హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం ఏడాదిన్నరగా ఊదరగొడుతూ.. ఉసూరుమనిపిస్తున్నది. త్వరలోనే జిల్లాలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ పదే పదే చెబుతున్నది. 18నెలలుగా పోస్టులు భర్తీ చేయకుండా కాలం వెల్లదీస్తుండడంతో భర్తీ ప్రక్రియ ప్రహసనంలా మారింది. ఖాళీలను గుర్తించామని, రోస్టర్ ప్రక్రియ పూర్తిచేశామని, అధికారులకు ఆదేశిలిచ్చామని మీడియాకు లీకులు ఇవ్వడం.. రేపు, మాపు అంటూ హడావుడి చేయడం తప్ప, ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. సర్కార్ వైఖరిపై ఈ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ మహిళల్లో అసహనం వ్యక్తమవుతున్నది.
65 ఏండ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందిని ఉద్యోగ విరమణ చేయిస్తున్న ప్రభుత్వం, నియామకాలు చేపట్టకపోవడంతో నెలనెలా ఖాళీలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూరల్, అర్బన్ ఏరియాల్లో సుమారు 35,700 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో నిరుడు జనవరి నాటికి 6,399 టీచర్లు, 7,834 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం మొత్తం 14,236 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. అదే ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని స్వయంగా మంత్రి సీతక్క ప్రకటించారు. కానీ, ఆదిలోనే సాంకేతిక, రోస్టర్ రిజర్వేషన్లలో సమస్యలు ఎదురవుతున్నాయని కొంతకాలం జాప్యం చేశారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సాకుగా చూపారు. కానీ, వర్గీకరణ ప్రక్రియ కొలిక్కివచ్చి సుమారు ఎనిమిది నెలలు దాటినా భర్తీకి చర్యలు తీసుకోకపోవడంపై అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అంగన్వాడీ సెంటర్లలో టీచర్లు, ఆయాల నియామకాలపై ఏడాదిన్నరగా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం మళ్లీ హడావుడి చేస్తున్నది. 2025-26 విద్యాసంవత్సరం చివరినాటికి ఏర్పడ్డ ఖాళీలను గుర్తించామని, రాష్ట్రవ్యాప్తంగా 15,982 పోస్టులను భర్తీచేస్తామని పదిహేను రోజుల క్రితం ప్రకటించింది. 12,882 హెల్పర్లు, 3,100 టీచర్ పోస్టులకు ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభించిందని వెల్లడించింది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీచేస్తామని, కలెక్టర్ల ఆధ్వర్యంలో నియామకాలు చేపడుతామని, ఈ ఏ డాదిలోగా ప్రక్రియ పూర్తిచేస్తామని మహిళా శిశు సంక్షేమశాఖ ప్రకటించింది. రెండు, మూడు నెలల్లో పూర్తిచేయాల్సిన ప్రక్రియను సాగదీయడంపై అంగన్వాడీ టీచర్స్ యూనియన్ల నేతలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
అంగన్వాడీల్లో ఖాళీలను భర్తీచేస్తామని ప్రభుత్వం ఏడాదిన్నర నుంచి ప్రకటనలు గుప్పిస్తూ వస్తున్నది. టీచర్ పోస్టులకు ఇంటర్ పూర్తిచేసిన వారు, ఆయాలకు సెవన్త్/టెన్త్ అర్హతలు నిర్దేశించినట్టు అధికారులు పలుమార్లు ప్రకటించారు. కానీ, కార్యరూపం దాల్చకపోవడంతో సుమారు 10 లక్షల మంది నిరుద్యోగ మహిళలు ఎదురుచూస్తున్నారు.