BRS Party | మహబూబ్‌నగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా, గోదావరిలో వరద వృథాగా పోతున్నది.. వారంలోగా కన్నెపల్లి, కల్వకుర్తి పంప్‌హౌస్ మోటర్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోసి రైతుల పొలాలకు మళ్లించకుంటే కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మంది అన్నదాతలతో కలిసి మేమే మోటర్లను ఆన్చేస్తం’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన అల్టిమేటంతో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. బీఆర్ఎస్ తరఫున హరీశ్ చేసిన హెచ్చరికలకు రెండు రోజుల్లోనే స్పందించింది. కృష్ణానదికి వరద పోటెత్తుతున్నతరుణంలో కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్ర వీడింది. ఎట్టకేలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటర్లను గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభించింది. మంగళవారం హడావుడిగా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు, నియోజకవర్గంలోని ఎల్లూరు సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌కు మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి చేరుకున్నారు. అప్పటికే నీటి పారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా మంత్రి జూపల్లి, వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, రాజేశ్‌రెడ్డి, నారాయణరెడ్డితో కలిసి మోటర్లను ఆన్‌చేశారు. ప్రాజెక్టులకు నీళ్లు మళ్లించకుండా చేస్తున్న జాప్యంపై మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరికలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించిందని స్థానిక రైతుల్లో చర్చ నడుస్తున్నది.
అధికారులకు సమాచారం ఇవ్వకుండానే
తెలంగాణలోని కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు సాగునీటిని విడుదల చేయాలని, లేదంటే దండయాత్ర చేస్తామని, తామే మోటర్లు ఆన్‌చేసి నీళ్లు విడుదల చేస్తామన్న బీఆర్ఎస్ అల్టిమేటంతో ప్రభుత్వం దిగొచ్చింది. కనీసం జిల్లా ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించకుండా మోటర్లు ఆన్ చేయడం చర్చనీయాంశమైంది. అనధికారికంగా ఈ కార్యక్రమం కొనసాగింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు విడుదల చేశారు. కాగా ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులను, ఇరిగేషన్ శాఖాధికారులను సంప్రదించగా తమకేం తెలియదని దాటవేశారు. మీడియాకు వెల్లడించకుండా గోప్యంగా ఉంచడం గమనార్హం.
వరద పోతున్నా మొద్దు నిద్ర
ఉమ్మడి పాలమూరు జిల్లాకు అత్యంత కీలకమైన కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నీటిని మళ్లించాల్సిన సర్కారు కొద్దిరోజులుగా నిద్రావస్థలో ఉండిపోయింది. తుంగభద్ర, కృష్ణానదికి భారీ వరదలు వస్తున్నా స్పందించలేదు. సుమారు 230000 క్యూసెక్కుల నీళ్లు వారం నుంచి శ్రీశైలంలోకి వచ్చి చేరా యి. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమ ట్టం 889 అడుగులు కాగా వారం పది రోజుల్లోనే పూర్తిస్థాయిలో నిండింది. ఏపీ సీఎం చంద్రబాబు అధికారికంగా శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. మరోవైపు బాబు ఆదేశాలతో పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, మచ్చుమర్రితో పాటు ఇతర ప్రాజెక్టులకు వారం పది రోజుల నుంచి వేలాది క్యూ సెక్కుల కృష్ణా జలాలను అక్కడి మంత్రులు గుట్టుచప్పుడు కాకుండా వదులుతున్నారు.
కానీ సాక్షాత్తు తెలంగాణ సీఎం సొంత జిల్లాలో ప్రాజెక్టులకు నీళ్లు వదలాలనే సోయి లేకుండా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీసింది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ ఏడాది మేలోనే జూరాల ప్రాజెక్టుకు వరద మొదలైంది. జూన్‌లో కొంతకాలం వరద ఆగినా 20 రోజుల నుంచి నిరంతరాయంగా పెరుగుతున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు 36 గంటల్లోనే నిండిపోయింది. బీఆర్ఎస్ హయాంలో ముందస్తుగానే నీటిని విడుదల చేయగా కాంగ్రెస్ సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాలు కొన్ని ప్రాంతాలకే పరిమితకావడంతో చాలా చోట్ల రైతులు మొగులు వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో కృష్ణా నదికి భారీ వరద వస్తుండటంతో ముందస్తుగానే కాల్వలకు నీళ్లు మళ్లించి రిజర్వాయర్లు నింపడంతోపాటు గొలుసు కట్టు చెరువులు నింపి ఉంటే కాల్వల్లోకి నీళ్లు చేరి సేద్యం కళకళలాడుతూ ఉండేది. కానీ రైతులు దుక్కి దున్ని వర్షాల కోసం ఎదురుచూసే పరిస్థితిని సర్కారు తెచ్చింది.
పాలమూరుకు కృష్ణమ్మ
కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేయడంతో బిరబిరమంటూ కృష్ణమ్మ పాలమూరు పొలాలను ముద్దాడింది. హరీశ్ హెచ్చరికలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా.. చివరికి అధికారిక ప్రకటన చేయకుండానే ప్రభుత్వం నీటిని విడుదల చేయడంతో జలాలు కాల్వల్లో పరుగులు పెట్టాయి. ఎట్టకేలకు కల్వకుర్తి పథకం మోటర్లు ఆన్ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది బీఆర్ఎస్ విజయమేనంటూ ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
చెరువు కింద సాగు చేయలే
సింగోటం రిజర్వాయర్ కింద వరి పంటలను సాగు చేయలే. రిజర్వాయర్‌కు కృష్ణా నీళ్లు రాకపోవడంతో ఇప్పటి వరకు తుకాలు కూడా పోసుకోలే. వరద వచ్చినప్పుడే ఎంజీకేఎల్ మోటర్లు ఆన్ చేసి ఉంటే మా రిజర్వాయర్ నిండి ఉండేది. అలాగే వరి నాట్లను కూడా వేసుకునేవాళ్లం.
– చింతకుంట శ్రీనివాసులు, రైతు, సింగోటం, నాగర్‌కర్నూల్ జిల్లా
రైతులకు సమాధానం చెప్పాలి
కృష్ణానది నీళ్లను ఆంధ్రా ప్రాజెక్టుల ద్వారా కొల్లగొట్టిన తర్వాత కూడా ఎంజీకేఎల్ఐ మోటర్లను ఎందుకు ఆన్ చేయలేదో రైతులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎంజీకేఎల్ కాలువ సామర్థ్యం తక్కువగా ఉండటానికి, మోటర్లు కాలిపోవడానికి కారణం అప్పటి ప్రజాప్రతినిధి కమీషన్లకు ఆశపడడమే. ఇప్పుడు బట్ట కాల్చి ఎదుటివారి మీద వేయడం సరికాదనే విషయం మంత్రి తెలుసుకోవాలి.
– బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా