హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తెలంగాణను (Telangana) అప్పుల కుప్పగా మార్చుతున్నది. కేవలం రెండేండ్లలోనే రూ.2.88 లక్షల కోట్ల రుణాలు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది రూ.3 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నది. రాష్ట్ర సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో ఘోరంగా విఫలమైన రేవంత్రెడ్డి సర్కారు.. రుణ సమీకరణలో రాకెట్లా దూసుకెళ్తున్నది. అలా ఈ ఆర్థిక సంవత్సరంలోనే మారెట్ రుణాలు, బడ్జెటేతర (నాన్-ఎఫ్ఆర్బీఎం) రుణాల ద్వారా ఏకంగా రూ.1.45 లక్షల కోట్లు సమీకరించింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించిన గణాంకాల ప్రకారం.. 2023-24 చివరి నాటికి మొత్తం ప్రజారుణం రూ.3.5 లక్షల కోట్లుగా ఉన్నది. ఇందులో బహిరంగ మారెట్ రుణాలు, కేంద్రం నుంచి తెచ్చిన రుణాలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ఎన్ఎస్ఎస్ఎఫ్ సెక్యూరిటీలు, ఉమ్మడి రాష్ట్రం నుంచి వాటాగా వచ్చిన రుణాలు కూడా ఉన్నాయి.
మార్కెట్ రుణాలు రూ.5.08 లక్షల కోట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం ప్రకారం, వివిధ కార్పొరేషన్ల ద్వారా సమీకరించిన బడ్జెటేతర రుణాలు రూ.1.1 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఎఫ్ఆర్బీఎం, నాన్-ఎఫ్ఆర్బీఎం రుణాలు కలిపి దాదాపు రూ.4.6 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం రూ.35 వేల కోట్ల అప్పులు చేసింది. అలాగే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వారసత్వంగా రూ.72 కోట్ల రుణాలు వచ్చాయి. 2024-25లో తెలంగాణ రుణభారం మరింత పెరిగింది. లోక్సభలో కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎఫ్ఆర్బీఎం పరిమితుల కింద సేకరించిన రూ.68,000 కోట్లతో కలిపి తెలంగాణ మొత్తం రుణాలు రూ.4.42 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది డిసెంబర్ 2 నాటికి మారెట్ రుణాలు మరో రూ.66 వేల కోట్లు పెరిగాయి. దీంతో ఎఫ్ఆర్బీఎం పరిమితి పరిధిలోని మొత్తం మార్కెట్ రుణాలు రూ.5.08 లక్షల కోట్లకు ఎగబాకాయి.
అడ్డగోలుగా బడ్జెటేతర రుణాలు
రేవంత్రెడ్డి సర్కారు బడ్జెటేతర అప్పులను కూడా అడ్డగోలుగా తీసుకుంటున్నది. ఇలాంటి రుణాలు ఈ ఏడాది డిసెంబర్ 2 నాటికి దాదాపు రూ.2.4 లక్షల కోట్లకు పెరిగాయి. ఇందులో కంచె గచ్చిబౌలి భూములపై తీసుకున్న రూ.10,000 కోట్ల రుణం, వివిధ పట్టణ స్థానిక సంస్థల ద్వారా తీసుకున్న రూ.12 వేల కోట్లతోపాటు దాదాపు రూ.5 వేల కోట్ల హడో రుణాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం తెలంగాణ మొత్తం అప్పులు రూ.7.48 లక్షల కోట్లకు చేరాయి. గత రెండేండ్లలో తిరిగి చెల్లించిన అప్పులు, వడ్డీలను మినహాయిస్తే తెలంగాణ మొత్తం పెండింగ్ రుణాలు దాదాపు రూ. 6.8 లక్షల కోట్లుగా ఉన్నట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో రాష్ట్రం కొత్తగా రూ.71,400 కోట్ల రుణాలు సమీకరించుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
ఇది ఎఫ్ఆర్బీఎం నిబంధనల కింద అనుమతించిన రూ.54,009 కోట్ల కంటే చాలా ఎకువ. దీనితోపాటు పాత రుణాల రీషెడ్యూలింగ్, పునర్వ్యవస్థీకరణకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. దీన్ని అసాధారణ వెసులుబాటుగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మొత్తంలో రుణాలు సమీకరిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాష్ట్ర మూలధన వ్యయం పెరగడం లేదని, ఆదాయాన్ని సమకూర్చే ఆస్తుల కల్పన కూడా జరుగడం లేదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో ఆర్థిక వెసులుబాటును తగ్గించి, దీర్ఘకాలిక వృద్ధికి ఆటంకం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. వారసత్వంగా వచ్చిన అప్పులు, 2023-24లో చేసిన అప్పులను మినహాయిస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు పదేండ్ల కాలంలో బహిరంగ మారెట్ ద్వారా రూ.2.8 లక్షల కోట్ల రుణాలు సమీకరించింది. బడ్జెటేతర మార్గాల ద్వారా మరో రూ.1.1 లక్షల కోట్ల అప్పు చేసింది. దీన్ని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు రెండేండ్ల్లలోపే అధిగమించింది. అయినప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టకపోవడం, చెప్పుకోదగ్గ పథకాలేమీ అమలు చేయకపోవడం గమనార్హం.
ఇప్పటివరకు తెలంగాణకు ఉన్న అప్పులు