మెదక్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : రైతులకు ఎరువులు ఇవ్వని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని, రైతులపై చిత్తశుద్ధిలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేటలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు కలసి గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద నిరసన వ్యక్తంచేశారు. దీంతో పోలీసు పహారాలో రైతులకు కొద్దిపాటి యూరియాను అందజేశారు.
అనంతరం రామాయంపేటలో బైక్ ర్యాలీ చేపట్టారు. రెండు రోజుల్లో రైతులకు యూరియా అందకుంటే జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని పద్మాదేవేందర్రెడ్డి హెచ్చరించారు. యూరియా కోసం రైతులు పోలీసులు, వ్యవసాయాధికారుల కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తే, రేవంత్ దండుగ చేశారని మండిపడ్డారు. మార్పు తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎరువుల కొరతతో అన్నం పెట్టే రైతులను రోడ్డుమీదికి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో గ్రామ గ్రామాన ఎరువులు, విత్తనాలు అందించామని గుర్తుచేశారు.