తొర్రూరు, అక్టోబర్ 4 : ‘సీఎం రేవంత్‌రెడ్డి నా శిష్యుడే.. కానీ బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నడు. పెద్ద దొంగ. ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలతో కాలం నెట్టుకొస్తున్నడు’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తాడు. ‘అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుంటే నేను రేవంత్‌ను చాలాసార్లు హెచ్చరించిన. ఇలావుంటే నీ రాజకీయం నడువదని చెప్పిన. మూడుసార్లు గెలిచిన వాడు ముఖ్యమంత్రి అయ్యిండు. ఏడుసార్లు గెలిచిన నేను మీ ముందున్నా’నని పేర్కొన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల, వెలికట్టె గ్రామాల్లో ఎంపీటీసీ క్లస్టర్ సమావేశాలు నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఎర్రబెల్లి కాంగ్రెస్ బాకీ కార్డులను విడుదల చేసి, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. చట్టపరంగా చెల్లని జీవో తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వానికి నిజంగా ధైర్యం ఉంటే ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని సవాల్ విసిరారు. రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను తరచూ వాయిదా వేస్తూ గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశాడని విమర్శించారు.
హైకోర్టు గడువు ఒత్తిడితోనే ప్రభుత్వం బీసీలపై మొసలి కన్నీరు కారుస్తూ రాజ్యాంగబద్ధం కాని జీవోను తెచ్చిందని మండిపడ్డారు. బీసీ సంఘాలు, రాజ్యాంగ నిపుణులు కూడా ఈ జీవో చెల్లదని చెప్తున్నా, ప్రభుత్వం నోరుమూసుకుని ఉండటం వెనుక కుట్ర దాగి ఉన్నదని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థ ఎన్నికల ప్రకటన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తప్ప మరెవరూ ఎన్నికలపై మాట్లాడకపోవడం కాంగ్రెస్ లోపాలను బయటపెడుతున్నదని ఆరోపించారు.
ఎన్ని సర్వేలు చేయించినా కాంగ్రెస్‌పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్నదని తెలుసుకున్న రేవంత్‌రెడ్డి మోసపూరిత పద్ధతులను అవలంబిస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 22 నెలల్లో ప్రజలపై ఎంత బాకీ పడిందో స్పష్టంగా వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన ‘కాంగ్రెస్ బాకీ కార్డులను’ ఇంటింటికీ పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ మోసపూరిత పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. తెలంగాణ అంతటా కాంగ్రెస్ వ్యతిరేక గాలి బలంగా వీస్తున్నదని చెప్పారు. ప్రజలు నిజం తెలుసుకున్నారని, మళ్లీ కాంగ్రెస్ పార్టీ మోసానికి అవకాశం ఇవ్వరని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఏకపక్షమని స్పష్టంచేశారు.