హైదరాబాద్, మే 25(నమస్తే తెలంగాణ): ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకం నిలిచిపోయిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మంజూరైన వారికీ నిధులు విడుదల కాకపోగా, ఇంకా పరిశీలించాల్సిన దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్లో ఉండడమే ఇందుకు నిదర్శనం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం కూడా ఈ వాదనలకు బలాన్ని చేకూర్చుతున్నది.
ముగుస్తున్న విద్యా సంవత్సరానికి సంబంధించి వివేకానంద విదేశీ విద్యా పథకానికి వెయ్యి వరకూ దరఖాస్తులు రాగా, పరిశీలన సందర్భంగా 500 దరఖాస్తులకు అర్హత ఉన్నట్టు తేలింది. వీరిలో 200మందికి ఇంటర్యూ లు నిర్వహించి రూ. 20లక్షల చొప్పున ని ధుల మంజూరీ పత్రాలు ఇవ్వగా, మరో 300 మందికి ఇంటర్యూలు నిర్వహించా ల్సి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో గతంలో మంజూరీ పత్రాలు జారీ చేసిన విద్యార్థులకు ఇంకా నిధులు విడుదల కాలేదు. విదేశాలకు వెళ్లిన ఈ 200మంది విద్యార్థులు, ఇప్పటివరకు నిధులు విడుదల కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, వెంటనే వివేకానంద విదేశీ విద్యా పథకానికి నిధులు మంజూరుచేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని బ్రాహ్మణ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.