హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాజకీయ స్వలాభం కోసం గురుకుల అభ్యర్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడింది. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఆగమేఘాలపై అవరోహణ క్రమంలో కాకుండా, ఆరోహణ పద్ధతిలో పోస్టుల భర్తీని చేపట్టి ఆగం చేసింది. అభ్యర్థుల అభ్యంతరాలతో డౌన్మెరిట్ విధానమే అమలు చేస్తామని, బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా న్యాయ చేస్తామని నమ్మబలికింది. నోటిఫికేషన్ ప్రకారమే పోస్టులను భర్తీ చేస్తామంటూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత గురుకుల అభ్యర్థులను ప్రభుత్వం నట్టేట ముంచింది. నోటిపికేషన్లో ఇచ్చిన 9,210 పోస్టుల్లో దాదాపు 2,500 పోస్టులు మళ్లీ మిగిలాయి. సర్కారు తీరును, ట్రిబ్ నిబంధనలకు విరుద్ధంగా అనుసరించిన విధానాలను హైకోర్టులో అభ్యర్థులు సవాల్ చేశారు. ఇప్పుడు హైకోర్టు ధర్మాసనం గురుకుల అభ్యర్థులకు అండగా నిలిచింది. డౌన్మెరిట్ ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. అయితే సర్కారు దానిని అమలు చేస్తుందా? లేక మళ్లీ అప్పీల్‌కు వెళ్తుందా? అనే విషయాలపై గురుకుల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, స్కూల్ లైబ్రేరియన్, స్కూల్ పీడీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్.. మొత్తం కలిపి 9,210 పోస్టుల భర్తీకి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు(ట్రిబ్) నోటిఫికేషన్ జారీచేసింది. 2023 ఆగస్టులోనే రాత పరీక్షను నిర్వహించింది. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులను మినహాయించి మిగతా పోస్టుల భర్తీని చేపట్టింది. అవరోహణ క్రమంలో అంటే డీఎల్ నుంచి టీజీటీ వరకు పోస్టుల భర్తీని చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఎన్నికల కోడ్‌తో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల అనంతరం ఆయా పోస్టుల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించింది. పీటీజీ ఆ తర్వాత టీజీటీ పోస్టుల భర్తీకి రాత్రికి రాత్రే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి, తుది జాబితాలను ప్రకటించింది. 2024 ఫిబ్రవరి, మార్చిలో అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇచ్చింది. మొత్తంగా 8,708 పోస్టులకు 1:2 చొప్పున ఎంపిక చేసింది. కొన్ని క్యాటగిరీల్లో అర్హులే లేరంటూ 9,210 పోస్టుల్లో 404 పోస్టులను భర్తీ చేయలేదు. కామన్ పేపర్ పెట్టి పరీక్ష నిర్వహించడం వల్ల పీజీటీతోపాటు, జేఎల్, డీఎల్ పోస్టులకు సైతం అనేక మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. పలువురు టీజీటీ పోస్టులను సైతం సాధించారు. రెండేసి, మూడేసి అపాయింట్మెంట్ ఆర్డర్లను అందుకున్నారు. అయితే సదరు అభ్యర్థులు ఉన్నత పోస్టులనే ఎంచుకున్నారు. మరోవైపు డిసెండింగ్ ఆర్డన్ను పాటించకపోవడంతో ప్రాథమికంగానే భారీగా పోస్టులు భర్తీకాకుండా మిగిలిపోయాయి. మొత్తంగా దాదాపు 2,500 పోస్టులకు పైగా ఖాళీగా మిగిలిపోవడం గమనార్హం.
ట్రిబ్ అనుసరించిన రిక్రూట్మెంట్ ప్రక్రియపై, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో విసుగెత్తిన అభ్యర్థులు తుదకు కోర్టు మెట్లను ఎక్కారు. అవరోహణ క్రమంలో పోస్టులను భర్తీ చేపట్టకుండా, ఆరోహణ పద్ధతిలో అన్ని ఉద్యోగాలను భర్తీ చేయడంతో 2,000కు పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడే పరిస్థితి ఏర్పడిందని కోర్టుకు విన్నవించారు. 2017లో విద్యుత్తు సంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్ల నియామక ప్రక్రియలో, 2022లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో వందల పోస్టులు మిగిలిన విషయాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు.
తాజాగా హైకోర్టు తుది తీర్పుతో అభ్యర్థులకు ఊరట లభించింది. గతంలోనూ గురుకుల అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం గురుకుల నియామకాల్లో మిగిలిపోతున్న ఉద్యోగాలన్నిటినీ తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులను జారీచేసింది. ట్రిబ్, ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తుది తీర్పులో తీవ్రంగా తప్పుబట్టింది. ఒకే సమయంలో బహుళ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిన సమయంలో, అభ్యర్థులు ఒక పోస్టులో చేరితే, ఇతర పోస్టులు ఖాళీ అవడం సహజమని తెలిపింది. జీవో 81 ప్రధానంగా ఒకే నోటిఫికేషన్ నియామక ప్రక్రియ కోసమని, ఒకేసారి అనేక పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి ఆ నిబంధన వర్తింపు సరికాదని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు తీర్పులను ఈ సందర్భంగా ఉటంకించింది. ఎంపికైనా కూడా అభ్యర్థులు జాయిన్ కాకుండా మిగిలిన ఖాళీలను వెంటనే తదుపరి మెరిట్ అభ్యర్థుల ద్వారా భర్తీ చేయాలని, 6 నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాల్లో స్పష్టంచేసింది. పిటిషన్లంటినీ రద్దు చేసింది. కోర్టు తీర్పుతో గురుకుల అభ్యర్థులకు ఊరట లభించింది. కోర్టును తీర్పును అభ్యర్థులు స్వాగతించడంతోపాటు, హైకోర్టు బెంచ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.