కరీంనగర్ కార్పొరేషన్, జూలై 29 : మతపరమైన రిజర్వేషన్లను కాంగ్రెస్ అంగీకరించదని, రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో బీజేపీ నాయకులు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం కరీంనగర్‌లోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్‌కు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చిన బీజేపీ, కేంద్రంలో మాత్రం ముస్లింలు ఉన్నారంటూ అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలోని ముస్లింలలో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే బీసీలుగా అవకాశం ఉంటుందని, కాంగ్రెస్ ఎక్కడా మతపరమైన రిజర్వేషన్లు అంగీకరించడంలేదని తెలిపారు.