New Ration Cards | రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రజాపాలన, గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించగా.. ఈసారి ఆన్లైన్లో మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ మేరకు కొత్త కార్డుల కోసం, పాత కార్డుల్లో మార్పుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మీ సేవ కమిషనర్‌కు పౌర సరఫరాల శాఖ కమిషనర్ శుక్రవారం లేఖ రాశారు. ఇదే విషయాన్ని వెల్లడించారు. అయితే మీ సేవలో ఎప్పట్నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారనే విషయాన్ని మాత్రం చెప్పకపోవడం గమనార్హం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించింది. కానీ దాన్ని పక్కనబెట్టి కులగణన సర్వే ఆధారంగానే రేషన్ కార్డులు ఇస్తున్నామని లబ్ధిదారుల జాబితాను ప్రకటించింది. దీనిపై ప్రజల నుంచి ఆగ్రహం రావడంతో గ్రామసభలు ఏర్పాటు చేసి మళ్లీ దరఖాస్తులను స్వీకరించింది. ఇలా దాదాపు 18 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ దరఖాస్తులు ఇలా పెండింగ్‌లో ఉండగానే.. మరోసారి ఆన్లైన్లో మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై జనాలు మండిపడుతున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పాలన దరఖాస్తుల పాలనగా మారిందని విమర్శిస్తున్నారు.