Tummidihetti Barrage | కాళేశ్వరం మీద కోపం.. కేసీఆర్ మీద కడుపునిండా కసి.. మేడిగడ్డ బరాజ్ రెండు పిల్లర్లకు రెండున్నరేండ్లుగా రిపేరు చేయించడానికి చేతులు రాని కాంగ్రెస్ ప్రభుత్వం.. తమ్మిడిహట్టిపై తలకిందులుగా తపస్సు చేస్తున్నది. మొదట్లో తమ్మిడిహట్టిపై తొడగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్కడ సాంకేతికంగా ప్రాజెక్టు సాధ్యంకాదని ఒక నిర్ణయానికి వచ్చింది. సాంకేతిక సమస్యలు, మహారాష్ట్ర అభ్యంతరాలు, పర్యావరణ ప్రతిబంధకాల నేపథ్యంలో ప్రతిపాదనలను మార్చుతూపోతున్నది. రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయించి, కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాల్సిందిపోయి.. ఇప్పుడు రెండు బరాజ్‌లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
సాధారణంగా రెండు నదులు సహజంగా కలిసిన సంగమ స్థానం తర్వాత బరాజ్‌లు, ప్రాజెక్టులు నిర్మిస్తుంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రెండు నదులకు అడ్డంగా బరాజ్‌లు నిర్మించి, వాటిని మరో కాంక్రీట్ నిర్మాణంతో అనుసంధానించి, అసహజంగా నదీ సంగమం చేయాలని భావిస్తున్నది. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలపై అంచనా లేదు! రెండు నదుల్లోని వేర్వేరు ప్రవాహ ఉధృతిని ఏకకాలంలో ఎలా మేనేజ్ చేస్తారనే స్పష్టత లేదు! ముంపు సమస్యపై అధ్యయనం లేదు! ఇం జినీర్లతో విస్తృతంగా చర్చించిందీ లేదు! అయినా సరే.. తాననుకున్నదే జరుగాలన్న మొండిపట్టుతో ఎక్కడా లేని వింతైన నిర్మాణానికి సర్కార్ సిద్ధమైంది.
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయించి, కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాల్సిందిపోయి.. తమ్మిడిహట్టి వద్ద రెండు బరాజ్‌లు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సాధారణంగా రెండు నదులు సహజంగా కలిసిన సంగమ స్థానం తర్వాత బరాజ్‌లు, ప్రాజెక్టులు నిర్మిస్తుంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రెండు నదులకు అడ్డంగా బరాజ్‌లు నిర్మించి, వాటిని మరో కాంక్రీట్ నిర్మాణంతో అనుసంధానించి, నదుల కృత్రిమ సంగమం చేయాలని భావిస్తున్నది. ఇది సాంకేతికంగా అత్యంత క్లిష్టతరమని, ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తమ్మిడిహట్టి వద్ద
రెండు బరాజ్‌లు నిర్మించి, నీటిని మళ్లించాలనే దిశగా సర్కార్ కసరత్తు చేస్తున్నది. వార్ధాపై ఒకటి, వైన్గంగాపై మరో బరాజ్ నిర్మించాలని, మధ్యలో 2.1 కిలోమీటర్ల మేర కాంక్రీట్ నిర్మాణాన్ని చేపట్టి కృత్రిమంగా జలాశయాన్ని ఏర్పాటు చేసి, నీటిని నిల్వ చేసి మళ్లించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. సంబంధిత ఏజెన్సీ ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనలు ఆచరణలో అత్యంత ప్రమాదకరమని, సాంకేతికంగా, ఆర్థికంగా అత్యంత భారమని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని సూచిస్తున్నారు. అయినా సర్కార్ మాత్రం మొండిగానే ముందుకు పోతున్నట్టు తెలుస్తున్నది.
సదరు ఏజెన్సీ చేసిన ప్రతిపాదనలపై ఇరిగేషన్వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతున్నది. ఇది అత్యంత ప్రమాదకరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా నదుల సంగమం తర్వాతే బరాజ్‌లు నిర్మించడం పరిపాటి. అందుకు నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయి. సంగమం తర్వాత నదిలో నీటి ప్రవాహం ఒకేవిధంగా ఉంటుంది. ఆ ప్రవాహ వేగానికి అనుగుణంగా ఏకరీతిలో కాంక్రీట్ నిర్మాణం చేపట్టవచ్చు. కానీ వార్ధా, వైన్గంగాపై వేర్వేరుగా బరాజ్‌లు నిర్మించడం అత్యంత ప్రమాదకరమని, రెండింటికీ వేర్వేరుగా డిజైన్లు రూపొందించాల్సి ఉంటుందని, అదీగాక మధ్యలో 2.1 కిలోమీటర్ల కాంక్రీట్ నిర్మాణంతో వాటిని అనుసంధానించడం అత్యంత క్లిష్టమని నిపుణులు తేల్చి చెప్తున్నారు. వైన్‌గంగ, వార్ధా నీటి ప్రవాహ వేగంలో హెచ్చుతగ్గులు ఉంటాయని, ఫలితంగా అవి కలిసిన చోట సుడిగుండాలు, అత్యంత ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుందని, ఇది బరాజ్‌పై ప్రభావం చూపుతుందని, నిర్మాణం దీర్ఘకాలం కొనసాగడం కష్టమని స్పష్టంచేస్తున్నారు.
నదీ ప్రవాహానికి అనుగుణంగా బరాజ్‌ల ఆపరేషన్ ప్రొటోకాల్‌ను కూడా వేర్వేరుగా అమలు చేయాల్సి ఉంటుందని, అలాంటప్పుడు నీటి నిల్వ కూడా అనుమానమేనని, అదీగాక గేట్లపై ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. మొత్తంగా రెండు వేర్వేరు బరాజ్‌లు నిర్మించి, వాటిని కాంక్రీట్ నిర్మాణంతో కృత్రిమంగా అనుసంధానించి నీటి మళ్లింపు అనే డిజైన్ ఇప్పటికీ ప్రపంచంలోనే ఎక్కడాలేదని వివరిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనలను ఏజెన్సీ సిద్ధం చేయడం, కాంగ్రెస్ సూత్రప్రాయంగా అంగీకరించడంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. గతంలో మహారాష్ట్రతోనూ ఎలాంటి ఒప్పందాలను చేసుకోకుండానే 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్‌ను ప్రతిపాదించి, ఆ మేరకు కాలువలు తవ్విన కాంగ్రెస్ పాలకులు, నేడు సైతం 150 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్ నిర్మాణానికి ఏకపక్షంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ, ముందుకు వె ళ్తుండటంపైనా అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేసింది. అప్పుడు కూడా ఇష్టారీతిన డిజైన్ చేసింది. మహారాష్ట్రతో ఒప్పందాలు లేకుండానే, అంగీకారం తీసుకోకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టు ప్రణాళికలు సిద్ధం చేసింది.
వార్ధా, వైన్‌గంగా నదులు కలిసిన తర్వాత కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తమ్మిడిహట్టి వద్ద 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 152 ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్) బరాజ్ నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం సుమారు 6.5 కిలోమీటర్ల మేర కాంక్రీట్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని, 100-110 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ప్రతిపాదించింది. అందుకు రూ.1,500 కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనాలు వేసింది. బరాజ్ నిర్మాణంతో దాదాపు 2,448 హెక్టార్ల అటవీ భూమితోపాటు, మహారాష్ట్రలోనూ భారీగానే ముంపు ఏర్పడుతుందని తేల్చింది. అయితే ఈ ప్రతిపాదనలను మహారాష్ట్ర నిర్దంద్వంగా వ్యతిరేకించింది. ఒప్పుకొనే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. దీంతో బరాజ్ నిర్మాణం అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రణాళికలు అటకెక్కాయి.
తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభుత్వం తమ్మిడిహట్టి బరాజ్‌పై సుదీర్ఘంగా అధ్యయనం చేసింది. సాంకేతికంగా బరాజ్ నిర్మాణానికి అనుకూలతలు లేవని అధికారులు స్పష్టంచేశారు. నీటి ప్రవాహానికి 90 డిగ్రీల లంబకోణంలో బరాజ్ నిర్మించాల్సి ఉంటుందని, కానీ ప్రతిపాదిత తమ్మిడిహట్టి వద్ద 45 డిగ్రీల స్క్యూ షేప్‌లో బరాజ్‌ను నిర్మించాల్సి వస్తుందని చెప్పారు. అది అంత క్షేమదాయకం కాదని, అదీగాక అలాంటి డిజైన్లు ఎక్కడా అందుబాటులో కూడా లేవని ఇంజినీరింగ్ నిపుణులు వెల్లడించారు. మున్ముందు బరాజ్ నిర్వహణ భారమని అభిప్రాయపడ్డారు. అదీగాక ప్రతిపాదిత తమ్మిడిహట్టి పక్కనే చాప్రాల్ వన్యప్రాణి అభయారణ్యం ఉండటంతోపాటు, దాదాపు 2,448 హెక్టార్ల అటవీ భూమి ముంపునకు గురవుతున్నదని, భవిష్యత్తులో సీడబ్ల్యూసీ అనుమతులు పొందడానికి ఆటంకంగా మారుతుందని హెచ్చరించారు. ముంపుపై మహారాష్ట్ర అభ్యంతరాలను సైతం వివరించారు. అన్నింటికీ మించి నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ సూచనలు, నిపుణుల అభిప్రాయలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. మొదట ముంపు నివారణకు బరాజ్ ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు కుదించారు.
అయితే ఆ ఎఫ్‌ఆర్‌ఎల్‌తో దాదాపు 2,500 కోట్లను వెచ్చించి బరాజ్ నిర్మించినా, గరిష్ఠంగా 44 టీఎంసీలకు మించి మళ్లించలేమని అధికారులు తేల్చిచెప్పారు. ఇది నిర్దేశిత లక్ష్యమైన 160 టీఎంసీల్లో పావు వంతు కూడా కాదు. దీంతో భారీగా ఖర్చు చేసినా ప్రాజెక్టు లక్ష్యాలు నెరవేరబోవని కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ మేధోమథనం తర్వాత ప్రాజెక్టును రీడిజైన్ చేయడమే సమస్యలన్నింటికీ పరిష్కారమని నిర్ణయించింది. మొదట ప్రాణహిత, ప్రధాన గోదావరి కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. రెండోది తమ్మిడిహట్టి సంగమ ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల ఎగువన కేవలం వార్ధాపైనే నిర్మించాలని భావించింది. వీర్దండి గ్రామం వద్ద 155 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో ఎలాంటి ముంపు లేకుండానే 5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో బరాజ్ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అక్కడి నుంచి 7.4 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తవ్వి, దానిని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తవ్విన ప్రధాన కాలువతో 2.5 కిలోమీటర్ వద్ద అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించింది.
మొత్తంగా 20 టీఎంసీల జలాలను తరలించి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని 5 నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతోపాటు, తమ్మిడిహట్టి నుంచి అప్పటికే తవ్విన 75 కిలోమీటర్ల కాలువను సైతం 1.5 టీఎంసీల నిల్వతో వరదకాలువ తరహాలో రిజర్వాయర్లా మార్చేలా ప్రాజెక్టును తీర్చిదిద్దింది. ప్రాజెక్టు పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతిగా మార్చింది. వార్ధాపై బరాజ్ ఒక్కటే కాదు, సాగునీటి సరఫరాకు సంబంధించి కాలువల పనులను సైతం కలుపుకొని మొత్తంగా రూ.4,550 కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది. డీపీఆర్‌ను సైతం సీడబ్ల్యూసీకి సమర్పించింది. పలు అనుమతులను సైతం సాధించింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వార్దా డీపీఆర్‌ను పక్కన పడేసింది. కేంద్రం సైతం డీపీఆర్‌ను వెనక్కిపంపింది.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్లీ ప్రాణహితపై బరాజ్ నిర్మాణానికే మొగ్గు చూపడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో విశ్రాంత సీనియర్ ఇంజినీరు, ఎస్వీ కన్సల్టెన్సీ ఎండీ విఠల్‌రావు సొంతంగా ప్రతిపాదన సిద్ధం చేశారు. తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణం సవాళ్లు, ఆర్థిక భారంతో కూడుకున్నదని తేల్చిచెప్పడంతోపాటు ప్రత్యామ్నాయాలను సూచించారు.
అదేమంటే వార్ధా, వైన్‌గంగ సంగమం తమ్మిడిహట్టికి 9.5 కిలోమీటర్ల దిగువన 138 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో 3.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో, 1.4 కిలోమీటర్ల పొడవుతో బరాజ్ నిర్మించవచ్చని ప్రతిపాదించారు. నిర్దేశిత ప్రాంతంలో బరాజ్ నిర్మాణానికి అనువైన రాతిపొరలు కూడా ఉన్నాయని నిర్ధారించారు. బరాజ్ ఎగువన 1.3 కిలోమీటర్ల వద్ద హెడ్ రెగ్యులేటరీ నిర్మించి, అక్కడి నుంచి రెండు లిఫ్ట్‌ల ద్వారా 10.75 మీటర్ల మేరకు జలాలను ఎత్తిపోసి, 3.4 కిలోమీటర్లు గ్రావిటీ కాలువ ద్వారా మళ్లించి, ప్రాణహిత-చేవెళ్లలో భాగంగా తవ్విన ప్రధాన కాలువతో 8.34 కిలోమీటర్ వద్ద అనుసంధానించవచ్చని వెల్లడించారు. మొత్తంగా ఇక్కడి నుంచి 128 టీఎంసీలు మళ్లించవచ్చని ఎస్వీ కన్సల్టెన్సీ ప్రతిపాదించింది. నిర్మాణ వ్యయం, నిర్వహణ భారం తక్కువేనని అంచనా వేసింది. అదేవిధంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా వార్ధాపై బరాజ్ నిర్మించి అక్కడి నుంచి కూడా 32 టీఎంసీలను గ్రావిటీ ద్వారా మళ్లించుకునే అవకాశమున్నదని సదరు కన్సల్టెన్సీ తెలిపింది. ప్రతిపాదనలపై అధ్యయనం చేయాలని ఆరు నెలల కిందటే ప్రభుత్వ పెద్దలను కలిసి కోరారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆ ప్రతిపాదనలపై ఇప్పటి వరకు దృష్టి సారించలేదు. పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు కూడా లేవు.
కాళేశ్వరం ప్రాజెక్టు, వార్ధా బరాజ్‌ల నిర్మాణం, ప్రతిపాదనలపై మొదటి నుంచీ ఇష్టారీతిన వ్యవహరిస్తున్న కాంగ్రెస్.. ఇప్పుడూ అదే చేస్తున్నది. గతంలో సాంకేతిక కారణాలను అధ్యయనం చేయకుండా, కనీస అవగాహన లేకుండా కేసీఆర్ ప్రతిపాదనలను తప్పుబట్టింది. అడ్డగోలు ఆరోపణలకు దిగింది. తమ్మిడిహట్టి నుంచే గ్రావిటీ ద్వారా 160 టీఎంసీలు మళ్లించవచ్చంటూ ప్రగల్భాలు పలికింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాలుక మడతేసింది. 152 ఎఫ్ఆర్ఎల్ బదులు 150 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్ నిర్మిస్తామంటూ ఊదరగొడుతున్నది. అప్పట్లో 160 టీఎంసీలు తరలించవచ్చని ఢంకా బజాయించిన కాంగ్రెస్ పెద్దలు, ఇప్పుడు 80 టీఎంసీలే తరలిస్తామని, 100 టీఎంసీల జలాలను కాళేశ్వరం ద్వారా వాడుకుంటామని చెప్పడం గమనార్హం. గడిచిన రెండున్నరేండ్లుగా ఆ దిశగా కనీస చర్యలు చేపట్టలేదు. మరోవైపు గతంలో మాదిరిగానే మహారాష్ట్రతో చర్చించకుండానే మళ్లీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. గత నవంబర్లోనే బరాజ్ నిర్మాణం, నీటి మళ్లింపు అలైన్‌మెంట్‌కు సంబంధించి డీపీఆర్ తయారీ బాధ్యతలను ఓ ఏజెన్సీకి అప్పగించారు. తాజాగా సదరు ఏజెన్సీ పలు ప్రతిపాదనలను సిద్ధం చేయగా, అందులో నుంచి బరాజ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. తమ్మిడిహట్టి వద్ద రెండు బరాజ్‌లు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. సాధారణంగా వార్ధా, వైన్‌గంగ నదుల సంగమం తర్వాత కాకుండా, ఎగువనే 150 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద వార్ధాపై ఒకటి, వైన్గంగపై మరొక బరాజ్‌ను వేర్వేరుగా నిర్మించాలని, మధ్యలో 2.1 కిలోమీటర్ల పొడవైన కాంక్రీట్ నిర్మాణంతో రెండు బరాజ్‌లను అనుసంధానించి, కృత్రిమ సంగమాన్ని సృష్టించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం. మొత్తంగా 6.47 కిలోమీటర్ల మేర కాంక్రీట్ నిర్మాణం చేపట్టాల్సి వస్తుంది. బరాజ్‌లు, కాంక్రీట్ నిర్మాణాలకు దాదాపు రూ.7 వేల కోట్లకుపై పైగా ఖర్చవుతుందని అంచనా వేసినట్టు ఇరిగేషన్‌వర్గాలు తెలిపాయి.
ఉమ్మడిరాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వార్ధా, వైన్‌గంగ నదులు కలిసిన తర్వాత తమ్మిడిహట్టి వద్ద 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 152 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్‌ను నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను మహారాష్ట్ర నిర్దంద్వంగా వ్యతిరేకింది. వెరసి బరాజ్ నిర్మాణం అడుగు కూడా ముందుకు పడలేదు.
కేసీఆర్ ప్రభుత్వం తమ్మిడిహెట్టి ప్రతికూలతల దృష్ట్యా ప్రాజెక్టును రీడిజైన్ చేసింది. మొదట ప్రాణహిత-గోదావరి కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. తర్వాత తమ్మిడిహట్టికి 3 కి.మీ ఎగువన వీర్దండి వద్ద వార్ధాపైనే బరాజ్‌ను నిర్మించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ డీపీఆర్‌ను పక్కన పడేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ మొదట్లో ప్రాణహితపై బరాజ్ నిర్మాణానికే మొగ్గు చూపింది. తమ్మిడిహట్టికి 9.5 కిలోమీటర్ల దిగువన బోరేపల్లి వద్ద బరాజ్‌ను నిర్మించేందుకు అన్ని అనుకూలతలు ఉన్నాయని ఎస్వీ కన్సల్టెన్సీ ప్రతిపాదించింది. కానీ ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా దృష్టి సారించలేదు. ప్రతిపాదనలనూ పరిగణనలోకి తీసుకోలేదు.
తమ్మిడిహట్టిపై ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అసాధ్యమని తెలిసి ఇప్పుడు మాటమార్చింది. వార్దా, వైన్‌గంగ నదుల సంగమం తర్వాత కాకుండా, ఎగువనే 150 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద వార్ధాపై ఒకటి, వైన్గంగపై మరొక బరాజ్‌ను నిర్మించి, రెంటినీ భూభాగంతో సహా కలుపాలని నిర్ణయించింది.
FRL + 150(2007-08పాత ప్రతిపాదన )
FRL + 155 వెర్లండి గ్రామం వద్ద సుమారు 3 కి.మీ ఎగువన
FRL + 138 వార్ధా – వెన్‌గంగ సంగమానికి 9 కి.మీ దిగువన
FRL + 150 ప్రస్తుత ప్రతిపాదన
2.1 కి.మీ దూరంలో రెండు నదుల మధ్య కాంక్రీట్ కట్టడంతో అనుసంధానం కృత్రిమ జలాశయ నిర్మాణ ప్రతిపాదన