గంగాధర, జూలై 28 : రైతు సంక్షేమం పేరుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేయడం కాదని.. రైతులకు నీళ్లు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. వరద కాలువ ఎడారిలా కనిపిస్తున్నదని, చొప్పదండి నియోజకవర్గంలో రైతులు సాగుచేసిన పంటలు నీళ్లు అందక ఎండిపోతున్నాయని వాపోయారు. ప్రభుత్వం స్పందించి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ రిజర్వాయర్‌కు, వరదకాలువకు నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకుంటే రైతులతో కలిసి మూడు జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సాగునీరివ్వాలని కోరుతూ మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారిపై నాయకులు, కార్యకర్తలు, రైతులు రాస్తారోకో చేశారు.
ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో వరదకాలువ జీవనదిలా ప్రవహించిందని, వేలాది ఎకరాలకు సాగునీరందిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో చుక్కనీరందని పరిస్థితి ఉందని వాపోయారు. సర్కారు క్షేత్రస్థాయిలో రైతులను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రైతులపై ప్రేముంటే కన్నెపల్లి పంపులను ప్రారంభించి, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేరు, వరదకాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వట్టిపోయిన వరదకాలువను నింపాలని, ఎండుతున్న పంటలకు సాగునీరిచ్చి ఆదుకోవాలని కోరారు. రాస్తారోకోలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, నాయకులు కంకణాల విజేందర్‌రెడ్డి, వేముల దామోదర్, రామిడి సురేందర్, శ్రీమల్ల మేఘరాజు, ద్యావ మధుసూదన్‌రెడ్డి, తూము మల్లారెడ్డి, ఎండి అబ్బాస్, పూడూరి మల్లేశం, దోమకొండ మల్లయ్య, తడిగొప్పుల రమేశ్, గడ్డం స్వామి, తదితరులు పాల్గొన్నారు.