Aasara Pension| హైదరాబాద్, మార్చి 30 (నమస్తేతెలంగాణ): నేటితో మార్చి నెల ముగుస్తుంది. గత ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ సొమ్మును ఈ నెల మొదటివారంలో ఇచ్చింది. ఈ నెలలో ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ సొమ్మును నెల ముగుస్తున్నా ఇవ్వనేలేదు. ఇది ఈ ఒక్క నెలలోనే కాదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ప్రతి నెలా ఆసరా పింఛన్ సొమ్మును ఒక నెల ఆలస్యంగా ఇస్తూ వస్తున్నది. దీంతో ‘ఆసరా’పైనే ఆధారపడే లక్షలాది మంది పండుటాకులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఎదురుచూపులు తప్పడంలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతినెలా మొదటి తారీఖున పింఛన్ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. 16 నెలలు కావస్తున్నా దానిని అమలు చేయలేకపోతున్నది. దీంతో రాష్ట్రంలోని సుమారు 44 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పింఛన్ సొమ్ము పెంచుడు అటుంచి, నెలనెలా ఇవ్వండి మహాప్రభో.. అటూ వేడుకుంటున్నారు. ఈ విషయమై వివిధ ప్రజాసంఘాల నాయకులు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా చలనం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగినా సర్కారు దిగిరావడమే లేదు. కేసీఆర్ హయాంలో టంఛన్గా కేసీఆర్ పదేండ్ల పాలనలో టంఛన్గా ఆసరా పింఛన్ సొమ్ము లబ్ధిదారుల చేతికి అందేది. ఒకటో తారీకు రాకముందే ఖాతాల్లో జమయ్యేది. దీంతో లబ్ధిదారులు దీమాగా ఉండేది.
మందుబిళ్లల కొనుగోలుతోపాటు చిన్నచిన్న అవసరాలు తీర్చుకొనేది. కానీ కాంగ్రెస్ వచ్చాక లబ్ధిదారులకు మళ్లీ కష్టాలు మొదయ్యాయి. నెలానెలా పింఛన్ నగదుకోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో మళ్లీ కుటుంబ సభ్యులను దేహీ అంటూ దేబరించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమ గోడు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏనాడూ బాధపడలేదని, ప్రతినెలా వేళకు పింఛన్ సొమ్ము అందేదని ఆయనను తలుచుకుంటున్నారు.
అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే రూ.2,016గా ఉన్న ఆసరా పింఛన్ సొమ్మును రూ.4,000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించనేలేదు. కనీసం పెంచకపోగా, 2023 ఆగస్టు, 2024 జనవరి నెలల పింఛన్ సొమ్ము రూ.2వేల కోటను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. వివిధ కారణాలు చూపి సుమారు 3 లక్షల మంది లబ్ధిదారులను తొలగించింది. ఈ విషయమై గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసినా దాటవేసిందే తప్పా, సరైనా సమాధానం ఇవ్వలేదు. కనీసం కొత్తవారినైనా చేర్చాలని డిమాండ్ చేసినా పట్టించుకోవడమే లేదు. 2025-26 బడ్జెట్లోనూ గతంలో మాదిరిగానే నిధులు కేటాయించి పింఛన్లు, లబ్ధిదారుల సంఖ్య పెంపు ఉండబోదని పరోక్షంగా తేల్చిచెప్పింది. పింఛన్ సొమ్ము పెంచకపోవడంపై, బకాయిలు ఇవ్వకపోవడంపై, ప్రతినెలా ఇవ్వకపోవడంపై లబ్ధిదారులంతా ఆగ్రహంతో ఉన్నారు.