Kaleshwaram | హైదరాబాద్/సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 27 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో ఒక పిల్లర్ కుంగుబాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఎస్ఏ భుజంపై తుపాకీ పెట్టి నాటకమాడుతున్నాయనేది మరోసారి బహిర్గతమైంది. పోలవరంలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా పనులను పునరుద్ధరించారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పిల్లర్ కుంగుబాటును బూచిగా పెట్టి, జలాల ఎత్తిపోతలనే అటకెక్కించింది. ఇదేమని అడిగిన ప్రతిసారీ ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నివేదికనే తమకు ప్రామాణికమంటూ ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ముందే వెలువడిన తుది నివేదికతో ప్రభుత్వ పెద్దలు కొంత హడావుడి చేశారు. తాజాగా అసలు ఆ నివేకదనే తప్పంటూ ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు ఈ నెల 24న ప్రభుత్వానికి లేఖ రాసింది. రాయడం చర్చనీయాంశమైంది.
పొంతనలేని నివేదిక అంశాలు
మేడిగడ్డ బరాజ్‌పై ఎన్డీఎస్ఏ సమర్పించిన నివేదికలో అనేక అంశాలు పొంతన లేకుండా ఉన్నాయని, పరీక్షలు నిర్వహించకుండానే రిపోర్టు ఎలా ఇస్తారని ఎల్అండ్టీ, ఇతర ఏజెన్సీలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. నిర్మాణం, నాణ్యత, ప్రాజెక్టుకు సంబంధించి ముందస్తు పరీక్షల నిర్వహణలో తాము ఎక్కడా రాజీ పడలేదని తేల్చి చెప్పాయి. అన్ని అంశాలను మరోసారి పరిశీలించి ఎన్డీఎస్ఏ నివేదికను సవరించాలని, తదుపరి చర్యలకు తగిన సిఫారసులు చేసేలా చూడాలని ఇరిగేషన్ శాఖను కోరాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై ఎన్డీఎస్ఏ రూపొందించిన తుది నివేదిక తమకు అందిందని, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించామని వెల్లడించింది. అందులోని పలు అంశాల్లో ఎక్కడా పొంతన లేదని స్పష్టంచేసింది. ఫౌండేషన్ భూమిని అంచనా వేయలేకపోయారని, గ్రౌటింగ్ వల్ల బరాజ్ నిర్మాణాల పరిస్థితులు, స్థితిని సమర్థవంతంగా మార్చారని, తద్వారా రాఫ్ట్ కింద, సికెంట్ పైల్ కటాఫ్‌ల వెంట కీలకమైన సబ్-సర్ఫేస్ జియోటెక్నికల్ పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి కల్పించారని నివేదికలో పేర్కొనడాన్ని ఖండించింది.
తాము క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రాం నిర్వహించామని, మేడిగడ్డ బరాజ్ నిర్వహణ పత్రాలను నిర్మాణ సంస్థ సమర్పించిందని, అది ప్రాజెక్ట్ నిర్వహణ బృందాలు ప్రాజెక్ట్ అమలు, నాణ్యతా ప్రమాణాలను పాటించేందుకు, నాణ్యత ప్రణాళిక, నాణ్యత నియంత్రణ, నాణ్యత హామీ విధానాలను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుందని తెలిపింది. నాణ్యత నియంత్రణ లేదనే వాదనలను తోసిపుచ్చింది. ఎన్డీఎస్ఏ ప్రశ్నలకు సవివరమైన సమాధానాలను మరోసారి లేఖలో ప్రస్తావించింది. నాణ్యత నియంత్రణ మాన్యువల్‌ను ఇరిగేషన్‌శాఖకు సమర్పించామని, సికెంట్ పైల్ మెథడ్ స్టేట్మెంట్ను క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా రూపొందించామని, నిర్మాణ సమయంలో ఇరిగేషన్‌శాఖకు అది ఇవ్వడమేగాక, దానినే అనుసరించామని తెలిపింది. ఇరిగేషన్ శాఖ జారీ చేసిన కస్టమర్ సంతృప్తి నివేదికలు, థర్డ్ పార్టీ ద్వారా పరీక్షలు, ప్రయోగశాలల ద్వారా డిజైన్ మిక్స్, ఏజెన్సీ అంతర్గత ఆడిట్ ఫలితాలు, 7 రోజులు, 28 రోజులకు క్యూబ్ పరీక్ష ఫలితాలు అన్నీ సవ్యంగానే ఉన్నాయని వివరించారు. ఇవన్నీ ఎన్డీఎస్ఏ నివేదికలో వెల్లడించిన నాణ్యతపై నియంత్రణ లేదనే సొంత పరిశీలనను ఈ వాదనలు తోసిపుచ్చుతున్నాయని పేర్కొన్నది. తాము వెల్లడించిన అంశాలను మరోసారి పరిశీలించి ఎన్డీఎస్ఏ నివేదికను సవరించి ఇచ్చేలా చూడాలని ఎల్అండ్టీ కోరింది.
పునరుద్ధరించే అవకాశం ఉన్నా.. ససేమిరా
సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రమాదాలు సహజం. కానీ రాజకీయ బలిపీఠంపైకి వాటిని తెచ్చినపుడే ప్రజా ప్రయోజనం మంటగలిసిపోతుంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకంగా రూపుదిద్దుకున్న కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు కూడా ఇలాగే తయారైంది. తొలుత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆపై రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రాజకీయంగా మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటును వాడుకోవడంతో ప్రాణహిత జలాల వినియోగం అటకెక్కింది. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి ఎన్డీఎస్ఏ ఇంజినీర్లు ఇక్కడికి వచ్చారు. కనీసం బరాజ్‌ను పరిశీలించకుండానే ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయం కావడంతో బీజేపీ ప్రభుత్వమే ఇదంతా చేస్తున్నదని అప్పట్లో బహిరంగంగానే ఆరోపణలు వచ్చాయి.
దానిని పునరుద్ధరించే అవకాశం ఉన్నా రేవంత్ సర్కారు ససేమిరా అంటూ వస్తున్నది. ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చే వరకు దాని జోలికి వెళ్లేది లేదంటూ సీఎం, మంత్రి కూడా ప్రకటించారు. ప్రాథమిక నివేదికను గంటల వ్యవధిలోనే ఇచ్చిన ఎన్డీఎస్ఏ తుది నివేదిక మాత్రం ఏడాన్నర అయినా ఇవ్వడం లేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అంశాన్ని డైవర్ట్ చేయాలనే అక్కసుతో ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చిందనేది జగమెరిగిన సత్యం! ఆ నివేదికనే తమకు పరమావధి అన్న ప్రభుత్వం కొన్నిరోజుల పాటు బీఆర్ఎస్పై ఆరోపణలు చేసేందుకు వినియోగించింది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రభుత్వానికి లేఖ రాయడం సంచలనం రేకెత్తించింది. ఎన్డీఎస్ఏ నివేదిక డొల్లతనాన్ని బట్టబయలు చేసింది.