక సొసైటీగా నిలుస్తున్నది. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా అంతటా సేవలు అందిస్తున్నది. 255 గ్రామ పంచాయతీలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలకు సరఫరా చేస్తుంది. 1970లో 4,720 వినియోగదారులతో మొదలై ప్రస్తుతం 3లక్షల 5 వేల 365కి చేరింది. 132/33 కేవీ సబ్స్టేషన్లు 6, 33/11 కేవీ సబ్స్టేషన్లు 77, 11 కేవీ ఫీడర్లు 282, అగ్రికల్చర్ 11 కేవీ ఫీడర్ 177, మిక్స్డ్ 11 కేవీ ఫీడర్లు 105 ఉన్నాయి.
బీఆర్ఎస్ పాలనలో బలోపేతం
స్వరాష్ట్రంలో సహకార సంఘాలను నాటి కేసీఆర్ సర్కార్ బలోపేతం చేస్తూ వచ్చింది. సహకార సంఘాలతోనే వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తాయని భావించింది. ఆ మేరకు సిరిసిల్ల సెస్‌కు ఉన్న ఘన చరిత్రను, సేవలను గుర్తించి సంస్థను కాపాడుకున్నది. ప్రతి ఐదేండ్ల కోసారి సెస్ లైసెన్స్ రెన్యువల్‌ను యథావిధిగా కొనసాగిస్తూ వచ్చింది.
కాంగ్రెస్ సర్కార్ కక్ష
సిరిసిల్ల సెస్‌పై కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే వస్త్రపరిశ్రమను ఆగం చేసి రేవంత్ సర్కార్ కన్ను.. లాభాల్లో నడుస్తున్న సెస్‌పై పడింది. ఈ కారణంగానే గత బీఆర్ఎస్ సర్కార్‌పై అక్కసు, సెస్ పాలకవర్గం అధికారపార్టీ కాదనే వివక్షలో భాగంగానే విలీన కుట్రలకు తెరతీసింది. గత జనవరి 31వరకు బకాయి ఉన్న రూ.787.25 కోట్లు చెల్లించకుండా ఎన్పీడీసీఎల్కు రూ.682.22 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని సాకు చూపుతున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోయినా సంస్థ రూ.105కోట్ల లాభాల్లోనే కొనసాగుతున్నా సెస్ లైసెన్స్‌ను జాప్యం చేసింది. రెన్యూవల్ కోసం 2025 డిసెంబర్లోనే సెస్ పాలకవర్గం, ఎండీ యథావిధిగా అనుమతి కోసం పంపగా మార్చి 31లోగా ఇవ్వాల్సి ఉన్నా.. ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఇప్పుడు గడువు ముగియడంతో ఎన్పీడీసీఎల్‌ను రంగంలోకి దింపి, ఆధీనంలోకి తీసుకోవడం సెస్ విలీనానికి మరింత బలం చేకూరుస్తున్నది. స్వయంగా సీఎండీ వరుణ్‌రెడ్డి బుధవారం సెస్ కార్యాలయానికి చేరుకొని ఆధీనంలోకి పూర్తిగా అధీనంలోకి తీసుకున్నారు.
కొత్తగా ఆపరేషన్ సర్కిల్‌కు జీవో
వినియోగదారులకు తాతాలిక ప్రాతిపదికన సేవలందించేందుకు సిరిసిల్ల జిల్లాలో కొత్తగా ఆపరేషన్ సరిల్ ఏర్పడింది. ఈ మేరకు టీజీఎన్పీడీసీఎల్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇది బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని చెప్పింది. ఉత్తర్వుల ప్రకారం చేపట్టే చర్యల వివరాలు కూడా పొందు పరించింది. సెస్ పరిధిలోని వినియోగదారులందరికీ విద్యుత్ పంపిణీ, సరఫరా సేవలను అందించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిబంధనలకు విరుద్ధమని భావిస్తే, సంబంధిత వ్యక్తులు లేదా సంఘం హైకోర్టులో దీనిని సవాల్ చేయవచ్చని సూచించింది.
సెస్‌ను కాపాడుకోవాలి ; బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
సిరిసిల్ల సెస్‌ను కాపాడుకోవాలని, అం దుకు బీఆర్ఎస్ శ్రేణులు భాగస్వామ్యం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సెస్‌ను టీజీఎన్పీడీసీఎల్ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలుసుకున్న వెంటనే ఆయన తీవ్రంగా స్పందించారు. సిరిసిల్ల జిల్లాలోని బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యనేతలు, పార్టీ నేతలతో మాట్లాడారు. కేటీఆర్ ఆదేశాలతో గురువారం నుంచి బీఆర్ఎస్ శ్రేణులో నిరసనలు చేపట్టనున్నారు. ఈ మేరకు గురువారం జరిగే ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ గ్రామసభల్లో సెస్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ, టీటీఎన్పీడీసీఎల్ విలీనం చేయకుండా, యథావిధిగా కొనసాగించాలని తీర్మానాలు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. సెస్ కాపాడడంలో కీలక భూమిక పోషించడానికి, సర్కార్ కుట్రలపై ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నారు.
ఎన్పీడీసీఎల్ ఆధీనంలోనే సిరిసిల్ల సెస్: సీఎండీ వరుణ్‌రెడ్డి
సిరిసిల్ల సెస్‌ను ఎన్పీడీసీఎల్ ఆధీనంలోకి తీసుకున్నామని సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి వెల్లడించారు. లైసెన్స్ రెన్యువల్ ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రభుత్వ ఆదేశాలతోనే టీజీఎన్పీడీసీఎల్ ద్వారా వినియోగదారులకు సేవలందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం అమలవుతున్న యూనిఫామ్ సర్వీస్ లైన్ చార్జెస్(ఎస్ఎల్సీ) ఎల్‌టీలో ఒక కిలోమీటర్ లోపు ఉన్న వ్యవసాయ, గృహ, పరిశ్రమల వినియోగదారులకు మేలు చేకూరేలా తీసుకొచ్చిన టీజీఈఆర్సీ రెగ్యులేషన్ సెస్ పరిధిలోనూ అమలు చేయాలని చెప్పారు. భద్రతకు భరోసా కల్పించే ఎన్పీడీసీఎల్లో అమలవుతున్న కోటి రూపాయల ప్రమాద బీమా సెస్ ఉద్యోగులకు కూడా కల్పిస్తామని చెప్పారు.