BC Bandhu | హైదరాబాద్, జనవరి 5 (నమస్తేతెలంగాణ) : వృత్తిదారుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన బీసీబంధుపై కాంగ్రెస్ సర్కారు విచారణ చేపడుతున్నది. సర్కారు అందజేసిన లక్ష రూపాయలను ఏం చేశారో ఆరా తీయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఎైంక్వెరీ చేస్తుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొన్నది. బిల్లులు, ఖర్చుల వివరాలు సమర్పించకపోతే యూనిట్లను వెనక్కితీసుకుంటుందేమోననే భయం వారిలో కనిపిస్తున్నది.
వృత్తులను నమ్ముకొని బతుకుతున్న వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం బీసీబంధును ప్రారంభించింది. ఈ స్కీం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.లక్ష చొప్పున అందజేసింది. ఎలాంటి షరతులు విధించకుండానే నగదు మంజూరు చేసింది. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 350 మంది చొప్పున, మొత్తంగా సుమారు 40 వేల మందికి యూనిట్లను పంపిణీ చేసింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో తాత్కాలికంగా స్కీంను నిలిపేసింది. ఎన్నికల ముందర ఈ పథకాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు విచారణ పేరిట ఇక్కట్లకు గురిచేయడంపై లబ్ధిదారులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
సర్కారు ఆదేశాల మేరకు పట్టణాల్లో వార్డు ఆఫీసర్లు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు బీసీబంధు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ‘నగదును ఏ యూనిట్ కోసం ఖర్చుచేశారు? లేదంటే సొంత అవసరాలకు వినియోగించుకున్నారా? ఇందుకు సంబంధించి బిల్లులు ఉన్నాయా?’ అంటూ ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. యూనిట్ల వివరాలను యాప్‌ల్లో నిక్షిప్తం చేస్తున్నారు. కొందరు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవాలు చెప్పకపోతే ప్రభుత్వం పైసలు వాపస్ తీసుకుంటుందని బెదిరిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
ఏడాదిన్నర క్రితం ఇచ్చిన నగదుకు ఇప్పుడు వివరాలు అడగమేమిటని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అప్పు డు ఎలాంటి షరతులు పెట్టకుండానే నగదును తమ ఖాతాల్లో జమ చేశారని, ఇప్పుడు ఎందుకు విచారణ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడో ఖర్చు చేసిన వివరాలు, బిల్లులు కావాలని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని మండిపడుతున్నారు. సర్కారు వైఖరిపై బీసీ సంఘాల నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గత సర్కారు వర్తింపజేసిన పథకాలను సైతం గుంజుకొనేందుకు యత్నించడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. విచారణ పేరిట లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు.