హైదరాబాద్, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ సర్కారు ద్వంద్వవైఖరి అవలంబిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు 2024లో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కులగణన లెక్కల ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం పాత రిజర్వేషన్లు అమలు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీల మాదిరిగానే ఎస్సీ, ఎస్టీలకు సైతం 2024 కులగణన లెక్కలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నది. కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కులగణనలో బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీల జనాభాను సైతం లెక్కించింది.
అలాంటప్పుడు బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీలకూ కొత్త లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2024 కులగణన లెక్కల ప్రకారం రాష్ట్రంలో బీసీలు (ముస్లింలు కాకుండా) 46.25 శాతం ఉండగా, ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం ఉన్నట్టు తేలింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ జనాభా 15.45 శాతం, ఎస్టీ జనాభా 9.08 శాతంగా ఉన్నది. అంటే 2011తో పోల్చితే 2024లో ఎస్సీ జనాభా 2 శాతం పెరగగా, ఎస్టీ జనాభా 1.37 శాతం పెరిగింది. అంటే బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ జనాభా సైతం పెరిగిందని సర్కారు కులగణనలోనే తేలింది. అలాంటప్పుడు బీసీల మాదిరిగానే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదనేది ప్రశ్న. బీసీ రిజర్వేషన్ల పెంపునకు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు రెండింటికీ రాజ్యాంగ పరమైన అడ్డంకులు ఉన్నాయి. అయినా బీసీల రిజర్వేషన్ల పెంపునకు ముందుకెళ్తున్న కాంగ్రెస్ సర్కారు.. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపును మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.