హైదరాబాద్, జూన్ 20 (నమస్తేతెలంగాణ): ‘ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అన్ని స్కీంల తరహాలో సన్న వడ్లకు బోనస్ పథకం బోగస్ అయ్యింది..సన్నాయి నొక్కులు తప్పా రైతులకు నయాపైసా చెల్లించలేదు..’అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. యాసంగిలో 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్న వడ్లు సేకరించిన సర్కారు బోనస్ ఇవ్వడంలో విఫలమైందని శుక్రవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ధాన్యం పండించిన అన్నదాతల పరిస్థితి దయనీయంగా ఉంటే పొద్దుతిరుగుడు రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కొని 75 రోజులు దాటినా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయకపోవడం రేవంత్ సర్కారు నిర్లక్ష్య వైఖరికి అద్ధం పడుతున్నదని ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లాలో 50 శాతం మంది రైతులకు నగదు ఇవ్వలేదని, ఇక రాష్ట్రంలోని రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చన్నారు.
పంట కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు వేస్తామని ప్రగల్భాలు పలికిన వ్యవసాయ శాఖ మంత్రి..రెండు నెలలు దాటినా ఎందుకు స్పందిచడంలేదని నిలదీశారు. రేవంత్ సర్కారు చేతగానితనంతో రైతులు రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధాల పునాదులపైనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని నిప్పులు చెరిగారు. సగం మందికే రుణమాఫీ చేసి, నిరుడు వానకాలంలో రైతుబంధు ఎగ్గొట్టి, ఈ యేడు యాసంగిలో సగమందికే అందించి దగా చేసిందని ధ్వజమెత్తారు. ‘నాడు ఓట్ల కోసం ఎకరాకు రూ. 15 వేలు రైతుభరోసా వేస్తామని చెప్పి రూ. 12 వేలకు కుదించారు..కూలీలకు కూడా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు..’అని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రశ్నిస్తేగాని కొనుగోలు కేంద్రాలను కూడా తెరవని అసమర్థ ప్రభుత్వం, సన్నాలు పండించిన రైతాంగానికి ఎగనామం పెట్టిందని నిప్పులు చెరిగారు. వెంటనే బోనస్, సన్‌ప్లవర్ రైతులకు నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు.