Samsthan Narayanpur | యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ)/సంస్థాన్ నారాయణపురం: గిరిజన భూములపై కాంగ్రెస్ సర్కార్ కన్ను పడింది. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న లంబాడీల భూములను పోలీస్ బెటాలియన్ పేరుతో స్వాధీనం చేసుకొనేందుకు స్కెచ్ వేసింది. కనీసం రైతులకు కూడా సమాచారం ఇవ్వకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. దీంతో గిరిజనులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని సర్వే నంబర్ 255లో 144 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో ఇప్పటికే 11 ఎకరాలు సింగిల్ విండో గోదాం నిర్మాణం, సబ్ మార్కెట్ యార్డు కోసం కేటాయించారు. రెండున్నర ఎకరాల్లో గాంధీనగర్ తండాకు చెందిన గిరిజనులు ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు.
1970 నుంచి 2001 వరకు ఆయా ప్రభుత్వాలు అసైన్మెంట్ కమిటీ ద్వారా 130 నిరుపేద, గిరిజనులకు లావణి పట్టాలు పంపిణీ చేశారు. నాడు పూర్తిగా రాళ్లూరప్పలతో నిండిన ఎర్రమట్టి గుట్టను పేదలు చెమటోడ్చి, ఏండ్ల తరబడి చదును చేసి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వ్యవసాయ యోగ్యంగా మార్చుకున్నారు. అందులో ఉలువలు, కందులు, పెసర్లు సాగు చేస్తున్నారు.
కొందరు పశువులు, గొర్రెలు, మేకలు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక తర్వాత వీరిలో 56 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పట్టాలు కూడా అందించింది. మిగతా వారికి కొత్త పాస్‌బుక్‌లు ప్రాసెస్‌లో ఉన్నాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగుకు యోగ్యంకాని భూములు అంటూ 84.25 ఎకరాలను కొత్తగా ఏర్పాటు చేయనున్న పోలీస్ బెటాలియన్‌కు కేటాయించినట్టు తెలుస్తున్నది. హైదరాబాద్‌కు దగ్గరలో ఉండటంతో అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలో పోలీస్ పోస్టుల భర్తీ ఉంటుందని, వారిని బెటాలియన్‌లో సర్దుబాటు చేస్తారనే ప్రచారం జరుగుతున్నది.
సాధారణంగా ప్రభుత్వానికి భూములు అవసరమైతే భూసేకరణకు నిబంధనల ప్రకారం ముందుకెళ్తారు. ముందస్తుగా సదరు రైతులకు నోటీసులు జారీ చేస్తారు. భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రైతులతో సమావేశాలు, చర్చలు జరుపుతారు. పరిహారం, ఇతర అంశాలను వివరిస్తారు. కానీ, సంస్థాన్ నారాయణపురంలో మాత్రం ఏదీ సరిగ్గా నడుస్తున్నట్టు కనిపించడంలేదు. ఏదీ అడిగినా తమకేం తెలియదని అధికారులు చెప్తున్నారు. గతంలోనూ పాస్‌బుక్ ఉండగా, 56 మందికి కొత్త పాస్‌బుక్‌లు వచ్చాయి. మరికొంత మందికి రావాల్సి ఉన్నది. ఒకవేళ ప్రభుత్వ అవసరాల కోసం భూములు తీసుకోవాల్సి వచ్చినా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
వీటిపై అసలు స్పష్టతే లేదు. పోలీసులు అధికారులు మాత్రం సంస్థాన్ నారాయణపురంలోనే బెటాలియన్ అని ప్రకటించారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గిరిజనులు పోరుబాటకు సన్నద్ధమవుతున్నారు. భూములు పోతే జీవనాధారం కష్టమవుతుందని, బతికేదెలా అని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ బెటాలియన్‌కు భూములు అవసరమైతే రాచకొండ ప్రాంతంలోని ఖాళీ భూములు ఇచ్చుకోవాలని, తమ భూముల్లో బెటాలియన్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రాళ్లూరప్పలుగా ఉన్న భూమిని చదు ను చేసుకొని తరతరాలుగా సాగు చేసుకుంటున్నాం. గిరిజన తండా ప్రజల భూము లు లాక్కొని పోలీస్ బెటాలియన్‌కు కేటాయించడం తీవ్ర అన్యాయం. ప్రాణాలు పోయినా సరే పోలీస్ బెటాలియన్ కోసం సెంట్ భూమి కూడా వదులుకోం.
– మెగావత్ నరసింహ, బాధితుడు
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో 255 సర్వే నంబర్లోని భూముల పట్టాలు అందించి రైతులందరికీ న్యాయం చేస్తామని గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఎన్నికలు ముగిశాక పోలీస్ బెటాలియన్‌కు కేటాయిస్తున్నామనడం ఎంతవరకు సమంజసమో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమాధానం చెప్పాలి.
– చిలువేరు అంజయ్య, సంస్థాన్ నారాయణపురం