హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ద్రోహుల చేతుల్లో పెట్టొద్దని మంత్రి హరీశ్‌రావు కోరారు. ఫేక్‌గాళ్ల మాటలు నమ్మి రిస్క్‌లో పడొద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వద్దనుకొని కాంగ్రెస్‌కు ఓటేసి రిస్క్ తీసుకుందామా? ఎకరానికి ఏడాదికి రూ. 10 వేలు ఇస్తున్న ప్రభుత్వాన్ని వద్దనుకుని కాంగ్రెస్‌కు ఓటేసి రిస్క్ తీసుకుందామా? అని ప్రజలను ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేత నగేశ్ ముదిరాజ్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ పదేండ్లలో హైదరాబాద్‌లో కర్ఫ్యూ అనేదే లేకుండా ప్రజలు సుఖంగా, సంతోషంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే వారు కుర్చీల కోసం మతకల్లోలాలు సృష్టిస్తే మనకు రిస్క్ కదా అని పేర్కొన్నారు. వాళ్లకు ఓటేసి మనమెందుకు రిస్క్‌లో పడాలని ప్రశ్నించారు. కండ్లతో చూసింది.. చెవులతో విన్నది నమ్మాలని సూచించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, ఇతర పార్టీలు కలిసి పోటీచేస్తే ఈసారి పొత్తులేకుండా పరోక్షంగా కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్, ఉత్తమ్‌కుమార్ మాట మీద నిలబడే వ్యక్తులు కాదని, ఏం చూసి వారికి ఓటెయ్యాలని ప్రశ్నించారు. పదేండ్ల ముందు, ఇప్పుడు తెలంగాణ ఎట్లుందనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
అప్పట్లో ‘తలాపున పారుతుంది గోదారి.. నీ చేను చెలక ఎడారి’ అని, ‘పల్లెపల్లెన పల్లేర్లు మొలిచే’ అంటూ పాటలు రాసి తెలంగాణ కరువును కవులు కండ్లకు కట్టారని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని చూసి ఇప్పుడు ‘పల్లెపల్లెన పసిడి పంటలు పండె’ అని పాటలు మార్చి రాయాల్సి వస్తున్నదని తెలిపారు.
గతంలో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అని రాశారని.. నేడు ప్రతి నియోజకవర్గంలో 100 పడకల దవాఖాన, ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ వచ్చాయని పేర్కొన్నారు. వలసలు తగ్గాయని, ఇపుడు ఇతర రాష్ర్టాల వారే ఇక్కడికి వలస వస్తున్నారని తెలిపారు. పది రాష్ర్టాల కూలీలకు పని కల్పిస్తున్నామని వివరించారు. మళ్లీ వచ్చేది కేసీఆరేనని, కాంగ్రెస్‌కు ఓటేసి ఎందుకు రిస్క్ తీసుకోవాలని ప్రశ్నించారు. హైదరాబాద్ న్యూయార్క్‌లా ఉందని సినిమా హీరో రజనీకాంత్ మెచ్చుకున్నారని, ఇక్కడున్న కాంగ్రెస్ గజనీగాళ్లకు మాత్రం ఇంకా అర్థం కావడం లేదని అన్నారు.
తాను కాంగ్రెస్‌లో 34 ఏండ్లు పనిచేసినా తగిన గుర్తింపు లభించలేదని నగేశ్ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో బీసీలను మనుషులుగా కూడా చూడడం లేదని, పొన్నాల ఏడ్చుకుంటూ పార్టీని వీడారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారని తెలిపారు.