Congress | కూట్లె రాయి తియ్యలేనోడు ఏట్లె రాయి తీస్తనంటే నమ్ముదమా? వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ పాలన చేతగాక కన్నడ రాష్ట్ర ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తున్న కాంగ్రెస్ పాలకులు.. బతుకమ్మను పేర్చినట్టు వనరులన్నీ ఒక్కొక్కటీ సమకూర్చుకుంటూ ఎదుగుతున్న పదేండ్ల పసికూన తెలంగాణను ఆగం చేసేందుకు గ్యారెంటీ హామీలతో మాటల గారడీతో ఏమార్చుతు న్నారు. అవినీతి పాలకుల ‘చేతు’ల్లో నలిగిపోతున్న కన్నడిగుల గతి తెచ్చుకుందామా..? పాలనా పగ్గాలు బదలాయిద్దామా.. వద్దా? తేల్చుకునేముందు కన్నడ నాట కాంగ్రెస్ ఆడుతున్న తొండి ఆటను పరిశీలిద్దాం!
కర్ణాటక ప్రజల పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారయ్యింది. కొలువుదీరిన ఆరు నెలల్లోనే యావత్తు కర్ణాటకను కాంగ్రెస్ కకావికలం చేసింది. ఎన్నికల ప్రచారంలో ‘5 గ్యారంటీల ప్రకటనలు’ చూసి ఆశపడ్డ కన్నడిగులకు హస్తం పార్టీ నిరాశే మిగిల్చింది. కరెంటు కోతలు, సాగు, తాగునీటికి కష్టాలు, రైతన్నల ఆత్మహత్యలు, పెచ్చరిల్లిన అవినీతి, దిగజారిన శాంతిభద్రతలు, పడకేసిన పారిశ్రామికం, కంపెనీల పలాయనం, పడిపోయిన రియల్ ఎస్టేట్, ట్యాక్స్‌ల పేరిట వాత, ప్రభుత్వంలో అస్థిరత వెరసి ‘కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశామా?’ అని కర్ణాటక ప్రజలు రోజూ తలబాదుకొంటున్నారు. ఇదీ కర్ణాటకలో ఆరు నెలల కాంగ్రెస్ పాలన రిపోర్ట్ కార్డు.
రికార్డు సమయంలోపే ఎన్నికల్లో ఇచ్చిన 5 గ్యారంటీలను కర్ణాటకలో పూర్తిగా అమలు చేశామని గప్పాలకు పోతూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమంతా బూటకమేనని తేలింది. గృహజ్యోతి, శక్తి, గృహలక్ష్మి, యువనిధి, అన్నభాగ్య వంటి ఐదు గ్యారంటీల అమలులో ‘చేతు’లెత్తేసింది. ఇది చాలదన్నట్టు తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకు కర్ణాటకలో పథకాలను విజయవంతంగా అమలు చేసినట్టు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌పై మేధావి వర్గాలు మండిపడుతున్నాయి.
1. గృహజ్యోతి:
ఈ స్కీం ద్వారా ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని సవాలక్ష కొర్రీలు పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 2.14 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందనుకుంటే 8 లక్షల కుటుంబాలకే పరిమితం చేశారు. చార్జీలను పెంచడమే కాక అర్హుల ఎంపికలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో బిల్లు గతం కన్నా మూడింతలు ఎక్కువగా వస్తుందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
2.శక్తి:
ఈ స్కీంకు నిధుల కటకట ఏర్పడింది. అంచనాలకు మించి మహిళలు ఫ్రీ బస్సులను వినియోగిస్తుండటంతో డీజిల్ మోత మోగింది. దీంతో ప్రభుత్వం అనేక మార్గాల్లో బస్సు సర్వీసులను నిలిపివేసింది. గతంలో 10 నిమిషాలకు వచ్చే బస్సు, ఇప్పుడు 40 నిమిషాలైనా రావట్లేదంటూ మహిళలు మండిపడుతున్నా రనేది ‘ది హిందూ’ న్యూస్ పేపర్ ఇటీవల చేసిన సర్వే సారాంశం.
3.గృహలక్ష్మి:
ఇప్పటివరకు వివిధ పోర్టల్స్ ద్వారా 1.3 కోట్ల మంది మహిళలు ఈ స్కీం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఎంపికైనట్టు ఫోన్లకు మెస్సేజీలు వచ్చాయి. డబ్బులు కొన్ని వందల మందికే వచ్చాయి.. అదీ ఒక్క నెల మాత్రమే. మహిళలకు నెలకు రూ.2 వేలు సాయం చేస్తామని మాట తప్పడాన్ని నిరసిస్తూ మహిళలు సీఎం సిద్ధరామ య్యతోనే వాగ్వాదానికి దిగిన ఘటన ఇటీవల సంచలనమయ్యింది.
4.యువనిధి:
ఈ స్కీం కింద గ్రాడ్యుయేషన్ పూర్తయిన నిరుద్యోగులకు నెలకు రూ.3,000, డిప్లొమా చేసినవారికి రూ.1,500 నిరుద్యోగ భృతిగా చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రెండేండ్లపాటు ఈ భృతి కొనసాగుతుందని పేర్కొన్నది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఈ స్కీం ఇంకా ప్రారంభం కాలేదు. రాష్ట్రంలో నిరుద్యోగుల లెక్కలు తెలియాల్సి ఉన్నదని కాలయాపన చేస్తున్నది.
5.అన్నభాగ్య:
అధికారంలోకి రాగానే స్కీం ప్రారంభిస్తున్నామని ప్రకటించిన కాంగ్రెస్.. ఉచిత బియ్యాన్ని సరఫరా చేయడంలో ఫెయిలయ్యింది. బియ్యం దొరకడం లేదంటూ గగ్గోలు పెడుతున్నది. మొత్తం 10 కిలోల్లో కేంద్రం ఇచ్చే 5 కిలోల బియ్యమే పంపిణీ చేస్తూ మిగతా 5 కిలోల బదులు నగదును జమ చేస్తామని చెప్పుకొచ్చింది. అర్హులకు నెలకు రూ.170 జమ చేస్తున్నట్టు వెల్లడించింది.
సవాలక్ష సమస్యలతో రాష్ట్ర ప్రజానీకం ఇబ్బందులు పడుతుంటే అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. సిద్ధరామయ్యను సీఎంగా.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పైకి స్వాగతించినప్పటికీ, లోలోన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ వ్యవహారం క్యాంపు రాజకీయాల వరకు వెళ్లింది. దీంతో ఎప్పుడు ఎవరు తిరుగుబాటు చేస్తారా? ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందా? అనేలా పరిస్థితులు దిగజారాయి. సీనియర్ మంత్రి సతీశ్ జార్కిహోళి వంటి మరికొంత మంది నేతలు కూడా సీఎం రేసులోకి వస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బెంగళూరుతోపాటు పరిసర 110 గ్రామాల ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. కావేరి ప్రాజెక్టు-5 పనులు నత్త నడకన కొనసాగుతుండటమే దీనికి కారణం. వచ్చే డిసెంబర్ నాటికి 4 లక్షల కుటుంబాలకు నల్లా కనెక్షన్‌తోపాటు నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా రూ.5,500 కోట్లతో 2007లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. నిధుల విడుదల, అవినీతి ఆరోపణలతో పనుల్లో జాప్యం నెలకొన్నది. డెడ్‌లైన్‌కు ఇంకా నెల గడువు ఉండగా, 15 శాతం పనులు పూర్తి కావాల్సి ఉన్నది. పనులు పూర్తయిన 51 గ్రామాల్లో నీటి సరఫరా జరగలేదు. ఇందుకోసం రోజూ 77 కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇందుకు కావేరి మేనేజ్మెంట్ అథారిటీ అనుమతులు ముందస్తుగా తీసుకోవాలి. ఆ ప్రక్రియ ఇంకా జరగలేదని అధికారులు చెబుతున్నారు.
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచే బెంగళూరులో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయ్యింది. కాంగ్రెస్ అసమర్థ విధానాలు, ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతి, పాలసీల అమలులో వేగం లేకపోవడంతో కొనుగోలుదారులు, పారిశ్రామికవేత్తలు ఇతర నగరాలకు వెళ్తున్నారని స్థిరాస్తి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వెస్టియన్, సీబీఆర్ఈ, కుష్మన్ అండ్ వెక్‌ఫీల్డ్, అనరాక్ వంటి ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థల నివేదికలు బెంగళూరులో రియల్ ఎస్టేట్ పడిపోయిందని పేర్కొన్న విషయాన్ని బెంగళూరు రియల్టర్లు ఉటంకిస్తున్నారు.
విద్యుత్తు కోతలు పారిశ్రామికవర్గాలను కలవర పెడుతున్నాయి. ఇప్పటికే కుదేలైన బళ్లారి జీన్స్ వంటి పరిశ్రమలకు కాంగ్రెస్ సర్కారు విద్యుత్తు షాక్ ఇచ్చింది. పండుగ సీజన్ల నేపథ్యంలో వేల కోట్ల విలువైన ఆర్డర్లను ఒప్పుకొన్నామని, విద్యుత్తు కోతలు విధిస్తే, బట్టలను ఎలా డెలివరీ చేస్తామని పరిశ్రమల యజమానులు మండిపడుతున్నారు. పగటిపూట 6-12 గంటలపాటు, రాత్రుళ్లు దాదాపు పూర్తిగా కరెంటు కోతలు విధిస్తున్నారని వాపోతున్నారు.
సర్కారు అసమర్థ విధానాలు, ఉదాసీన వైఖరితో పరిశ్రమలు కర్ణాటకను వదిలి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం కేన్స్ టెక్నాలజీస్ తొలుత మైసూరులో రూ.2,800 కోట్లతో ప్లాంట్‌ను ప్రారంభించాలని నాలుగు నెలల కిందట ప్రతిపాదనలు పంపింది. సర్కారు నుంచి సమాధానం రాకపోవడంతో కంపెనీ ప్రతినిధులు ప్లాంట్‌ను తెలంగాణకు తరలించారు.
ప్రజలపై కాంగ్రెస్ పన్నుల భారం మోపుతున్నది. బెంగళూరు, పరిసర ప్రాంతాల్లోని కమర్షియల్ స్థలాలపై పన్నును 25-70 శాతం మేర పెంచింది. ‘గైడెన్స్ వ్యాల్యూ’ పేరుతో అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. బెంగళూరుకు దూరంగా, మౌలిక వసతులే లేని ఏడు జోన్లలోని జాగాలపై 50 శాతం మేర పన్ను పెంచడం విమర్శలకు తావిస్తున్నది. తెలంగాణ ఎన్నికల్లో డబ్బు పంపిణీ కోసమే ఈ ట్యాక్స్ తీసుకొచ్చారన్న విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి.
వ్యవసాయానికి నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ వాగ్దానాన్ని పక్కనబెట్టింది. కనీసం ఐదు గంటలైనా కరెంటివ్వండంటూ అన్నదాతలు రోడ్లెక్కినా పట్టించుకున్న పాపాన పోలేదు. సాగునీరు అందక చేతికొచ్చిన పంట ఎండిపోతుంటే అన్నదాతలు సొంత డబ్బులతో నీటి ట్యాంకర్ల ద్వారా పంటను కాపాడుకొంటున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హెస్కామ్ కార్యాలయానికి ట్రాక్టర్లో ఓ రైతు మొసలిని తీసుకొచ్చారు. గుల్బర్గా జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆందోళనలు చేసిన రైతులను ప్రభుత్వం అరెస్టు చేయించడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది.
ఐదు గంటల విద్యుత్తుతో చేతికొచ్చిన పంటలు ఎండిపోయాయి. అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కర్ణాటకలో సెప్టెంబర్ చివరి నాటికి 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు అధికారిక లెక్కలే చెప్తున్నాయి. అయితే, రైతుల మరణాలపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి శివానంద్ పాటిల్ కారుకూతలు కూశారు. నేతలు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం నుంచి ఇప్పించేందుకు రైతు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు. వేర్వేరు కారణాలతో జరిగిన రైతు మరణాలను ఆత్మహత్యలని చెప్తున్నారని ఆరోపించారు. పరిహారాన్ని రాబట్టడానికే రైతు సంఘాల నాయకులు ఇలా చేస్తున్నారన్న మంత్రి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదానికి దారి తీశాయి. సదరు మంత్రి గుల్బర్గా కాంగ్రెస్ నాయకుడు అయాజ్‌ఖాన్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని కరెన్సీ నోట్ల వర్షంలో ఉల్లాసంగా గడిపి విమర్శల పాలయ్యారు.
మౌలిక వసతుల కల్పనను పట్టించుకోకపోవడంతో బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు అంతకంతకూ పెరిగిపోయాయి. 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతున్నది. ఇటీవల జరిగిన మూడు ఘటనలు బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ మహిళ కూరగాయలను ఒలుచుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. ట్రాఫిక్‌లోనే వంట కూడా చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. ట్రాఫిక్ జావ్ులో చిక్కుకున్న కొందరు పిజ్జాకు ఆర్డర్ ఇవ్వడం, ఆన్టైవ్ులోనే డెలివరీ అవ్వడం వైరల్‌గా మారింది. ఓ షాపింగ్‌మాల్ పక్కన గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఓ వ్యక్తికి ‘మీ షాపింగ్ అనుభవం ఎలా ఉంది?’ అంటూ గూగుల్ నుంచి నోటిఫికేషన్ రావడం హాస్యాస్పదం. దీపావళి రోజు రోడ్లమీద ట్రాఫిక్‌లోనే పండుగ చేసుకోవాల్సి వచ్చిందంటూ పలువురు మండిపడ్డ సిత్రాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
కరెంటు బిల్లుల మోత
‘కాంగ్రెస్ వస్తే, కరెంటు కోతలు వస్తాయి’ అన్నది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే కామెంట్. దీన్ని నిజం చేస్తూ దీపావళి రోజు కూడా బెంగళూరు నగరంలో విద్యుత్తు కోతలు విధించారు. ఎఫ్ఏసీ పేరిట యూనిట్‌కు 85 పైసలను నవంబర్ నుంచి అదనంగా పెంచుతూ బీఈఎస్‌సీవోఎం ప్రకటించింది. మూడేండ్లకుగాను స్పెషల్ పవర్ టారిఫ్‌ను తీసుకొస్తున్నట్టు పారిశ్రామికవేత్తలకు సర్కారు తాజాగా షాక్ ఇచ్చింది.
సామాన్యుల కడుపు నింపే ఇందిర క్యాంటీన్లను ప్రభుత్వం మూసివేస్తున్నది. బీబీఎంపీ ఆధ్వర్యంలో బెంగళూరువ్యాప్తంగా 175 శాశ్వత ఇందిర క్యాంటీన్లు, మరో 24 మొబైల్ క్యాంటీన్లు, 19 కిచెన్లు నడిచేవి. ఇందులో 23 క్యాంటీన్లు, 11 కిచెన్లకు తాజాగా తాళం వేశారు. ఫుడ్ సప్లయర్లు, క్యాంటీన్ల నిర్వాహకులకు చెల్లింపుల్లో జాప్యం జరగడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. మహిళా భద్రత ఎక్కడ?
బెంగళూరులో మహిళలకు భద్రత కరువవుతున్నది. ఈ నెల 8న రాత్రివేళ కొందరు ఉద్యోగినులు ప్రయాణిస్తున్న కారును కొందరు ఆకతాయిలు వెంబడించారు. బాధితుల్లో ఒకరి భర్త ఈ విషయాన్ని ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ పోస్టుపై స్పందించిన నెటిజన్లు తమకు ఎదురైన అలాంటి ఇబ్బందికర ఘటనలను షేర్ చేశారు.
కాంట్రాక్టర్లు, బదిలీల్లో కమీషన్లు అడుగుతున్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, మంత్రి ప్రియాంక్ ఖర్గేపై అరోపణలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం తమను కమీషన్ అడుగుతున్నారంటూ బృహత్ బెంగళూర్ మహానగర పాలక కాంట్రాక్టర్ల సంఘం ఆరోపణలు చేసింది. మంత్రి ప్రియాంక్ పరిధిలోని కియోనిక్స్లో కమీషన్ల దందా పెరిగింది. బిల్లుల క్లియరెన్స్ కోసం ఎండీ లంచం డిమాండ్ చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘క్యాష్ ఫర్ పోస్టింగ్స్’ స్కావ్‌ు దుమారం రేపుతున్నది. చిన్నారుల పోషకాహార పంపిణీలో రూ.600 కోట్ల మేర అక్రమాల నేపథ్యంలో మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు నమోదయ్యింది.
…? కడవేర్గు రాజశేఖర్