ఖైరతాబాద్, మార్చి 22: ‘బడుగు వర్గాలకు కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేసింది. తాజాగా రాష్ట్ర వార్షిక బడ్జెట్లో బీసీల ఆశలను అడియాశలు చేసింది. ఈ అన్యాయంపై ఊరూరా కాంగ్రెస్ నాయకులను బీసీలు నిలదీయాలి’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఎల్ రమణ పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘రాష్ట్ర బడ్జెట్-బీసీల వాటా’ అనే అంశంపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలోనే బీసీలకు సముచిత న్యాయం దక్కిందని గుర్తుచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్.. తొలి బడ్జెట్లో రూ.9 వేల కోట్లు, రెండో విడతలో రూ.11 వేల కోట్లు, తాజాగా రూ.12,500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నదని పేర్కొన్నారు. కానీ, ఈ రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో కేటాయించిన ఆ నిధులు కూడా ఖర్చు పెట్టకుండా కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టిందని విమర్శించారు. అదే బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో బీసీలకు కేటాయించిన బడ్జెట్లో 63 శాతానికి పైగా నిధులు ఖర్చు చేసినట్టు తెలిపారు.
రాష్ట్రంలో ఆదాయాన్ని, సంపదను సృష్టి స్తాం, పేదలకు పంచుతాం.. అని సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని, కానీ ఆ నిధులన్నింటినీ ఇతర మార్గాలకు మళ్లిస్తుండటంతో, వారి పాలనలో బీసీల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలకు ఆర్థిక చేయూతను అందించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ చేసిన మోసంపై బడుగు వర్గాలు గ్రామ గ్రామాన ఆ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రెండున్నరేండ్ల తన పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని, బడ్జెట్ సమావేశాల్లో ఇచ్చిన హామీలపై చర్చించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో విడత బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు (వీహెచ్) అంగీకరించారు. బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ, రాష్ట్రం లో తాము అధికారంలోకి వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని 2023 ఎన్నికలకు ముందు భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నాడు బీసీలకు ఇచ్చిన హామీల వల్లే తమ పార్టీ నేడు అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఈ బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని తాను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు చెప్పానని తెలిపారు.
ఏటా రూ.20 వేల కోట్లు ఇస్తామన్న మాటను అమలు చేయలేకపోయామని తెలిపారు. రాహుల్‌గాంధీ చెప్పినట్టు జనాభా దామాషా పకారం బీసీలకు బడ్జెట్ కేటాయింపు జరుగాల్సిందేనని స్పష్టంచేశారు. ప్రస్తుతం కేటాయించిన ఈ బడ్జెట్ ఏ మాత్రం సరిపోదని తెలిపారు. బడ్జెట్లో కేటాయింపు సక్రమంగా చేసి ఉంటే ఇంత వ్యతిరేకత రాకపోయేదని, దీనిపై తాను ప్రభుత్వాన్ని అడుగుతానని చెప్పారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జీ ఆనంద్‌గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్, బీసీ డెమోక్రటిక్ జేఏసీ చైర్మన్ కోల జనార్దన్, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లేపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.