ఖమ్మం, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలుగు ప్రజల ఆరాధ్యనటుడు, రాజకీయ సంస్కరణలకు ఆద్యుడు, ప్రజా సంక్షేమానికి నాంది పలికిన నేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (NTR) 60 అడుగుల విగ్రహం ఖమ్మం లకారం పార్కులో నిరాదరణకు గురవుతున్న ది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల ఆకాంక్ష మేరకు ఆయన అభిమానుల తోడ్పాటుతో 60 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని లకారం ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటుచేశారు. నిర్వహణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం, లైటింగ్ సదుపాయాన్ని కూడా మెయింటైన్ చేయకపోవడంతో అంధకారంలో ఉంటున్నది. మాటల్లో ఎన్టీఆర్‌ను ప్రశంసించడమే తప్ప 60 అడుగుల విగ్రహ ఆలనాపాలనను పట్టించుకునే వారే కరువయ్యారని, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఖమ్మంలో 60 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం
తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్టీఆర్ అభిమానులు.. పట్టణంలో 60 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని 2023 తొలి నాళ్లలో నిర్ణయించారు. విదేశాల్లో స్థిరపడిన ఖమ్మం జిల్లా ప్రముఖుల సహకారంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అప్పటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టారు. ఎన్నారైలు, ఖమ్మంలోని ఎన్టీఆర్ అభిమానులు సమకూర్చిన సుమారు రూ.2 కోట్లతో ఈ విగ్రహాన్ని ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటుచేశారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 2023 సెప్టెంబర్ 30న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
తొలుత రూ.10 లక్షలు వృథా
హుస్సేన్‌సాగర్‌లోని గౌతమబుద్ధుడి విగ్ర హం మాదిరిగా లకారం చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసేందుకు నిర్ణయించారు. రూ.10 లక్షలతో పిల్లర్, స్లాబ్ నిర్మించారు. నీటి మధ్యలో విగ్రహాన్ని పెడితే ఆకర్షణీయంగా ఉంటుందని భావించారు. అయితే, కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో చెరువులో విగ్రహాన్ని ఏర్పాటుచేయొద్దని కోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో తొలుత ఖర్చు చేసిన రూ.10 లక్షలు వృథా అయ్యాయి.
పువ్వాడ చొరవతో విగ్రహం ఏర్పాటు
ఆ తరువాత, అప్పటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ, కృషితో ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటైంది. కోర్టు తీర్పు ప్రకారం చెరువు మధ్యలో విగ్రహం పెట్టకూడదు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. చెరువులో కాకుండా చెరువు పక్కన ఏర్పాటుచేసేందుకు నిర్ణయించారు. అయితే, విగ్రహ ఏర్పాటుకు స్థలం కావాల్సి వచ్చింది. లకారం ట్యాంక్‌బండ్‌ను ఆనుకొని ఖమ్మం నగరానికి చెందిన పెంట్యాల వెంకటేశ్వరరావుకు స్థలం ఉన్నది. అక్కడ ఆయన వెంచర్ వేసి ప్లాట్లు చేశారు. పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో పెంట్యాల వెంకటేశ్వరరావు 400 గజాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు.
ఆ స్థలంలోనే 60 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. దాని పక్కనే వెంచర్ గ్రీన్‌బెల్ట్ కోసం వెంకటేశ్వరరావు స్థలం వదలడం వల్ల ఆ స్థలంలో అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఎన్టీఆర్ పేరుతో పార్కును కూడా నిర్మించింది. పిల్లలు ఆడుకోవడానికి ఆటవస్తువులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సదుపాయాలు కల్పించింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని, దానికి అనుకునే ఉన్న ఎన్టీఆర్ పార్కును 2023 సెప్టెంబర్ 30న అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లకారం ట్యాంక్‌బండ్‌పై నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారని నగర ప్రజలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ట్యాంక్‌బండ్‌ను పట్టించుకునేవారు లేకపోవడంతో ఎన్టీఆర్ విగ్రహ అడుగు భాగాన్ని కొందరు దుండగులు రాళ్లలో పగులకొట్టారని, మరోవైపు రాళ్లు ఊడిపోయాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు
ఖమ్మంలో అప్పటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ అభిమానులు, ఎన్నారైల సహకారంతో 60 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిత్యం ఈ ట్యాంక్‌బండ్ కళకళలాడేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ట్యాంక్‌బండ్‌ను పట్టించుకునే వారే లేరు. ఎన్టీఆర్ విగ్రహ రాళ్లు పగిలినా పట్టించుకునే దిక్కులేదు. మాటల్లో ఎన్టీఆర్‌ను కీర్తించేవారు ఉన్నారు కానీ, విగ్రహ బాగోగుల గురించి ఆలోచించేవారు లేరు.
-కర్నాటి కృష్ణ, స్థానిక కార్పొరేటర్