ఇల్లెందు, డిసెంబర్ 19 : భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా ఇల్లెందు మండలం ఇందిరానగర్ పంచాయతీ పరిధి 8వ వార్డు సభ్యుడి గెలుపు కోసం కృషిచేసిన బీఆర్ఎస్ నాయకు డు నీలం రాజశేఖర్‌పై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ గూండాలు గురువారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణు లు ఇల్లెందులో శుక్రవారం నిరసన తెలిపారు. జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ర్యాలీ తీసి, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు శీలం రమేశ్, ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ.. నీలం రాజశేఖర్‌పై కాంగ్రెస్ గూండాలు విచక్షణా రహితంగా దాడి చేయడమే కాకుండా మారణాయుధాలతో హత్యచేసేందుకు యత్నించారని, అడ్డొచ్చిన మహిళలను ఇష్టారీతిన కొడుతూ ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.