ప్రపంచం నిద్రపోతున్నా.. రేయనక.. పగలనక పోలీసు డ్యూటీ చేస్తాడు. అనుకోని ఆపదలు ఏమైనా వస్తే.. ఆ దేవుడు కూడా పంపించేది పోలీసునే అని అంటారు. క్రమశిక్షణ, సమయపాలన, వృత్తిపరమైన ప్రమాదాలు, ఒత్తిడితో కూడిన ఉద్యోగం పోలీసులను తీవ్ర ఆరోగ్య సమస్యల్లోకి నెడుతున్నాయి. గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోలీసులకు పరిమితి లేకుండా చికిత్సలు అందాయి. వారితోపాటు కుటుంబసభ్యులూ అన్ని రకాల వైద్యం చేయించుకున్నారు. కానీ ఇప్పుడు.. ‘రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు..’ అంటూ షరతులు పెట్టారు. పోలీసు సంక్షేమాన్ని గాలికి వదిలేసి వారి ఆరోగ్య భద్రత నిధులను భారీగా కుదించారు.
హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్ ఆరోగ్య భద్రతపై కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రభుత్వం నిర్దేశించిన సీలింగ్‌కు ఒక్క రూ పాయి ఎక్కువైనా పోలీసులే తమ జేబు నుంచి కట్టుకోవాలి లేదా మరో దవాఖానకు వెళ్లాలి. ఎంప్యానెల్డ్ దవాఖానలు సైతం పరిమితికి మించి బిల్లులు వేస్తే చర్యలు తప్పవని పోలీసుశాఖ రహస్య సర్క్యులర్లు జారీచేసిం ది. దీంతో గత జూలై నుంచి కార్పొరేట్ దవాఖానల్లో చికిత్సలు చేయించుకోలేక పోలీసు కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నాయి.
చికిత్సల్లో సీలింగ్ లిమిట్ మించొద్దు
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరోగ్య భద్రత పథకం కింద వైద్య చికిత్సలపై గరిష్ఠ పరిమితి (సీలింగ్ లిమిట్స్) విధిస్తూపై పోలీసుశాఖ జూలై 9న రహస్యంగా సర్క్యులర్ జారీ చేసింది. చికిత్స వ్యయాన్ని కృత్రిమంగా పెంచడానికి అనైతిక పద్ధతులు అవలంబించవద్దని ఎంప్యానెల్డ్ దవాఖానలను హెచ్చరించింది. ప్రభుత్వం నిర్దేశించిన టారిఫ్ (జీవో నం.97) ప్రకారం మాత్రమే చికిత్స ఖర్చులను పరిమితం చేయాలని ఆదేశించింది. పోలీసు సిబ్బంది సాధారణ చికిత్సలకు గరిష్ఠంగా రూ.5 లక్షలు, నాలుగు ప్రధాన వ్యాధులకు గరిష్ఠంగా రూ.7.5 లక్షల వరకు మాత్రమే అనుమతి ఇవ్వాలని తెలిపింది. ఇక పోలీసు కుటుంబసభ్యులు అంటే భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు సాధారణ చికిత్సలకు గరిష్ఠంగా రూ. లక్ష, నాలుగు ప్రధాన వ్యాధులకు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు మాత్రమే చికిత్స అందించాలని ఆదేశించింది.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
ఆ సర్యులర్లోని నిబంధనలను ఉల్లంఘిస్తూ చికిత్స వ్యయాలను పెంచడానికి ప్రయత్నిస్తే.. ఆ దవాఖానలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య భద్రత ట్రస్ట్ హెచ్చరించింది. ఈ బెదిరింపులతో చాలామంది పోలీసు కుటుంబాలు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలవైపు మొగ్గు చూపుతున్నారు. పోలీసు వాట్సాప్‌గ్రూపుల్లో ఉన్నతాధికారులే ఆరోగ్య భద్రత స్కీంతో ఎలాంటి ఉపయోగం ఉండదని, నేరుగా ప్రైవేట్ హెల్త్ పాలసీలు తీసుకోవాలని వాయిస్ మెసేజ్‌లు పంపారు.
రూ.300 కోట్ల వరకూ బకాయిలు
కాంగ్రెస్ ప్రభుత్వం నెట్వర్క్ దవాఖానలకు బిల్లులు చెల్లించకపోవడంతో.. ప్రస్తుతం సుమారు రూ.300 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్టు తెలిసింది. దీంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానలు పోలీసులకు చికిత్స చేసేందుకు ససేమిరా అంటున్నాయి. ఆరోగ్య భద్ర త కింద ప్రతిరోజు 120-130 కేసులు నమోదువుతున్నా.. బకాయిల విషయంలో ప్రభు త్వం చర్యలు తీసుకోకపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానిస్తున్నారు.
పోలీసుల ప్రతిపాదనలకు ఒప్పుకున్న నిమ్స్?
డీజీపీ, ఆరోగ్య భద్రత సభ్యులు ప్రభుత్వాన్ని ఒప్పించలేక నిమ్స్ దవాఖానతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఒప్పందం ప్రకారం పోలీసు కుటుంబసభ్యులకు సాధారణ వ్యాధులకు లక్ష , ఏవైనా నాలుగు పెద్ద వ్యాధుల కు రూ.2 లక్షలు దాటితే నేరుగా నిమ్స్‌కు వచ్చి వైద్యం పొందొచ్చు. సిబ్బందికి రూ.5 లక్షలు సాధారణ వ్యాధులకు, రూ.7.5 లక్షలు నాలుగు పెద్ద వ్యాధులకు చికిత్స ఖర్చులు మించితే వారు స్పెషల్ మంజూరుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నిమ్స్‌లో ఉచితంగా చికిత్స పొందొచ్చు..
పోలీసు ఆరోగ్య భద్రత కింద విధించి న పరిమితి దాటితే ఆ చికిత్సలకు నిమ్స్ హాస్పిటల్లో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని పోలీసు వెల్ఫేర్ డీఎస్పీ కే శ్రీనివాసరెడ్డి శుక్రవారం వివరణ ఇచ్చా రు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో కవరేజ్‌లో లేవో వాటికి కూడా నిమ్స్‌లో చికిత్స చేస్తారని చెప్పారు. ‘పోలీసులకు ఇక నుంచి ఆరోగ్య భద్రత కేవలం నిమ్స్ దవాఖానలోనే’ అని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని అన్నారు.