హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులను కాంగ్రెస్ సర్కార్ మరోసారి దగా చేసింది. ఉద్యోగులకు అనుకూలంగా వచ్చిన హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఇచ్చిన మాటనూ తప్పేందుకు దారులు వెతుక్కుంటున్నది. 2004 సెప్టెంబర్‌కు ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ అమలుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తొలుత
హామీ ఇచ్చింది. తాత్సారంపై ఉద్యోగులు కోర్టుకెళ్తే పాత పింఛన్‌ను అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత జేఏసీ నేతలతో జరిగిన భేటీలో ప్రభుత్వ పెద్దలు పాత పింఛన్ అమలుపై స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సర్కార్ రిట్ దాఖలు చేసింది. డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో చర్చలు జరిపిన రోజే సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేయడం గమనార్హం. ఈ ఒక్క చర్యతో ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై సర్కార్‌కు ఎంత శ్రద్ధ ఉన్నదో, ఉద్యోగులంటే ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతున్నదని ఉద్యోగ సంఘాల నేతలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. సర్కార్ తీరుతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ‘నోటితో ఒకటి చెప్పి…నొసటితో వెక్కించినట్టు’ సర్కార్ తీరు ఉన్నదని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు మండిపడుతున్నారు.
2025లోనే హైకోర్టు తీర్పు
రాష్ట్రంలో 2004 సెప్టెంబర్‌కు ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ సదుపాయాన్ని అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు 2025 జూలైలో చరిత్రాత్మక తీర్పునిచ్చింది. డీఎస్సీ 2003 టీచర్లతోపాటు ట్రాన్స్‌కో, జెన్కో, వివిధ డిస్కంలలో పనిచేసే ఉద్యోగులకు పాత పింఛన్ అమలవుతుందని అంతా భావించారు. అయినా సర్కార్ తీవ్ర జాప్యం చేసింది. దీనిపై మళ్లీ ఉద్యోగులు కోర్టుకెళ్లారు. మూడు నెలల్లో తీర్పును అమలు చేయాలని కోర్టు స్పష్టంచేసింది. హైకోర్టు తీర్పుపై ఈ నెల 2న సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు రాష్ట్రంలో పాత పింఛన్‌ను అమలుచేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం పాత పింఛన్ వర్తింపజేయకుండా నిరాకరిస్తున్నారు. దీనిపై సివిల్ సర్వెంట్లకో రూల్! రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుకో రూలా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ కపట మోసాన్ని తాము గ్రహించలేకపోయామని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ నమ్మకద్రోహమని, విశ్వాస ఘాతుకమని సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.
సర్కార్ వెన్నుపోటు
దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల జేఏసీలు పోరుబాటకు గత నెలలోనే పిలుపునిచ్చాయి. ఈ నెల 5న సామూహిక నిరాహార దీక్షలు తలపెట్టగా.. జడుసుకున్న సర్కార్ ఈ నెల 2న ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో చర్చలు జరిపింది. ఈ భేటీలో సీపీఎస్ రద్దుతోపాటు, 2004 సెప్టెంబర్‌కు ముందు నియమితులైన వారికి పాత పింఛన్ వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పట్టుబట్టారు. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగులకు అనేక అంశాలపై హామీలిచ్చారు. సీపీఎస్ అంశాన్ని డిప్యూటీ సీఎం పరిశీలిస్తారని, 2004 సెప్టెంబర్‌కు ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన వారికి పాత పింఛన్ వర్తింపజేస్తామని జేఏసీ నేతలకు హామీనిచ్చారు. సీఎం హామీలపై హర్షం కూడా వ్యక్తంచేశారు. దీంతో హైకోర్టు తీర్పును సర్కార్ అమలు చేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు భావించారు. ఆ హామీనిచ్చిన రోజే కాంగ్రెస్ సర్కార్ 2004 సెప్టెంబర్‌కు ముందు నియమితులైన వారికి పాత పింఛన్ అమలు చేయాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సర్కార్ అత్యంత గోప్యంగా ఉంచిన ఈ విషయం లీక్ కావడంతో ఉద్యోగులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ మోసాన్ని ఎండగడుతున్నారు. మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ చర్య అనైతికం: టీఎస్‌యూటీఎఫ్
ముఖ్యమంత్రి హామీ మేరకు డీఎస్సీ-2003 టీచర్లకు పాత పింఛన్ అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. కేంద్రం జారీచేసిన మెమో-57ను అమలు చేస్తామని హామీ ఇచ్చిన సర్కార్.. అందుకు భిన్నంగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చి, సుప్రీంకోర్టులో కేసు వేయడం అనైతికమని విమర్శించింది.
ఇది కుట్రపూరిత నిర్లక్ష్యం: టీఎస్టీయూ
హైకోర్టు తీర్పును అమలు చేయాల్సింది పోయి.. సుప్రీంకోర్టును ఆశ్రయించడం అత్యంత దారుణమని టీఎస్టీయూ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సహజ న్యాయసూత్రాలకు నిదర్శనమని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ అబ్దుల్లా, చందూరి రాజిరెడ్డి విమర్శించారు. తక్షణమే డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పింఛన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
రిట్ ఉపసంహరించుకోవాలి
ప్రభుత్వం తక్షణమే స్పందించి సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ను ఉపసంహరించుకోవాలి. లేదంటే పాత పింఛన్ సాధన పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. పాత పింఛన్ సాధన కోసం టీచర్లు, ఉద్యోగ సంఘాల జేఏసీలతో ఇటీవలే సర్కార్ చర్చలు జరిపింది. ఆ చర్చల్లో 2003 డీఎస్సీ టీచర్లు సహా, 2004కు ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన వారికి పాత పింఛన్ వర్తింపజేందుకు ప్రయత్నిస్తామని సర్కార్ హామీనిచ్చింది. మరోవైపు ఎస్ఎల్పీ దాఖలు చేయడం విచారకరం.
– వొడ్నాల రాజశేఖర్, తెల్కపల్లి పెంటయ్య, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
ఉద్యమం తప్పదు
హైకోర్టు తీర్పును అమలుచేయకుంటే మరో ఉద్యమం తప్పదు. పాత పింఛన్ అమలుకోసం ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే హామీ ఇవ్వడంతో అమలవుతుందని మేమంతా భావించాం. కానీ చర్చలు జరిపిన రోజే సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేయడం అత్యంత దారుణం. నమ్మిన మమ్మల్ని సర్కార్ వంచించింది. మా విశ్వాసాన్ని వమ్ముచేసింది. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలి.
– కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు