హాలియా, మార్చి 22: కాంగ్రెస్ ప్రభు త్వం బడ్జెట్లో గిరిజనులకు మొండిచెయ్యి చూపిందని ట్రైకార్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకుడు ఇస్లావత్ రాందందర్నాయక్ ఆరోపించారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా హాలియాలో నాగార్జునసాగర్ నియోజకవర్గ గిరిజన నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేవెళ్లలో డిక్లరేషన్ ఇచ్చారని గుర్తుచేశారు.
అటవీ భూములకు పట్టాలు, మైదాన ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో ఐటీడీఏను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోనికి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విస్మరించిదని మండిపడ్డారు. రాష్ట్రంలో 60 లక్షల మంది గిరిజన ఓటర్లు ఉండగా.. మంత్రివర్గంలో గిరిజనులకు అవకాశం కల్పించకపోవడం బాధాకరమని చెప్పారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన గిరిజనులే రేపు కాంగ్రెస్ను బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.