మక్తల్, జూలై 3 : ఓటర్ జాబితాలో అక్రమ ఓటరు నమోదుకు కాంగ్రెస్ ఆజ్యం పోస్తున్నదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు అక్రమ ఓటర్లకు వంత పాడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం బూత్ స్థాయి అధికారులను ఓ కిరాణా షాపులో కూర్చోబెట్టి.. అక్రమంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగించకుండా.. ఎన్యుమరేషన్ ఫారాలు రాయిస్తున్న విషయాన్ని తెలుసుకొని తాను హుటాహుటిన అక్కడికి వెళ్లినట్టు చిట్టెం తెలిపారు. ఇదే విషయమై బూత్ స్థాయి అధికారులను నిలదీసినట్టు చెప్పారు. ‘సర్’ కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు, ఓటర్ల ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు నమోదు చేయాలని, కానీ మక్తల్‌లో దుకాణంలో కూర్చొని అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పిన విధంగా, బూత్ స్థాయి అధికారులు ఎన్యుమరేషన్ ఫారాలు నింపడం ఏమిటని ప్రశ్నించారు. ఈ దృశ్యాన్ని చూసిన చిట్టెం మక్తల్ తహసీల్దార్ సతీశ్‌కుమార్‌ను పిలిపించి నిలదీశారు. ప్రతి ఓటరకూ పూర్తి అవగాహన కల్పించడంతోపాటు, న్యాయమైన విధానంలోనే సవరణలు జరుగాలని తహసీల్దార్‌కు సూచించారు.