నల్లగొండ ప్రతినిధి, జనవరి 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేతలు మరోసారి రెచ్చిపోయారు. భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను మరువకముందే మరోసారి ఆ పార్టీ నేతలు గూండాగిరీకి దిగారు. నల్లగొండ మున్సిపల్ కార్యాలయం వేదికగా కాంగ్రెస్ నేతలు వీరంగం సృష్టించారు. పక్కా పథకం ప్రకారం.. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. నల్లగొండ పట్టణంలో మంగళవారం జరగాల్సిన కేటీఆర్ రైతు మహాధర్నా సందర్భంగా కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మంత్రి కోమటిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ విషయమై ప్రశ్నించేందుకు మున్సిపల్ కార్యాలయానికి కంచర్ల, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి వెళ్లగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కాంగ్రెస్‌కు చెందిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు విధ్వంసకాండకు దిగాయి. చేతికి అందిన పూలకుండీలు, కుర్చీలు విసురుతూ బీఆర్ఎస్ నేతలపైకి దూసుకెళ్లి భయభ్రాంతులకు గురిచేశారు. ఓ వైపు కాంగ్రెస్ శ్రేణుల దాడి, మరోవైపు పోలీసుల అరెస్టు ప్రయత్నాలతో కంచర్ల సొమ్మసిల్లి పడిపోయారు. ఈ గందరగోళం మధ్యనే భూపాల్‌రెడ్డిని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా అరెస్టు చేసి తరలించారు. ప్రశాంతంగా కొనసాగుతున్న నిరసనను రణరంగంగా మార్చిన కాంగ్రెస్ నేతల్లో ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదు. బీఆర్ఎస్ నేతలను తరలించిన నాంపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించగా జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి భూపాల్‌రెడ్డిని పరామర్శించారు.
కాంగ్రెస్ గూండాల దాడిని, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. భూపాల్‌రెడ్డి ఇంటికి రాత్రి చేరుకున్న జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, పార్టీ రాష్ట్ర నేతలు కంచర్ల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్ పరామర్శించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో పాటు ఇతర నేతలపై జరిగిన దాడి గురించి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా తీశారు. దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో కాంగ్రెస్ గూండాయిజాన్ని ఎండగడదామని, త్వరలో నల్లగొండలో బ్రహ్మాండంగా రైతు ధర్నా నిర్వహిద్దామని భూపాల్‌రెడ్డికి కేటీఆర్ ఈ సందర్భంగా సూచించిన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తనపై దాడికి ప్రేరేపించిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని భూపాల్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
మరో ముగ్గురిపై కేసు
నీలగిరి, జనవరి 21: నల్లగొండ మున్సిపాలిటీలో జరిగిన దాడి ఘటనలో కంచర్ల భూపాల్‌రెడ్డి, సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్తోపాటు నాయకుడు మెరుగు గోపీనాథ్‌పై బీఎన్ఎస్ సెక్షన్ 170 ప్రకారం కేసులు నమోదు చేశారు.