హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడాన్ని మండలిలో విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి ఖండించారు. ప్రభుత్వం ప్రజాసమస్యలు చర్చించడంలేదని, కేవలం బిల్లులు ప్రవేశపెట్టి, పాస్ చేయించుకుంటున్నదని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల వల్ల ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశముంటుందని చెప్పారు. ప్రజల సమస్యల పరిషారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని విమర్శించారు. తూతూమంత్రంగా సభను నడిపిస్తున్నారని, పనిగంటలు తగ్గించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో చర్చించే అవకాశం లేకున్నా ప్రభుత్వ వైఖరిపై ప్రజాక్షేత్రంలో పోరాడుతామని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల పాలనలో రూ.1.58 లక్షల కోట్ల అప్పు చేసినట్టు చెప్తున్నదని, 9 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అ ప్పు కేవలం రూ.4.17లక్షల కోట్లు మాత్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. అప్పుల విషయంలో పదేపదే కేసీఆర్‌ను బద్నామ్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తూ, సభను, ప్రజలను తప్పు పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతీ అప్పున కు సరైన లెకలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శాసనమండలి ఆవరణలో మండలి విపక్షనేత మధుసూధనాచారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ‘అప్పులు ఘనం.. అభివృద్ధి శూన్యం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో’ అంటూ నినాదాలు చేశారు. రూ.1.58లక్షల కోట్ల అప్పుచేసి, ఎంతమంది మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం, వృద్ధులకు రూ.4 వేల పింఛన్, ఆడపిల్లలకు సూటీలు ఇచ్చారని, తులం బంగారం ఇచ్చారని నిలదీశారు. కాంగ్రెస్ 15 నెలల పాలనలో రూ.1.58 లక్షల కోట్లు అప్పుచేసినా అభివృద్ధి మాత్రం సున్నా అని విమర్శించారు.
అవినీతి, మోసానికి ప్రతీక బడ్జెట్
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ మార్క్ కరప్షన్‌కు, కాంగ్రెస్ మార్క్ కన్నింగ్నెస్కు పర్ఫెక్ట్ బ్లాక్ అండ్ వైట్ ప్రూఫ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రాష్ట్ర అప్పుల విషయంలో పదేపదే అద్భుతంగా అబద్ధాలు చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇవాలో, రేపో గిన్నిస్ రికార్డు ఇచ్చే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. శాసనమండలిలో శుక్రవారం జరిగిన బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న కవిత.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం, మంత్రులు చెప్తున్న అబద్ధాలను ఎత్తిచూపారు. రాష్ర్టానికి చోదకశక్తిగా ఉండాల్సిన ముఖ్యమంత్రి నేషనల్ మీడియాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అబద్ధాలు చెప్తూ తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు.
‘మూలధన వ్యయం కింద నెలకు రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోతున్నామని సీఎం అంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం కాలంలో మూలధన వ్యయం కింద మొత్తం రూ.33,087 కోట్లు ఖర్చు చేసింది. అంటే నెలకు సగటున రూ.2,750 కోట్లు ఖర్చు చేశారు. ముఖ్యమంత్రికి ఈ విషయం తెలిసి కూడా కేవలం బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను బద్నాం చేయడానికే నెలకు రూ. 500 కోట్లు ఖర్చు చేయలేకపోతున్నామని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు అప్పులపై అబద్ధాలు బంద్ చేయాలని, లేకుంటే ఈనెల 27న సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధాన్యాలేమిటో ఎవరికీ అంతుపట్టడంలేదని కవిత విమర్శించారు. మొదటి బడ్జెట్లో కేసీఆర్‌ను తిట్టి , రెండో బడ్జెట్లోనూ కేసీఆర్‌నే తిడతామంటే ప్రజలు మెచ్చరని చెప్పారు. ‘మీ తిట్లతో ప్రతిపక్ష పార్టీగా మాకు వచ్చే నష్టమేమి లేదు. మీరెన్ని తిట్లు తిట్టినా మీ మీద పోరాటం చేసే మేము తెలంగాణ తెచ్చుకున్నాం’ అని అన్నారు. ఈ ప్రభుత్వానికి ఎలాంటి విజన్ లేదని విమర్శించారు.