Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ పనితీరుపై పలువురు మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వ నిర్ణయాలు, విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ పూర్తిగా విఫలమైనట్టు అసహనం వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం. అందుకే ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ప్రజల్లో తమపై వ్యతిరేక భావనకు ఇదే ముఖ్య కారణమని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది. ‘ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. పార్టీ దానిని భుజాలకు ఎత్తుకొని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలి.
ఈ విషయంలో మా పార్టీ పూర్తిగా ఫెయిల్ అయ్యింది’ అంటూ ఓ మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. ఇందుకు ఇటీవలి సంఘటనలే ఉదాహరణగా చెప్తున్నారట. ప్రతిష్టాత్మకంగా నాలుగు పథకాలను ప్రారంభిస్తే పార్టీ సరిగా పనిచేయకపోవడంతో ప్రజల్లో సానుకూలత కన్నా వ్యతిరేకతే పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారట. ఇక కులగణన సర్వే విషయంలోనూ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయినట్టు మండిపడుతున్నారట. పాలన గాడిలో పడక, పార్టీ సరిగా లేక ప్రజల్లో చులకవుతున్నామని వాపోతున్నట్టు సమాచారం.