KCR | ఇవాళ నయకవంచక కాంగ్రెస్ ప్రభుత్వ అన్నిరంగాల్లో ఫెయిల్ అయ్యిందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో రేవంత్ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్. మంచినీళ్లు ఇవ్వడంలో ఫెయిల్. సాగుకు నీరివ్వడంలో ఫెయిల్. కరెంటు సరఫరాలో ఫెయిల్. రైతుబంధు ఇవ్వడంలో ఫెయిల్. విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఫెయిల్. ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్. పల్లెలు, పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్. భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయ్యారు? ఎటుపడితే అటు ఒర్రుడు.. దేవుండ్లపై ఒట్లుపెట్టుడు.. అబద్ధపు వాగ్ధానాలు చేసుడు.. 20-30శాతం కమీషన్లు తీసుకునుడు.. సంచులు నింపుడు.. సంచులు మోసుడు అంతేనా? ఈ మాట కరెక్టేనా? అన్నింట్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందా? అంటే.. ఫెయిల్ అంటూ జనాలు నినదించారు. 20-30శాతం కమీషన్ల మాట నేను అంటలేను. ఎవరు అన్నరు.. స్వయంగా ఆర్థికశాఖ మంత్రి చాంబర్‌కు వెళ్లి 200 మంది కాంట్రాక్టర్లు పోయి లొల్లిపెట్టి.. మమ్మల్ని 20-30శాతం కమీషన్లు అడుగుతున్నరు.. ఇదేం అన్యాయం అని చెప్పి అడిగిన మాటనే నేను చెబుతున్న’నన్నారు.
‘మాజీ సర్పంచులు పని చేశాం బిల్లులు ఇవ్వమంటే వాళ్లను గోసపుచ్చుకుంటున్నరు. వాళ్లేం పాపం చేశారు? ఘోరం ఈ అందానికి ఏం మాట్లాడుతరు.. కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి అంటున్నరు. దేనికి రావాలి మీ ముచ్చట్లు వినడానికా? పిల్లలు అడిగితే మీరు జవాబు చెప్తలేరు. ఉన్నది ఉన్నట్లు నిలబెడితే ఆ ఆర్థికమంత్రి అసెంబ్లీలో నిలబడి.. భుజాలు తడుముకుంటున్నడు. నీకెందుకయ్యా బాధా? నువ్వు తీసుకుంటెనే నీకు బాధ ఉండాలి కదా? లేచి పెద్ద లొల్లి పెడుతున్నడు అసెంబ్లీలో. ఈ విధంగా చాలా గందరగోళంగా, అవివేకంతో, అజ్ఞానంతో అడ్డగోలు మాటలు చెప్పారు. దాంతో మనం కూడ గోల్మాల్ అయిపోయాం. తీర్థం పోదాం తిమ్మక్క అంటే.. వాగు గుళ్లే.. మనం సల్లే.. ఇవాళ ప్రజలను ఆ గతికి తీసుకువచ్చారు. మరి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఆవేశం కాదు. గాడిదలకు గడ్డేసి.. బర్లకు పాలు పిండితే వస్తయా? మరి ఏం చేయాలో ఆలోచించాలి. ఓ తమ్ముడు అన్నడు హైదరాబాద్‌లో ఆయన ఇళ్లు కూలగొడితే.. కేసీఆర్ అన్న యాడున్నవ్ నువ్వు రావాలి.. కత్తి వాడితో చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేయమనవడితివి అంతేనా? దీన్ని కూడా ప్రజలు విచారించాలి. మీకు అర్థం కావాలనే ఇది చెబుతున్న. పోడగొట్టుకున్న కాడనే వెతుక్కోవాలి. మీ వెంట బీఆర్ఎస్ ఉంటది.. కేసీఆర్ ఉంటడు. వందశాతం మళ్లీ తెలంగాణలో విజయం సాధించాలి.. గులాబీ జెండా ఎగురవేయాలి.. అద్భుతమైన తెలంగాణను సాధించాలి’ అని పిలుపునిచ్చారు కేసీఆర్.