హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు మండిపడ్డారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి 12వేలు రెండు విడతలుగా ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని విమర్శించారు.
రాష్ట్రంలో దాదాపు 10లక్షల మందికిపైగా కూలీలు దరఖాస్తు చేసుకొని, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని వాపోయారు. ఉపాధి కూలీలు చాలీచాలని కూలితో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకొనే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని సూచించారు. వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధి కూలీల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఏడాదికి రూ.12 వేల చొప్పున రెండున్నరేండ్లకు రూ.30 వేలు అర్హులైన వ్యవసాయ కార్మికులకు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలతో సంఘటిత పోరాటాలకు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు.