రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పాలన పూర్తిగా గాడితప్పింది. సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయింది. కేవలం 22 నెలల్లోనే రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని సర్కారు రూ.1.16 లక్షల కోట్లకు పైగా బకాయిల భారంతో నీరసించింది.
కాంగ్రెస్ పాలన ఇలాగే కొనసాగితే.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలో కూరుకుపో యే ప్రమాదం ఉన్నది. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మిగులు బడ్జెట్ రాష్ట్రంగా పేరుగాంచిన తెలంగాణ.. కాంగ్రెస్ పాలనలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది.
ఇది కాంగ్రెస్ హామీల డొల్లతనాన్ని వెల్లడిస్తున్నది. ఈ సంక్షోభం కేవలం కాగితాలకే పరిమితం కావడం లేదు. అన్నివర్గాల ప్రజలు తమకు రావాల్సిన బకాయిలపై వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సి వస్తున్నది.
జూలై వరకు రాష్ర్టాదాయం రూ.50,270 కోట్లు ఉండగా, ఖర్చు రూ.62,835 కోట్లకు పెరిగింది. రూ.24,669 కోట్లు అప్పు చేసినా, ప్రభుత్వం కేవలం రూ.5,988 కోట్లే వ్యయం చేసింది. మిగతా నిధులను సాధారణ ఖర్చులకే మళ్లించింది. ఒక్కో రంగానికి సర్కార్ ఇవ్వాల్సిన నిధుల బకాయిలు పేరుకుపోతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వంలో మాత్రం చలనం కనిపించడం లేదు.
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో (Congress Govt) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. వివిధ పథకాల కింద చెల్లించాల్సిన వాటితో పాటు, ఇతర వర్గాలకు ప్రభుత్వం ఏకంగా రూ.1.16 లక్షల కోట్లు బాకీ పడింది. తమకు రావాల్సిన బకాయిలపై ఆయా వర్గాల వారు నిత్యం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో రైతులకు అనేక హామీలు ఇచ్చింది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ (Runa Mafi)చేస్తామని ప్రకటించింది. ఇందుకు రూ.31 వేల కోట్ల ఖర్చు అవుతుందని ప్రకటించిన రేవంత్ సర్కారు.. రూ.20,616 కోట్లను మాత్రమే రుణమాఫీ చేసింది. ఇంకా రూ.10,384 కోట్ల మేరకు రుణమాఫీ చేయాల్సి ఉన్నది. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000 ఇస్తామనిమ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దానిని రూ.12,000కే కుదించింది. ఒక్కో సీజన్‌కు రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది వానకాలం సీజన్ రైతుభరోసా మొత్తం రూ.12 వేల కోట్లను రైతులకు ఇవ్వలేదు. యాసంగిలో రూ.5 వేల కోట్లు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం మరో రూ.7 వేల కోట్లను రైతులకు ఎగనామం పెట్టింది. మొత్తం రైతుభరోసా కింది రైతులకు రూ.19 వేల కోట్లు ఇవ్వనేలేదు. వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఆ తర్వాత సన్న ధాన్యానికే ఇస్తామని నాలుక మడతేసింది. ఇలా రూ.1,200 కోట్ల మేరకు రైతుల బోనస్ బకాయి ఇవ్వలేకపోయింది.
18,470 కోట్ల చేయూత పింఛన్ల బాకీ
వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, నేతన్నలు, ఐహెచ్వీ, బోధకాలు బాధితులు, డయాలసిస్ పేషంట్లు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ టేకేదార్లు.. ఇలా 10 వర్గాలకు చెందిన మొత్తం 37,19,332 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతినెలా రూ.2,016 చొప్పన ఆసరా పింఛన్ చెల్లిస్తున్నది. రాష్ట్రంలోని 4,78,462 మంది దివ్యాంగులకు రూ.4,016 చొప్పున అందజేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం వీరికి ప్రతినెలా రూ.2,797.35 కోట్లు చెల్లిస్తున్నారు. కానీ, ఎన్నికల సమయంలో రూ.2 వేల పింఛన్‌ను రూ.4 వేలకు, దివ్యాంగులకు ఇచ్చే రూ.4 వేల పింఛన్ సొమ్మును రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వడంతోపాటు మ్యానిఫెస్టోలో కూడా ప్రకటించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రకారం రూ.2000 అదనంగా ఇస్తే.. మొత్తం లబ్ధిదారులు 41,97,794 మందికి ప్రతినెలా రూ.839 కోట్ల 55 లక్షల 88 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 22 నెలలకుగాను రూ.18,470 కోట్ల 29 లక్షల 36 వేలు ఇప్పటివరకు సర్కార్ బాకీ పడింది.
వ్యవసాయ కూలీలకు రూ.1,320 కోట్లు
అర్హులైన వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12,000 చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలోని ఉపాధి హామీ జాబ్‌కార్డులు 53 లక్షల మందికి ఉన్నాయి. వీరిలో ఎలాంటి భూమిలేని వారు 20 లక్షల మంది వరకు ఉన్నారు. ఇందులో ఏడాదిలో 20 రోజులు ఉపాధి కూలీకి వెళ్లేవారు 11 లక్షల మంది ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం వీరికి రూ.12,000 చొప్పున ఏటా చెల్లించాల్సి ఉన్నది. ఈ మేరకు రూ.1,320 కోట్లు వ్యవసాయ కూలీలకు చెల్లించాల్సి ఉన్నది.
కౌలు రైతులకు రూ.6,000 కోట్లు
రైతులతోపాటు కౌలు రైతులకూ ఎకరానికి రూ.15,000 చొప్పన అందిస్తామని కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రకటించింది. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం.. సుమారు 20 లక్షల మంది ఉన్నారు. వీరు సగటున రెండు ఎకరాల చొప్పున కౌలుకు సాగుచేసినా 40 లక్షల ఎకరాలు అవుతుంది. అంటే ఏడాదికి కౌలు రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బాకాయి రూ.6,000 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మూడో వ్యవసాయ సీజన్ కొనసాగుతున్నది.
యువతుల స్కూటీలకు రూ.7,500 కోట్లు
18 సంవత్సరాలు పైబడిన చదువుకొనే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన యువతులు సుమారు 5 లక్షల మంది వరకు ఉంటారు. ఒక్కో ఎలక్ట్రిక్ స్కూటీ లక్షన్నర రూపాయలు అనుకున్నా.. రూ.7,500 కోట్లు అవుతాయి. ఈ మొత్తం కూడా రేవంత్ సర్కారు తెలంగాణ ఆడబిడ్డలకు బాకీ పడింది.
విద్యాభరోసా కార్డు కింద బాకీ రూ.4,500 కోట్లు
రాష్ట్రంలో ఉన్నత విద్యలో ఏటా డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇతర కోర్సుల్లో సుమారు 9 లక్షల మంది చేరుతున్నారు. వీరికి విద్యాభరోసా కార్డు కింద రూ.5 లక్షలు ఇస్తామని మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. ఇలా ఒక్కో విద్యార్థికి రూ.5 లక్షల చొప్పున రూ.4,500 కోట్ల మేరకు విద్యార్థులకు బాకీ పడింది.
ఆటో డ్రైవర్లకు రూ.840 కోట్లు రావాలి
రాష్ట్రంలోని ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏటా రూ.12,000 చొప్పున ఆర్థికసాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో అర్హులైన ఆటో డ్రైవర్లు ఏడు లక్షల మంది వరకు ఉన్నారు. ఒక్కొక్కరికీ రూ.12,000 చొప్పన ఏడు లక్షల మందికి రూ.840 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.
అమరుల కుటుంబాలకే రూ.330 కోట్లివ్వాలి
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమ అమరవీరుల తల్లి/తండ్రి, భార్యకు రూ.25,000 చొప్పున నెలవారీ గౌరవ పింఛన్ ఇస్తామని ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం, ఇంటి జాగా కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం.. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు సుమారు 600 వరకు ఉన్నాయి. నెలకు రూ.25 వేల చొప్పన ఒక్క నెలకు వారికి ఇవ్వాల్సింది రూ.1.50 కోట్లు. 22 నెలలకు గాను రేవంత్‌రెడ్డి సర్కారు రూ.330 కోట్లు బాకీ పడింది.
వివిధ వర్గాల బకాయిలు రూ.35 వేల కోట్లు
మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులే రూ.700 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. రూ.85 కోట్ల బకాయిల కోసం రేషన్ డీలర్లు ఎదురుచూస్తున్నారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, శానిటేషన్ వరర్లు, పార్ట్‌టైం, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్ సిబ్బంది జీతాలు 5 నెలల నుంచి 20 నెలల వరకు బకాయి ఉన్నాయి. వివిధ రకాల పనులు కాంట్రాక్టర్లకు సుమారు రూ.10,000 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఉద్యోగుల జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు రూ.8,000 కోట్లు ఉన్నాయి. రూ.10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, రూ.1,300 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు, ఇతర సర్దుబాటు బిల్లులు కలిపి రూ.5,700 కోట్లకు పైగా సర్కార్ ఇవ్వాల్సి ఉన్నది.పేద మహిళలకు రూ.10,450 కోట్ల బాకీ
మహాలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో తొలి ప్రాధాన్యంగా పేర్కొన్నది. రాష్ట్రంలో 19 లక్షల పైచిలుకు మంది మహిళలకు రూ.2,500 చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. పెన్షన్లు రాని, 55 ఏండ్ల లోపు తెల్లరేషన్ కార్డులు ఉన్న మహిళలకు ఈ నగదును నెలనెలా అందజేస్తామని వెల్లడించింది. ఇలా ప్రభుత్వ లెక్కల ప్రకారం.. నెలకు రూ.475 కోట్లు ఈ పథకం కింద మహిళలకు చెల్లించాల్సి ఉన్నది. అంటే 22 నెలలకు గాను రేవంత్‌రెడ్డి సర్కారు మహిళలకు బాకీ పడిన మొత్తం రూ.10,450 కోట్లు అవుతుంది.
కల్యాణలక్ష్మి బాకీ రూ.1,725 కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 2014 నుంచి ఆగస్టు 2024 వరకు 13,18,983 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 11,62,917 మందికి రూ.1,00,116 చొప్పున ఆర్థిక సహాయం అందింది. 2024-25 బడ్జెట్ కింద ప్రభుత్వం రూ.1,225.43 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.649.86 కోట్లు అప్రూవ్డ్ అప్లికేషన్లకు, రూ.240.73 కోట్లు మంజూరైన వాటికి కేటాయించారు. 22 నెలల్లో కొత్తగా సుమారు 1.50 లక్షల మందికి పైగా యువతులకు వివాహాలు జరిగి ఉండవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.1,00,116తోపాటు తులం బంగారం ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వనేలేదు. ఇప్పుడు తులం బంగారం ధర రూ.1.15 లక్షలు పలుకుతున్నది. అంటే లక్షన్నర మంది లబ్ధిదారులకు రూ.1.15 లక్షల చొప్పున రూ.1,725 కోట్లను సర్కార్ చెల్లించాల్సి ఉన్నది.
ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు (రూ.కోట్లల్లో)
వివిధ పథకాలకు సర్కారు ఇవ్వాల్సిన బకాయిలు (రూ.కోట్లల్లో)