హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల పర్యవేక్షణ గాలికి వదిలేయడం, ఉన్నతాధికారులు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడంతో విద్యార్థులు, సిబ్బంది అవస్థలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక ఆవేదనచెందుతున్నారు. గురుకులంలో చేరిన విద్యార్థులకు ఏటా మూడు జతల యూనిఫాం, పీఈటీ డ్రెస్ ఇవ్వాల్సి ఉండగా గత సంవత్సరం ఇవ్వాల్సిన యూనిఫామ్ ఇప్పటివరకు ఇవ్వలేదు. క్లాత్‌ను సొసైటీ కొనగోలు చేసినా, కుట్టుపని ప్రారంభమేకాలేదు. ఎస్సీ గురుకుల సొసైటీ ఈ ఏడాది 5వ తరగతి ప్రవేశాలను జిల్లా మెరిట్ ఆధారంగా కాకుండా రాష్ట్రస్థాయి మెరిట్ ఆధారంగా నిర్వహించింది. దీంతో ఒక జిల్లాకు చెందిన విద్యార్థులకు సుదూరప్రాంతాల్లోని మరో జిల్లాలో అడ్మిషన్లు ఇచ్చారు. నిరుపేద విద్యార్థులు సీట్లను వదులుకోలేక, సుదూర ప్రాంతాల్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. సొంత జిల్లాల్లోని గురుకులాల్లో అడ్మిషన్లను కల్పించాలని ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులను వేడుకున్నా స్పందన లేదు. దీంతో పలువురు సీట్లను వదులుకుని వెళ్లిపోయారు.
గందరగోళంగా ఇంటర్ విద్య
ఇంటర్, సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)ల్లో ప్రవేశప్రక్రియను సైతం ఈ ఏడాది పూర్తిగా మార్చేశారు. గురుకులాల్లోని 12 జూనియర్ కాలేజీలను సొసైటీ రద్దు చేసింది. రాష్ట్రస్థాయి మెరిట్‌తోనే సీట్లను భర్తీ చేసింది. 80 కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీతోపాటు ఒకేషనల్ కోర్సుల్లోనూ మార్పులు చేసింది. కొన్ని కాలేజీలను సైన్స్ గ్రూపులకు, మరికొన్ని కాలేజీలను ఆర్ట్స్ గ్రూపులకు పరిమితంచేసింది. మరికొన్నింటిలో మిశ్రమ కోర్సులను రన్ చేయాలని నిర్ణయించింది. 35 ఒకేషనల్ కాలేజీలను 15 కాలేజీలకు కుదించింది. మరో 15 కాలేజీల్లో, ప్రధానంగా హైదరాబాద్ చుట్టపక్కల కాలేజీల్లో కొత్తగా పలు ఒకేషనల్ గ్రూపులను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఈ మార్పులకు అనుగుణంగా సిబ్బందిని మాత్రం నియమించలేదు.
సొసైటీ పరిధిలో కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సైనిక్సూల్, బీబీనగర్‌లో ఆర్మ్ ఫోర్సెస్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. బీబీనగర్ ఆర్మ్ ఫోర్సెస్ మహిళా డిగ్రీ కాలేజీని ఘట్కేసర్అవుశాపూర్ క్యాంపస్‌కు తరలించారు. ఏడాదిన్నరగా థియ రీ క్లాస్‌లు సాగుతుండగా ఆర్మీ శిక్షణ పడకేసింది.
ఈ ఏడాది కొత్తగా చాలాచోట్ల కోడింగ్ సూల్స్‌ను ప్రారంభించింది. నిపుణులైన ట్రైనర్లు, ల్యాబ్‌ను ఇప్పటికీ కల్పించలేదు.
పని ఒత్తిడిలో ఉపాధ్యాయులు
సర్కారు నిర్లక్ష్యంతో సొసైటీలోని టీచింగ్, నాన్‌టీచింగ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో గ్రూపుల విలీనం, తొలగింపు ఫలితంగా ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరిగింది. కొన్నిచోట్ల అవసరానికి మించి సిబ్బంది ఉండగా, మరికొన్నిచోట్ల మొత్తానికే లేకుండా పోయిన దుస్థితి. జీవో-317కు సంబంధించి స్పౌజ్, మెడికల్ క్యాటగిరీల్లో బదిలీలకు వేర్వేరుగా ప్రభుత్వం అనుమతులను జారీచేయగా, ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా సొసైటీలో ఈ బదిలీలను నిర్వహించారు. జీవో-1274 పేరిట చా లామంది ఔట్సోర్సింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగులను సొసైటీ తొలగించింది. సిబ్బందికి వేత నం ఎప్పుడు పడుతుందో తెలియని దుస్థితి .
అమాత్యా .. ఇకనైనా దృష్టిసారించండి
22 నెలలుగా సొసైటీలో ప్రమోషన్లు, బదిలీలు, విధానపరమైన నిర్ణయాలన్నింటి మీద మంత్రి అడ్లూరి లక్ష్మణ్, నూతన సెక్రటరీ కృష్ణ ఆదిత్య సమీక్షించాలని ఉద్యోగులు కోరుతున్నారు. హెడ్ ఆఫీసులోని డిప్యుటేషన్లన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిబ్బంది అవసరమైతే, కొత్త నియామకాల్లో ఇంటర్వ్యూ, సీనియారిటీ ఆధారంగా, గరిష్ఠంగా మూడేండ్లపాటు మాత్రమే కల్పించాలని సూచిస్తున్నారు. డిగ్రీ కాలేజీల పర్యవేక్షణ సీనియర్ అధికారికి అప్పగించి, జాయింట్ సెక్రటరీ పోస్టును అర్హులతో భర్తీచేయాలని, వర్క్‌లోడ్‌కు అనుగుణంగా గురుకులాల్లో సిబ్బందిని కేటాయించాలని కోరుతున్నారు.