Paddy Procurement | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): పంటలకు సాగునీరు ఇవ్వడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేతికొచ్చిన ధాన్యం కొనుగోలులోనూ నిర్లక్ష్యం వహిస్తున్నది. పలు జిల్లాల్లో వరి కోతలు మొదలై ధాన్యం వస్తుంటే ప్రభుత్వం మాత్రం సమీక్షలతో కాలయాపనచేస్తున్నది తప్పితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న సోయి లేకుండా వ్యవహరిస్తున్నది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో వరి కోతలు మొదలవడంతో ఆయా జిల్లాల రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
మిల్లర్లకు వరంగా ప్రభుత్వ నిర్లక్ష్యం
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం రైస్ మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులకు వరంగా మారింది. ఈ ఏడాది ధాన్యానికి మద్దతు ధర క్వింటాలుకు గ్రేడ్ ‘ఏ’ రకానికి రూ. 2,203, సాధారణ రకానికి రూ. 2,183గా కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతులకు మద్దతు ధర కూడా దక్కని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని మిల్లర్లు లేదా ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న మిల్లర్లు, వ్యాపారులు తక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది. సాధారణంగా నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో సన్నధాన్యం ఎక్కువగా సాగవుతుంది. ఈ ధాన్యానికి ప్రతిసారి క్వింటాలుకు కనీసం రూ. 2,500 నుంచి రూ. 2,700 వరకు ధర పలుకుతుంది. ఈసారి మాత్రం ఇందుకు భిన్నంగా రైస్ మిల్లర్లు, వ్యాపారులు సన్నధాన్యం క్వింటాలుకు రూ. 2,200 నుంచి రూ. 2,300లకే కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం మిల్లర్లంతా సిండికేట్గా ఏర్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీజన్ మొదట్లో వచ్చే దొడ్డు ధాన్యానికి కూడా కనీసం రూ. 2,300 వరకు ధర పలుకుతుంది. కానీ ఈసారి దొడ్డు ధాన్యాన్ని రూ. 1950 నుంచి రూ. 2100 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు మద్దతు ధర కన్నా రూ. 200 నుంచి రూ. 300 వరకు నష్టపోవాల్సి వస్తున్నది.
నీటి మూటలుగా హామీలు
రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయి. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు అదనంగా రూ. 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి రాగానే వాటిని అటకెక్కించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బోనస్, కొనుగోలు కేంద్రాల హామీని ప్రభుత్వం విస్మరించిందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కండ్లముందే మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏర్పాట్లు ఇంకెప్పుడు?
ఐదు రోజుల క్రితం పౌరసరఫరాలశాఖ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించగా, మంగళవారం సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లపై సీఎస్ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఓవైపు కోతలు ప్రారంభమైనప్పటికీ ఇంకా ఏర్పాట్లు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించినట్లు సమాచారం. యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసి ఏప్రిల్ 1 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించినట్టు తెలిసింది.
సాగు లెక్కల్లో తేడాలు
ధాన్యం కొనుగోలు ఏర్పాట్లలో భాగంగా ఈ యాసంగిలో వరిసాగు ఎంత? దిగుబడి ఎంత? ఎంత కొనుగోలు చేయాల్సి వస్తుంది? తదితర అంశాలపై పౌరసరఫరాల సంస్థ ఒక నివేదికను తయారు చేసింది. ఇందులో వరిసాగు విస్తీర్ణంలో వ్యవసాయశాఖ నివేదికకు, పౌరసరఫరాలశాఖ నివేదికకు తేడాలున్నాయి. ఈ యాసంగిలో 66.06 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్టు పౌరసరఫరాలశాఖ పేర్కొనగా, వ్యవసాయశాఖ వారంతాపు నివేదిక ప్రకారం ఇది 50.69 లక్షల ఎకరాలే. దీంతో ఎవరి లెక్కల్లో ఎంత నిజముందో తెలియక అధికారులు అయోమయంలో పడిపోయారు.