వర్ధన్నపేట, మే 2 : ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం అరిగోస పెడుతున్నదని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ధ్వజమెత్తారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని ఫిరంగిగడ్డ, ఇల్లంద వ్యవసాయ మార్కెట్ యార్డులో పేరుకుపోయిన ధాన్యం, మక్కల రాసులను శనివారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. మక్కలు కాంటా వేసి గోదాములకు తరలించాలని, ధాన్యం కొనుగోలు తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇల్లంద వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
అరగంటపాటు జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. నెల రోజులుగా మార్కెట్లో పేరుకుపోయిన మక్కలు, ధాన్యం బస్తాలను అధికారులు తరలించకపోవడంపై మండిపడ్డారు. ఎస్సైలు సాయిబాబు, రాజు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని బలవంతంగా అరూరి రమేశ్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకొని రాస్తారోకోను విరమింపజేశారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ.. మక్కల కొనుగోలు కేంద్రాల్లో సుమారు 50వేల బస్తాల వరకు పేరుకుపోయినా ఇంతవరకు తరలించడం లేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లను ఇంతవరకు ప్రారభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లంద మార్కెట్లో నెలరోజులు గడుస్తున్నా మక్కలకు కాంటా వేయకపోవడంతో రైతులు పడిగాపులుకాస్తున్నారని తెలిపారు.